Ram Pothineni : రామ్ పోతినేని సినిమా 'ది వారియర్' నుండి కొత్త సాంగ్ విడుదల.. ఈ 'విజిల్' పాటకు అభిమానులు ఫిదా !
రామ్ పోతినేని (Ram Pothineni).. టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ ఎనర్జిటిక్ హీరోగా పాపులరైన నటుడు. ప్రస్తుతం ఈయన లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో ది వారియర్ (The Warriorr) అనే చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల అవుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది.
గతంలో ది వారియర్ (The Warriorr) చిత్రం నుండి 'బుల్లెట్' పాట ఒకటి విడుదలై సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా నిర్మాతలు ఇదే సినిమా నుండి విజిల్ (Whistle song) పేరుతో ఓ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
ఈ పాటను రచయిత సాహితీ రాయగా, ఆంటోనీ దాసన్, శ్రీనిష జయశీలన్ ఆలపించారు. పూర్తిగా మాస్ స్టైల్‌లో సాగే ఈ సాంగ్ ప్రస్తుతం జనాలను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు మ్యూజిక్ అందించిన దేవీశ్రీప్రసాద్ ఒక లెక్కలో దుమ్మురేపాడనే చెప్పాలి. ఇలాంటి పాటలకు సంగీతం అందివ్వడం ఆయనకు కొత్తేమీ కాదు.
'నాలికిట్టా మడతపెట్టి.. వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి... విజిల్ విజిల్ విజిల్.. ' అంటూ సాగే ఈ సాంగ్‌కి యూత్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే 3 మిలియన్ల వ్యూస్‌ను ఈ సాంగ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషలలో కూడా ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఒక్క ఊపు ఊపుతోంది.
రామ్ ఈ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వనున్నాడు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ సత్య పాత్రలో రామ్ (Ram Pothineni) ఇరగదీశాడని టాక్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించడం విశేషం.
ఇక దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పాలంటే, ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. గతంలో ఆయన ఆనందం, రన్, భీమా, పయ్యా, వెట్టై, అంజాన్ లాంటి తమిళ చిత్రాలకు ఎన్నింటికో దర్శకత్వం వహించారు. అంజాన్ చిత్రం తెలుగులో సికిందర్ పేరుతో కూడా డబ్ చేయబడింది. మరి ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న లింగుస్వామి (Lingusamy), టాలీవుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.
తమిళ దర్శకులు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడం కొత్తేమీ కాదు. మణిరత్నం, ఎస్ జే సూర్య, కరుణాకరన్, మురుగదాస్, కెఎస్ రవికుమార్ లాంటి దర్శకులెందరో తెలుగు చిత్రాలకు గతంలో దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శంకర్ కూడా రామ్‌చరణ్‌తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఏదేమైనా, ది వారియర్ (The Warriorr) చిత్రంపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా లింగుస్వామి యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు కాబట్టి, చిత్రాన్ని అద్భుతంగానే తెరకెక్కించే ఉంటాడని అంటున్నారు విశ్లేషకులు. పైగా రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయ్యాక, వైవిధ్యమైన మాస్ సబ్జెక్టులనే ఎంచుకుంటున్నాడు. కనుక, ఈ కాంబినేషన్ కచ్చితంగా వర్కవుట్ అయ్యే అవకాశమే ఉందంటున్నారు.