రానా (Rana Daggubati) తండ్రిగా మాస్ లుక్‌లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ..‘రానా నాయుడు’ టీజర్ అదుర్స్
ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఏ క్యారెక్టర్ చేసినా అభిమానులను అలరిస్తారనే విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 30 సంవత్సరాలు గడుస్తున్నా అదే జోష్‌తో విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను తన నటనతో ఉర్రూతలూగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకీ.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు వెంకటేష్. దగ్గుబాటి రానా (Rana Daggubati)తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వెంకీ.. ఈసారి తన అన్నయ్య కొడుకు దగ్గుబాటి రానాతో కలిసి వెబ్ సిరీస్‌లో నటించారు. యాక్షన్, క్రైమ్ కథాంశంతో తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్‌లో వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించారు.
సిరీస్ కోసం ఆతృతగా వెంకీ ఫ్యాన్స్..
వెంకటేష్ అభిమానులతోపాటు రానా ఫ్యాన్స్ కూడా ఈ వెబ్‌సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానా నాయుడు సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రానా నాయుడు టీజర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. టీజర్‌లో వెంకీ గెటప్, రానా యాక్షన్ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచేలా ఉన్నాయి.
‘సహాయం కావాలా?’ అని రానా చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ‘మీ సహాయం గురించి మేమెంతో విన్నాం. సెలబ్రిటీలు ఎవరైనా సమస్యల్లో ఉంటే.. వాళ్లు మీకే ఫోన్ చేస్తారు. ఫిక్సర్ ఆఫ్ ది స్టార్స్’, ‘రానా భాగమయ్యాడంటే అది భారీ స్కామ్ అయ్యుంటుందని సిటీ అంతా చెప్పుకుంటోంది’ అనే డైలాగ్స్ రానా క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
గుబురు గడ్డంతో, వృద్ధుడిగా, మాస్ లుక్‌లో వెంకటేష్ (Venkatesh) గెటప్ అదుర్స్ అనిపించేలా ఉంది. రానా నాయుడు వెబ్ సిరీస్‌లో వెంకీ.. రానా (Rana Daggubati) కు తండ్రిగా నటించారు. వీరిద్దరి మధ్య జరిగే సీన్లు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘రే డొనోవన్’ అనే అమెరికన్ టీవీ సిరీస్‌కు రీమేక్‌గా రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ తెరకెక్కింది.