‘కాంతార’ (Kantara)లో వాళ్ల నటనకు చలించిపోయా.. భూతకోల సంప్రదాయాన్ని చిన్నతనంలో చూశా: పూజా హెగ్డే (Pooja Hegde)
దేశమంతటా సంచనలం సృష్టిస్తున్న ‘కాంతార’ (Kantara) సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde). ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు ‘కాంతార’ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. రిషబ్ శెట్టితోపాటు చిత్ర యూనిట్ పనితీరు అద్భుతమని పూజ మెచ్చుకున్నారు.
వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న పూజా హెగ్డే ఇటీవలే ‘కాంతార’ సినిమాను చూశారు. మూవీ విపరీతంగా నచ్చేయడంతో వెంటనే దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘కాంతార’ మూవీని చూశానని.. ఈ చిత్రం చాలా బాగుందని పూజా హెగ్డే అన్నారు. ప్రాంతీయ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేలా రిషబ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని చెప్పారు.
తెలిసిన కథలతో సినిమాలు తీయండి
మనకు తెలిసిన కథలనే రాసుకుని.. వాటిని మన హృదయాలకు చేరువయ్యేలా తెరకెక్కించడమే ముఖ్యమని పూజా హెగ్డే అన్నారు. రిషబ్ శెట్టి ఇలాగే చేశారన్నారు. ‘మీకు ఏం తెలుసో దాన్నే కథగా రాయండి. మీ హృదయాలకు చేరువైన, మనసులో నుంచి వచ్చిన కథలనే చెప్పండి. ‘కాంతార’లోని ఆఖరి ఇరవై నిమిషాలకు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి’ అని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
‘కాంతార’ చిత్రంలో విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు తాను చలించిపోయానని పూజా హెగ్డే అన్నారు. ‘రిషబ్ శెట్టి.. ‘కాంతార’ ఇంతలా ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోల సంప్రదాయాన్ని ఎంతో అత్భుతంగా చూపించి పెద్ద హిట్ అందుకున్నావు. రాబోయే రోజుల్లో మీరు మరెన్నో ప్రశంసలు అందుకోవాలి’ అని పూజా హెగ్డే పేర్కొన్నారు.
ఇక, రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం నుంచి తాజాగా ‘వరాహ రూపం’ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో రిలీజైంది. భూతకోల నృత్య రూపకానికి సంబంధించిన లిరికల్, మేకింగ్ చూపిస్తూ ఈ వీడియో సాగింది. పాటలో సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌ను చూడొచ్చు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.