కమల్ హాసన్ (Kamal Haasan) మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్: ‘ఇండియన్ 2’ (Indian 2) చిత్రంలో స్టార్ క్రికెటర్ తండ్రి
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో విశ్వనటుడు కమల్ హాసన్ (kamal Haasan) ఒకరు. ఇటీవల ‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. కమల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఫిల్మ్‌లో కథానాయికగా నటిస్తున్నారు.
‘ఇండియన్ 2’ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజ్ అప్‌డేట్ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ నటుడు కనిపించనున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ‘ఇండియన్ 2’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోల్‌కు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోను యోగ్‌రాజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
‘ఈ సినిమాలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్‌కు కృతజ్ఞతలు. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది’ అని యోగ్‌రాజ్ సింగ్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షూటింగ్ విషయానికొస్తే.. ‘ఇండియన్ 2’ సినిమా మొదటి షెడ్యూల్‌ను తిరుపతిలో పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ బాణీలు అందిస్తున్న భారతీయుడు సీక్వెల్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఇండియన్ 2’ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్‌జియాంట్ మూవీస్ బ్యానర్‌లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్‌తో పాటు కాజల్‌కు సంబంధించిన సన్నివేశాలను ఆయన చిత్రీకరిస్తున్నారని సమాచారం. కమల్‌తో 'ఇండియన్ 2', రామ్ చరణ్‌తో 'ఆర్‌సీ 15' చిత్రాలను ఏకకాలంలో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటం విశేషం.