Ori Devuda Movie Review : ప్రేమ, పెళ్ళి విషయంలో.. దేవుడిని సెకండ్ ఛాన్స్ అడిగే భక్తుడి కథ !

Updated on Oct 21, 2022 05:00 PM IST
వెంకటేష్ ప్రత్యేక పాత్రలో, విశ్వక్ సేన్ హీరోగా నటించిన "ఓరి దేవుడా" (Ori Devuda) చిత్రం పై రిలీజ్‌‌కు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.
వెంకటేష్ ప్రత్యేక పాత్రలో, విశ్వక్ సేన్ హీరోగా నటించిన "ఓరి దేవుడా" (Ori Devuda) చిత్రం పై రిలీజ్‌‌కు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

నటీనటులు : విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్, మురళీ శర్మ, నాగినీడు

సంభాషణలు : తరుణ్ భాస్కర్

సంగీతం : లియోన్ జేమ్స్ 

నిర్మాణం :  పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి

దర్శకత్వం : అశ్వథ్ మారిముత్తు

రేటింగ్ : 3/5

ఫలక్ నామాదాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలతో పాపులర్ అయిన విశ్వక్ సేన్ కథానాయకుడిగా.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా "ఓరి దేవుడా" (Ori Devuda). సినిమా రిలీజ్‌కు ముందే, ఈ చిత్రంపై రకరకాల కథనాలు వచ్చాయి. 

"ఓ మై కడవులే" అని తమిళ చిత్రానికి రీమేక్ ఈ సినిమా. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తే ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ కావడంతో.. మన నేటీవిటీకి తగ్గట్టుగా సినిమా తెరకెక్కుతుందా? అనే అనుమానం కూడా ప్రేక్షకులలో తలెత్తింది. 

అయితే తమిళ దర్శకులకు తెలుగు చిత్రాలను తెరకెక్కించడం కొత్తేమీ కాదు. కాబట్టి, దర్శకుడు ఎవ్వరనేది పక్కన పెడితే.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులే సినిమాకి బ్రహ్మరథం పడతారన్నది మాత్రం వాస్తవం. 

కథ
ఈ సినిమాలో కథానాయకుడు అర్జున్ (విశ్వక్ సేన్) తన చిన్ననాటి స్నేహితురాలు అను (మిథిల్ పాల్కర్) ని వివాహం చేసుకుంటాడు. అయితే స్నేహితురాలిని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన, సంసారంలో కలతలు రావని అనుకోవడం కల్ల అని తర్వాత తెలుసుకుంటాడు. 

భార్య స్నేహితురాలు కావచ్చు గానీ.. స్నేహితురాలే భార్య అయితే ఆమెతో జీవించడం కష్టమని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. తనను ప్రతీ విషయానికి భార్య అనుమానించడం వల్ల.. స్వేచ్ఛను కోల్పోతున్నానని వాపోతాడు. అందుకే తనకు ప్రేమ, పెళ్ళి విషయంలో సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని తన ఇష్టదైవానికి మొరపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు (వెంకటేష్) ప్రత్యక్షమై అర్జున్‌కి జీవితంలో సెకండ్ ఛాన్స్ పొందే అవకాశమిస్తాడు. అయితే కొన్ని నియమాలు పెడతాడు.

దేవుడి వరం వల్ల జీవితంలో సెకండ్ ఛాన్స్ పొందిన అర్జున్ లైఫ్ పార్టనర్‌గా అను బదులు మీరా (ఆశా భట్)ని సెలెక్ట్ చేసుకుంటాడు. మరి ఈమెతోనైనా అతని జీవితం సవ్యంగా సాగిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే, ఈ చిత్రాన్ని చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్
ఈ సినిమాకి ప్రధాన బలం వెంకటేష్ (Venkatesh). దేవుడి పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. సున్నితమైన కథలో కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండించాడు. విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా ఫస్టాఫ్‌లో, ఆ తర్వాత సెకండాఫ్‌లో కూడా, రెండు విభిన్న ఆలోచనలు గల వ్యక్తిగా కథ గమనాన్ని బట్టి పాత్ర స్వభావాన్ని మార్చుకుంటూ.. చాలా ఈజ్‌తో నటించాడు. 

ఈ సినిమా ఫాంటసీ అంశాలు గల రొమాంటిక్ కామెడీ చిత్రమని అనుకోవచ్చు. అలాగే కథలో భావోద్వేగాలకు కూడా దర్శకుడు పెద్ద పీట వేశాడు. ఇక దేవుడికి సహాయకుడిగా రాహుల్ రామక్రిష్ణ (Rahul Ramakrishna) కూడా చాలా బాగా నటించాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. ఈ చిత్రానికి మరో బలం కెమెరా వర్క్, సంగీతం. లియోన్ జేమ్స్ అందించిన బాణీలు బాగున్నాయి. 

మైనస్ పాయింట్స్
అయితే ఇది ఎంత ఫాంటసీ చిత్రమైనా, హాస్య ప్రధానం అని కూడా అన్నారు కాబట్టి, దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది. కొన్ని చోట్ల సీన్స్ తేలిపోయాయి. సెకండాఫ్‌లో కూడా కథ కాస్త నత్తనడకన సాగుతుంది.  

ఓవరాల్‌గా ఈ సినిమా ఈ దీపావళికి మీ ఇంటిల్లిపాదికి మంచి వినోదాన్నే పంచుతుందని చెప్పవచ్చు. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!