తేనెలొలుకు తెలుగు భాషంటే.. విశ్వనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan)కు ఎందుకంత అభిమానమో తెలుసా?

Updated on Nov 07, 2022 04:11 PM IST
 ‘తెలుగువాడిగా పుట్టనందుకు బాధపడుతున్నా’ అని ఓ సందర్భంలో కమల్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు భాషపై ఆయనకు ఉన్న మమకారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు
‘తెలుగువాడిగా పుట్టనందుకు బాధపడుతున్నా’ అని ఓ సందర్భంలో కమల్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు భాషపై ఆయనకు ఉన్న మమకారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు

తేనెలొలుకు భాష అని తెలుగుకు పేరుంది. ‘తెలుంగు తీయదనం’ అని తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి లాంటి పరభాషా కవులు కూడా తెలుగును పొగిడారంటే మన భాష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మన భాషను ప్రేమించే పొరుగు వారిని తప్పకుండా గౌరవించాల్సిందే. ఆ కోవలోకి విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) వస్తారు. ఇవ్వాళ 68వ పడిలోకి అడుగు పెడుతున్న కమల్.. స్వతహాగా తమిళుడు అయినప్పటికీ తెలుగు భాష అంటే ఆయనకు మక్కవ ఎక్కువ. ఈ విషయాన్ని కమల్ పలు సందర్భాల్లో బయటపెట్టారు. 

తమిళనాట పుట్టినా తెలుగు అంటే కమల్ ప్రాణం పెడతారు. మహాకవి శ్రీశ్రీ రచనలు అంటే కమల్‌కు చాలా ఇష్టం. కమల్ ను తమిళంలో స్టార్ హీరోగా నిలబెట్టిన ‘మరో చరిత్ర’ చిత్రం తెలుగులోనే తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం సముద్రతీర పట్టణమైన విశాఖలో జరిగింది. ఈ కారణం వల్ల కూడా కమల్‌కు తెలుగు నేల, భాషపై ప్రత్యేక అభిమానం ఏర్పడిందని చెప్పక తప్పదు. 

తెలుగు సామెతలు.. వాటిలోని తీయదనాన్ని కమల్ ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని కమల్ సొంత అన్నగా భావించే ఎస్పీ బాలసుబ్రమణ్యం పలుమార్లు పంచుకున్నారు. కమల్ డబ్బింగ్ చిత్రాలకు చాలాసార్లు రచన చేసిన వెన్నెలకంటి కూడా తన సాహిత్యంతో ఆయనను ఆకట్టుకున్నారు. 

ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్‌లో కమల్ నటిస్తున్నారు

తెలుగును అమితంగా ఇష్టపడే కమల్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తమిళనాడుగా పేరొందిన ప్రాంతాన్ని ఎక్కువ కాలం పాలించినవారు, ప్రభావితం చేసినవారు తెలుగువారేనని తెలిపారు. తమిళదేశాన్ని పాలించిన చోళుల మాతృభాష తెలుగు అని.. ముఖ్యంగా రాజరాజ చోళుని కాలంలో తంజావూరు రాజధాని కావడం వల్లే అక్కడ ఎంతో తెలుగు సాహిత్యం నిక్షిప్తమై ఉందని కమల్ చెప్పారు. అంతేకాదు, స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న ‘వీరపాండ్య కట్టబొమ్మన’ కూడా తెలుగువాడేనన్నారు. ద్రవిడ ఉద్యమం నడిపిన రామస్వామి నాయగర్ కూడా తెలుగువాడేనన్న విషయాలను ‘భామనే సత్యభామనే’ చిత్రం రిలీజ్ సమయంలో కమల్ ప్రస్తావించారు.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘మంగమ్మగారి మనవడు’ సినిమా శతదినోత్సవం వేడుకలోనూ కమల్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘నేను తెలుగువాడిగా పుట్టనందుకు ఎప్పటికీ బాధపడుతుంటా’ అని కమల్ పేర్కొన్నారు. ఇక, కమల్ సినిమాల విషయానికొస్తే.. ‘విక్రమ్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నంతోనూ ఓ మూవీకి ఆయన కమిటయ్యారు.  

Read more: సెన్సిబిలిటీ ఉండే కథలనే సెలెక్ట్‌ చేసుకుంటా..‘మది’ ఒక డిఫరెంట్‌ లవ్ స్టోరి: శ్రీరామ్‌ నిమ్మల(Shreeram Nimmala)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!