Tollywood: సినిమా టైటిల్స్‌గా హిట్ పాటల లిరిక్స్! పాటగా వినిపించి తెరపై అలరించిన సినిమా పేర్లు
ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే దానిపై ప్రతిఒక్కరికీ కొన్ని అంచనాలు, ఆశలు ఉంటాయి. హీరో ఎవరు అనే దాని నుంచి హీరోయిన్‌గా నటించనున్నది ఎవరు అనే విషయాలు సినిమాపై అంచనాలను పెంచుతుంటాయి. ఇక, దర్శకుడు, కథ, బడ్జెట్, నిర్మాత వీటిపైన కూడా సినిమా సక్సెస్, కలెక్షన్ల ప్రభావం ఉంటుంది. ఈ ట్రెండ్ టాలీవుడ్ (Tollywood)లో కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది.
వీటన్నింటితోపాటు మరో ప్రధాన అంశం కూడా సినిమా సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. అదే సినిమా టైటిల్. టైటిల్ బాగుంటే సినిమాకు వెళ్లే వాళ్లు కొందరైతే, టైటిల్‌లో ఉండే డెప్త్, అర్థం దాని ద్వారా వచ్చే పాజిటివ్ టాక్ మరికొందరిని థియేటర్లకు తీసుకొస్తుంది.
ఎక్కడైనా విన్న డైలాగ్, లేదా పాపులర్ అయిన పాటలోని లిరిక్స్, సులువుగా గుర్తుండేది లేదంటే కొంత వెరైటీగా ఉండే టైటిల్ అయితే ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి కలుగుతుంది.
అందుకే సినిమా మేకింగ్, కథపై ఎంత శ్రద్ద పెడతారో, అంతకంటే ఎక్కువ ఫోకస్‌ను టైటిల్ ఖరారు చేయడంపై పెడతారు మేకర్స్. టాలీవుడ్‌లో పాపులర్ అయిన పాటల్లోని లిరిక్స్‌నే సినిమా టైటిల్స్‌గా పెట్టిన సినిమాలపై ఒక లుక్కేద్దాం..
పిల్లా నువ్వు లేని జీవితం :
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (PawanKalyan) హీరోగా తెరకెక్కిన సూపర్‌హిట్ సినిమా ‘గబ్బర్‌సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే పాట విపరీతంగా పాపురల్ అయ్యింది.
ఈ పాట లిరిక్స్‌ను సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన మొదటి సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నారు.
కెవ్వు కేక :
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ‘గబ్బర్‌సింగ్’ సినిమాలోని మరో హిట్ సాంగ్ ‘కెవ్వు కేక’. ఈ పాట లిరిక్స్ టైటిల్‌గా పెట్టుకున్నారు అల్లరి నరేష్ (Allari Naresh). ఈ సినిమాలో షమీలా మాండ్రె హీరోయిన్‌గా నటించారు. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘కెవ్వు కేక’ సినిమాకు బీమ్స్ సంగీతం సమకూర్చారు.
ఒక లైలా కోసం :
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni NageswaraRao) హీరోగా తెరకెక్కిన సూపర్‌హిట్ సినిమా ‘రాముడు కాదు కృష్ణుడు’. ఈ సినిమాలోని ‘ఒక లైలా కోసం’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలోని లిరిక్స్‌ను అక్కినేని నాగేశ్వరరావు మనుమడు అయిన అక్కినేని నాగచైతన్య సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం’ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు.
ఒకే ఒక జీవితం :
మంచు మనోజ్ (Manoj Manchu) హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా ‘Mr.నూకయ్య’. కృతి కర్బందా, సనా ఖాన్ హీరోయిన్లుగా అని కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమాలో ‘ఒకే ఒక జీవితం’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది.
2012లో విడుదలైన ‘Mr.నూకయ్య’ సినిమాలోని ఈ పాట లిరిక్‌ను శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కిన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నారు.
చిన్నదాన నీకోసం :
నితిన్ (Nithin) హీరోగా తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు నితిన్. ఈ సినిమాలో చిన్నదాన నీకోసం అనే పాట శ్రోతలను అలరించింది.
ఈ పాట లిరిక్స్‌తో నితిన్ (Nithin) హీరోగా సినిమా తెరకెక్కింది. ‘చిన్నదాన నీకోసం’ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు.
చెప్పవే చిరుగాలి :
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఒక్కడు’. యాక్షన్, లవ్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్‌కు స్టార్ ఇమేజ్ వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. చెప్పవే చిరుగాలి అనే పాట లిరిక్స్ అందరినీ అలరించాయి.
చెప్పవే చిరుగాలి టైటిల్‌తో తొట్టెంపూడి వేణు (Venu Thottempudi) హీరోగా డైరెక్టర్ విక్రమన్ ఒక సినిమాను తెరకెక్కించారు.
సాహసం శ్వాసగా సాగిపో :
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఒక్కడు’లోని మరో సూపర్ సాంగ్ ‘సాహసం శ్వాసగా సాగిపో సోదరా’. ఈ పాట లిరిక్స్‌ను నాగచైతన్య (Naga Chaitanya) సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు.
సాహసం శ్వాసగా సాగిపో టైటిల్‌తో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాను తెరకెక్కించారు. మంజుమా మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశారు.
