Sreeleela: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల!.. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌కు జోడీగా నటించే చాన్స్?
చిత్ర పరిశ్రమలో నటులు వెలుగులోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఎన్ని సినిమాలు చేసినా ఫేమ్‌లోకి రానివాళ్లు ఎంతోమంది ఉంటారు. అయితే కొందరు మాత్రం ఒక్క చిత్రంతోనే స్టార్‌డమ్ సంపాదిస్తారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి చిత్రంతోనే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించనప్పటికీ శ్రీలీల (Sreeleela) అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఇప్పుడు శ్రీలీల వైపే చూస్తున్నారు. ఆమెతో సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో కలసి ‘ధమాకా’ సినిమాలో నటిస్తున్న శ్రీలీలను తమ చిత్రాల్లో తీసుకునేందుకు పెద్ద హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల ఓ బంపర్ చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన యాక్ట్ చేసే అవకాశాన్ని ఆమె దక్కించుకుందని సమాచారం.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)–మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ (SSMB28) మూవీ కోసం శ్రీలీలను చిత్రబృందం సంప్రదించారట. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీల కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇకపోతే, శ్రీలీల చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. అందులో రవితేజతో కలసి నటిస్తున్న ‘ధమాకా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘ఎన్‌బీకే108’లోనూ శ్రీలీల యాక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య కూతురిగా ఆమె కనిపించనున్నారు. ఇవే కాకుండా రామ్–బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోనూ శ్రీలీల కథానాయికగా ఎంపికయ్యారు. ఈ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో ఈ అందాల బొమ్మ అతి త్వరలో చేరిపోయేటట్లే కనిపిస్తున్నారు.