Virata Parvam Review (విరాట పర్వం సమీక్ష): విప్లవ పోరాటాల నేపథ్యంలో సాగిన ఓ 'వెన్నెల' కథ !
సినిమా - విరాట పర్వం
నటీనటులు : రానా దగ్గుబాటి, సాయిపల్లవి
దర్శకత్వం : వేణు ఊడుగుల
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు
నిర్మాణం : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్
సంగీతం : సురేశ్ బొబ్బిలి
రేటింగ్ - 3/5
తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విరాట పర్వం (Virata Parvam) సినిమా రిలీజ్ అయింది. ఒకవైపు ప్రేమ.. మరోవైపు సాయుధ పోరాటం. ఓ జంట ఆ లక్ష్యాలను చేరుకొనే దశలో, ఊహించని మలుపులు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పిన వాస్తవిక కథ ఇది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించారు.
'నిజమైన ప్రేమ ఏదైనా చేయగలదు.. చివరకు సమాజాన్ని ఎదిరించి పోరాడగలదనే వాస్తవాన్ని' దర్శకుడు వేణు ఊడుగుల తెరమీద తనదైన పద్థతిలో చూపించారు.
విప్లవోద్యమాలు జనాలను ఎలా ప్రభావితం చేస్తాయన్న కోణంలో కథను చెప్పడానికి ప్రయత్నించారు డైరెక్టర్ వేణు. ఆ భావాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో కథానాయకుడి పేరు రవన్న. ప్రజల హక్కులను కాపాడడం కోసమే తన పోరాటం అని భావించే రవన్న పాత్రలో రానా జీవించారనే చెప్పాలి. ఇక తను ప్రేమించే వ్యక్తి లక్ష్యానికి, 'నేను సైతం' తోడ్పడతాను అంటూ ఓ సాధారణ అమ్మాయి ఉద్యమకారిణిగా మారే పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారు.
కథ ఏంటి?
‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ’ అంటూ ఎమోషనల్ కథగా సాగుతుంది విరాట పర్వం (Virata Parvam) . వెన్నెల (సాయి పల్లవి) జననానికి సాక్ష్యం.. పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఓ భీకర సంగ్రామం. వెన్నెలకు పురుడు పోసిన డాక్టర్ ఓ మహిళా మావోయిస్టు (నివేదా పేతురాజ్). పుట్టిన పాపకు ఆమె' వెన్నెల' అని పేరు పెడుతుంది.
వెన్నెల విప్లవ భావాలు కలిగిన ఓ అమ్మాయిగా పెరుగుతుంది. 'చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ వెళ్లినాడు'.. ఇలాంటి పాటలకు పుట్టినిల్లు నక్సలైట్ అరణ్య దళం. అరణ్యకు మరోపేరే రవన్న (రానా దగ్గుబాటి). ఆయన కలం నుండి జాలువారిన ఎన్నో విప్లవ గీతాలు, ఎందరో ప్రజలలో ప్రేరణను నింపుతూ ఉంటాయి. అలాంటి రవన్న కవిత్వం చదివి వెన్నెల కూడా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది.
తన జీవితంలో రవన్నను ఎలాగైనా కలవాలనుకుంటుంది వెన్నెల. కానీ ఆమెకు తన బావనిచ్చి ( రాహుల్ రామకృష్ణ) పెళ్లి చేయాలని ఆమె తల్లి దండ్రులు అనుకుంటారు. ఆ పెళ్లి ఇష్టం లేని వెన్నెల అడవులకు వెళ్లిపోతుంది. రవన్నను కలవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆమె ప్రయత్నం నెరవేరిందా? విప్లవ భావాలు నింపుకున్న వెన్నెల ప్రేమను రవన్న ఒప్పుకుంటాడా? వెన్నెలను ఇన్‌ఫార్మర్‌గా భావించిన దళ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మొదలైన విషయాలన్నీ 'విరాట పర్వం సినిమాలో చూడాల్సిందే.
రవన్నగా రానా మెప్పించాడా?
'విరాటపర్వం' (Virata Parvam) లో హీరోగా నటించిన రానా తన కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. రవన్న పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. మావోయిస్టుల్లో ఎంత ఆవేశం ఉంటుందో, దానిని తన పాత్ర ద్వారా చక్కగా చూపించారు. ఆ పాత్రకు రాసిన సంభాషణలు కూడా ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
సాయి పల్లవి నటనకు ఫిదా
వెన్నెల అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథగా 'విరాటపర్వం' సాగుతుంది. ఆమె జననం నుంచి మరణం వరకు సాగే కథలో సాయి పల్లవి తన పరిధి మేరకు నటించారు. ఇదే క్రమంలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో మంచి పరిణితి గల నటనను కనబరిచారు. ఆ పాత్ర కోసం ఆమె పడిన శ్రమ స్క్రీన్ మీద కనబడుతోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో సాయి పల్లవి నటించిన తీరు అమోఘమనే చెప్పాలి.
మాటల తూటాలను పేల్చిన వేణు
నాటి తరపు విప్లవోద్యమాల గురించి నేటి ప్రేక్షకులకు ఇలా సినిమా ద్వారా తెలియజేయడంలో దర్శకుడు వేణు ఊడుగుల సక్సెస్ అయ్యారు. . ఇలాంటి సినిమాలకు సంభాషణలు ప్రధానం. వాటిని శక్తిమంతంగా వ్రాయడం ఒక ఎత్తైతే.. మళ్లీ వాటిని నటీనటులతో చెప్పించడం అనేది మరో ఎత్తు.
‘మా ఊరిలో ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు, ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్. అలాంటప్పుడు అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’ అనే డైలాగులు థియేటర్లో పేలాయి. ‘మీరాబాయి కృష్ణుడి కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వస్తున్నాను’ వంటి సంభాషణలు బాగున్నాయి.
విరాట పర్వంలో మిగతా పాత్రలు
ఈ చిత్రంలో ప్రియమణి సీరియస్ పాత్రలో నటించారు. భారతక్క పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే రఘన్న పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఇక రాహుల్ రామకృష్ణ వెన్నెల బావగా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఇక వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు
ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మంచి బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా అడవులలో తీసిన సన్నివేశాలు కెమెరామ్యాన్ డ్యానీ పనితనానికి నిదర్శనం. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటల గురించి. సురేష్ బొబ్బిలి మంచి సంగీతాన్ని అందించారు. ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే.. వాస్తవిక కథకు దృశ్యరూపం ఇస్తూ, దర్శకుడు వేణు చేసిన ప్రయత్నం అభినందనీయమే.