Krack 2: క్రేజీ కాంబోలో మరో మూవీ.. రవితేజ (Ravi Teja)తో ‘క్రాక్’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
స్టార్లుగా ఎదగాలంటే క్లాస్‌తోపాటు మాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకోవాల్సిందే. నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూనే, వాటిల్లో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలనూ జోడించాల్సి ఉంటుంది. అప్పుడే మల్టీప్లెక్స్ ప్రేక్షకులతోపాటు బీ, సీ సెంటర్ల వారినీ ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది. ఒక హీరో సినిమా అన్ని సెంటర్స్‌లో ఆడటంతోపాటు యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నప్పుడే స్టార్లుగా మారగలరని సినీ పండితులూ చెబుతుంటారు.
టాప్ హీరోలుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఇలా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తూ ఈ స్థాయికి చేరుకున్నార వారే. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ కోవలోకే వస్తారు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’ చిత్రాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించిన ఆయన.. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ లాంటి సాఫ్ట్ మూవీతో క్లాస్ ఆడియెన్స్‌కు, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’తో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘బలుపు’, ‘పవర్’, ‘క్రాక్’ సినిమాలు ఆయన్ను మాస్ మహారాజాను చేశాయి.
‘ధమాకా’ (Dhamaka) చిత్రంతో మరోమారు థియేటర్లను షేక్ చేసేందుకు రవితేజ (Ravi Teja) సిద్ధమవుతున్నారు. తనకు అచ్చొచ్చిన మాస్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలనే నమ్ముకుని ప్రేక్షకులను పలకరించనున్నారీ హీరో. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. గతంలో రవితేజతో ‘క్రాక్’ లాంటి బ్లాబ్‌బస్టర్ తీసిన గోపీచంద్.. త్వరలో ‘క్రాక్ 2’ (Krack 2) ఉంటుందని ప్రకటించారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయాలు సాధించాయి.
రవితేజ–గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో వచ్చిన ‘క్రాక్’ సినిమా గతేడాది రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీలో విడుదలైన ‘క్రాక్’.. ఊహించని రీతిలో ఆడియెన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ–గోపీచంద్ కలయికలో మరో మూవీ వస్తుందంటే ఇక అభిమానులకు పండుగేనని చెప్పాలి. మాస్ మహారాజాను వైవిధ్యంగా చూపిస్తారనే పేరున్న గోపీచంద్.. తదుపరి చిత్రంలో రవితేజను ఎలా చూపిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి, ‘క్రాక్’ సీక్వెల్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.