సోగ్గాడే చిన్ని నాయనా :
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), జగ్గయ్య, జయలలిత, కృష్ణకుమారి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఆస్తిపరులు. ఈ సినిమాలోని పాపులర్ సాంగ్‌ను అక్కినేని నాగార్జున (Nagarjuna) తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా టైటిల్‌తో తెరకెక్కిన సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రాధ, సుహాసిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రాక్షసుడు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు రాక్షసుడు సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్ ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’.
ఈ పాట లిరిక్స్ టైటిల్‌గా పెట్టుకున్నారు శర్వానంద్ (Sharwanand). ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో నిత్యా మీనన్ (Nithya Menen) హీరోయిన్‌గా నటించారు.
మిస్టర్ పర్‌ఫెక్ట్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఆర్య2. ఈ సినిమా కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద హంగామా చేయలేకపోయింది. అయితే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఆర్య2 సినిమాలో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది.
ఈ పాట లిరిక్ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించారు. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది.
హలో గురూ ప్రేమ కోసమే :
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా తెరకెక్కిన సినిమా నిర్ణయం. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమల హీరోయిన్‌గా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన నిర్ణయం సినిమాలో ‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే పాట శ్రోతలను విపరీతంగా అలరించింది.
ఈ పాట లిరిక్స్‌నే టైటిల్‌గా పెట్టుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni). ‘హలో గురూ ప్రేమ కోసమే’ పేరుతో వచ్చిన సినిమాలో రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించారు.
ఎటో వెళ్లిపోయింది మనసు :
నాగార్జున (Nagarjuna), టబు హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నిన్నే పెళ్లాడుతా’. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ పాట లిరిక్స్‌తో నేచురల్ స్టార్ నాని (Nani) సినిమా తీశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
సినిమా చూపిస్త మావ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా రేసుగుర్రం. శృతిహాసన్ (Shruthi Haasan) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్ ‘సినిమా చూపిస్త మావ’ లిరిక్స్ టైటిల్‌గా వచ్చిన సినిమాలో రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా నటించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అవికా గోర్ (Avika Gor) హీరోయిన్‌గా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ చేశారు.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా :
ప్రభాస్ (Prabhas), త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా వర్షం. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాట లిరిక్స్ టైటిల్‌తో సినిమా తెరకెక్కింది.‘ నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో సిద్దార్ధ్ (Siddharth) హీరోగా, త్రిష (Trisha) హీరోయిన్‌గా చేశారు. డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు
ఊహలు గుసగుసలాడే :
నందమూరి తారకరామారావు (Nandamuri Taraka RamaRao) హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా బందిపోటు. ఈ సినిమాలో ఊహలు గుసగుసలాడే అనే పాట బాగా పాపులర్ అయ్యింది.ఈ పాట లిరిక్స్ టైటిల్‌గా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల.
నాగ శౌర్య (Naga Shourya), రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.
ఝుమ్మంది నాదం :
చంద్రమోహన్, జయప్రద హీరోహీరోయిన్లుగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సిరిసిరిమువ్వ’. ఈ సినిమాలో ‘ఝుమ్మంది నాదం’ అనే పాట శ్రోతలను విశేషంగా అలరించింది. ఈ లిరిక్ టైటిల్‌తో మనోజ్ మంచు (Manoj Manchu) హీరోగా సినిమా తెరకెక్కింది. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. ఎంఎం కీరవాణి మ్యూజిక్ చేశారు.
అహ నా పెళ్లంట :
నందమూరి తారక రామారావు (Nandamuri Taraka RamaRao), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni NageswaraRao) హీరోలుగా తెరకెక్కిన క్లాసికల్ మూవీ అహ నా పెళ్లంట. ఈ సినిమాలో పాపులర్ అయిన ఒక పాట ‘అహ నా పెళ్లంట’. ఈ పాట లిరిక్‌తో రాజేంద్రప్రసాద్, రజనీ హీరోహీరోయిన్లుగా జంధ్యాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఇదే టైటిల్‌తో అల్లరి నరేష్ (Allari Naresh) , రీతూ బర్మేచా హీరోహీరోయిన్లుగా కూడా సినిమా తీశారు దర్శకుడు వీరభద్రం చౌదరి.
తూనీగ.. తూనీగ.. :
ఉదయ్ కిరణ్ (Uday Kiran) హీరోగా తెరకెక్కిన లవ్ ఎంటర్‌టైనర్ ‘మనసంతా నువ్వే’. రీమా సేన్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటిలో తూనీగ.. తూనీగ అనే పాట బాగా పాపులర్ అయ్యింది.
ఈ పాట లిరిక్స్ టైటిల్‌గా సినిమా తెరకెక్కింది. తూనీగ.. తూనీగ.. టైటిల్‌తో రూపొందిన సినిమాతో సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin) హీరోగా పరిచయమయ్యారు.
ఇవే కాకుండా పాటల లిరిక్స్‌లోని పదాలు టైటిల్స్‌గా టాలీవుడ్ (Tollywood)లో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని సినిమాలు సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరికొన్ని మాత్రం యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకున్నాయి
Read More : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా రిలీజ్ వాయిదా! కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్