డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్ నుంచి తప్పుకున్న పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల (Sree Leela)?
డీజే టిల్లు (DJ Tillu).. చిన్న సినిమాగా విడుదలై ఎంతగా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్‌గా నిలిచింది. విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. ఎన్నో సంవత్సరాలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది డీజే టిల్లు.
తెలంగాణ యాసలో సిద్ధు చెప్పిన డైలాగ్‌లు, యాటిట్యూడ్, హీరోయిన్ నేహా శెట్టి అందచందాలు డీజే టిల్లు సినిమాను యూత్‌కు బాగా దగ్గర చేశాయి. యూత్‌కు సినిమా బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. చాలామంది ఊహించినట్టుగానే డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ను ఇటీవలే ప్రకటించింది చిత్ర యూనిట్.
కారణాలు తెలియవు కానీ..
‘డీజే టిల్లు’ సినిమాలో నేహా శెట్టి జైలుకు వెళ్లడంతోనే ఆమె క్యారెక్టర్ ముగిస్తుంది. కాగా, డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ కోసం పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల(Sree Leela)ను ఎంపిక చేశారు. కాగా ఇప్పుడు శ్రీలీల డీజే టిల్లు సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. కారణాలు ఏమిటనేవి ఇప్పటివరకు తెలియలేదు. హీరో సిద్ధుతో విభేదాల కారణంగా దర్శకుడు విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు శ్రీలీల (Sree Leela) కూడా డీజే టిల్లు సీక్వెల్ నుంచి తప్పుకున్నారనే టాక్‌తో సినిమా మరింత ఆలస్యమయ్యే చాన్స్ ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ డీజే టిల్లు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. డీజే టిల్లు (DJ Tillu) సినిమాకు కథను అందించిన సిద్ధు జొన్నలగడ్డ.. సీక్వెల్‌కు కూడా కథ ఇస్తున్నారు.
Read More : మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో చాన్స్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)! డీజే టిల్లు సీక్వెల్‌లో..