Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ స్పెషల్.. ఈ 3 చారిత్రక ప్రాంతాలలోనే హంగామా !
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా పేరు "వీరసింహారెడ్డి". గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుండి అనంతపురంలో ప్రారంభవుతోంది. ఇప్పటి వరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని మరికొన్ని సీన్లను, పలు చారిత్రక ప్రదేశాలలో చిత్రీకరించనున్నారు. అవేంటంటే ..!
పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Penna Ahobilam Lakshmi Narasimha Swamy Temple) : నందమూరి బాలకృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వీరభక్తుడన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో "వీరసింహారెడ్డి" షూటింగ్‌లోని కొంత భాగాన్ని ప్రఖ్యాత పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెరకెక్కించనున్నారు.
అయిదు అడుగుల, మూడు అంగుళాల కొలత గల లక్ష్మినరసింహ స్వామి పాదముద్రపై ఈ ఆలయాన్ని పూర్వకాలపు రాజులు నిర్మించారు. బాలకృష్ణ రేపటి నుండి ఈ ఆలయ పరిసరాలలో షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఉరవకొండ (Uravakonda) : ఉరవకొండ కూడా చారిత్రక ప్రాంతమే. అనంతపురంలోని ఈ ప్రాంతాన్ని పూర్వం ఉరగాద్రి అనే పిలిచేవారు. ఉరగ అంటే పాము అని అర్థం. పాము పడగ ఆకారంలో ఈ కొండ ఉండడంతో దీనిని ఉరగాద్రి అని పిలచేవారట. ఈ నెల 10, 11 తేదిలలో ఉరవకొండతో పాటు ఆ ప్రాంత పరిసర గ్రామాలైన ఆమిద్యాల, రాకెట్లలో కూడా "వీరసింహారెడ్డి" షూటింగ్ జరగనుంది.
పెనుగొండ కోట (Penugonda Fort) : ఇది కూడా గొప్ప చారిత్రక ప్రాంతం. ఈ నెల 12, 13 తేదిలలో "వీరసింహారెడ్డి" షూటింగ్ ఈ కోట పరిసరాలలో జరగనుంది. చాళుక్యులు, విజయనగర రాజులతో పాటు టిప్పు సుల్తాన్ లాంటి యోధులకు కూడా ఈ కోటతో సంబంధముందట. బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో గొప్ప శాసనాలు ఉన్నాయి. శత్రుదుర్భేద్యమైన కోటగా పెనుగొండ కోట ప్రఖ్యాతి గాంచింది.
నందమూరి బాలకృష్ణకు తెలుగు చరిత్ర అన్నా, సంస్కృతి అన్నా ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన సినిమాల షూటింగ్‌లను కూడా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటే గొప్ప చారిత్రక ప్రాంతాలలో నిర్వహించడం విశేషమే కదా !
Read More: 'వీరసింహారెడ్డి'గా అలరించనున్న నందమూరి బాలకృష్ణ (BalaKrishna).. ఎన్‌బీకే107’ టైటిల్ ఫిక్స్