Tollywood : థియేటర్లలో ఎక్కువ రోజులు సందడి చేసిన టాలీవుడ్ టాప్10 సినిమాలు
ఒకటి రెండు వారాలు సినిమా ఆడితే చాలనుకుంటున్న రోజులివి. కొన్నాళ్ల క్రితం వరకు అయితే సినిమా 50 రోజుల పోస్టర్ పడిందంటే సూపర్ హిట్.. 100 రోజులు ఆడిందంటే రికార్డు అనేలా ఉండేది. ఇక, కొన్నేళ్ల క్రితం సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ప్రదర్శితమయ్యేవి.
365, 500, 1000 రోజులు కూడా ప్రదర్శితమైన సినిమాలు ఉన్నాయంటే నమ్మి తీరాల్సిందే. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు కూడా వంద రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడటం లేదు. 500 కంటే ఎక్కువ రోజులు ప్రదర్శితమైన టాప్10 టాలీవుడ్ సినిమాల వివరాలు పింక్‌విల్లా ఫాలోవర్స్ కోసం..
లెజెండ్ :
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హీరోగా బోయపాటి శీను దర్శకత్వం వహించిన సినిమా లెజెండ్. 2014లో విడుదలైన ఈ సూపర్‌హిట్ సినిమా ఒక థియేటర్‌లో 2017 వరకు ఆడింది. రాయలసీమలోని ఎమ్మిగనూరులోని ఒక థియేటర్‌లో వెయ్యి రోజులకుపైగా లెజెండ్ (Legend) సినిమా ప్రదర్శితమైంది. 1000 రోజుల పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.
మగధీర :
మెగాపవర్ స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోగా నటించిన రెండో సినిమా మగధీర (Magadheera). దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. 2009లో విడుదలైన మగధీర వసూళ్ల వర్షం కురిపించింది. సుమారు రూ.75 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా పలు థియేటర్లలో కొన్ని షోలు ప్రదర్శితమవుతూ వెయ్యి రోజులకుపైనే ఆడింది.
పోకిరి :
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా నటించిన సూపర్‌డూపర్ హిట్ పోకిరి (Pokiri). డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మహేష్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించారు. 2006లో విడుదలైన పోకిరి సినిమా పలు థియేటర్లలో 580 రోజులు ప్రదర్శితమైంది.
మంగమ్మ గారి మనవడు :
నటసింహం నందమూరి బాలకృష్ణ (BalaKrishna) కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో మంగమ్మ గారి మనవడు సినిమా కూడా ఒకటి. స్టార్ హీరోగా బాలకృష్ణకు క్రేజ్ తీసుకొచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 1984లో విడుదలైన ఈ సినిమా 567 రోజులు థియేటర్లలో ప్రదర్శితమై రికార్డు నెలకొల్పింది.
సమరసింహారెడ్డి :
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) నటించిన పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటివరకు వచ్చిన యాక్షన్ సినిమాలన్నింటినీ వెనక్కునెట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది సమరసింహారెడ్డి. పలు థియేటర్లలో 365 రోజులకుపైగా ప్రదర్శతమై సంచలనం సృష్టించింది.
ఖైదీ :
ఖైదీ సినిమా చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ హోదా కట్టబెట్టింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్‌తో చిరంజీవి కెరీర్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. శాంతి థియేటర్‌లో 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది ఖైదీ సినిమా. ఈ సినిమాలోని చిరంజీవి నటన, యాక్షన్‌కు అభిమానులు నీరాజనాలు పలికారు.
ప్రేమాభిషేకం :
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన అద్భుత ప్రేమకథా చిత్రం ప్రేమాభిషేకం. టాలీవుడ్‌లో విషాదాంతం ఉన్న సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఈ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లో విడుదలై 533 రోజులపాటు థియేటర్లలో ప్రదర్శితమైంది.
లవకుశ :
నందమూరి తారకరామారావు (NTR) హీరోగా 1963లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా లవకుశ. తెలుగులో తొలి కలర్ సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా 469 రోజులపాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. అప్పట్లో ఉన్న టికెట్ రేట్లతోనే కోటి రూపాయలకుపైగా షేర్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది లవకుశ సినిమా.
అడవి రాముడు :
నందమూరి తారక రామారావు (NTR) – దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అడవి రాముడు. 1977లో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఎన్టీఆర్ నటించిన హిట్ సినిమాల్లో అడవి రాముడు ముందు వరుసలో ఉంటుంది. థియేటర్లలో 365 రోజులకుపైగా ప్రదర్శితమైన ఈ సినిమా దాదాపుగా రూ.3 కోట్ల షేర్ వసూలు చేసింది.
సింహాసనం :
కృష్ణ (Krishna) హీరోగా నటించి దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ సినిమా సింహాసనం. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ సాధించి వసూళ్ల సునామీ సృష్టించింది. తెలుగులో మొదటి భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సింహాసనం సినిమాకు అప్పట్లోనే రూ. 3.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ సినిమా ఏకంగా 40కుపైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా కొన్ని థియేటర్లలో 365 రోజులకుపైనే ప్రదర్శితమైన సినిమాగా రికార్డులకెక్కింది.
Read More : Tollywood : పాట పాడి అలరించిన స్టార్ హీరోలు (తమలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించుకున్న టాప్10 స్టార్లు)