2022లో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన టాలీవుడ్ సినిమాల్లోని టాప్ 10 సీన్లు
టాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా కథ బాగుంటే సినిమాలు హిట్ అవుతాయి. ప్రతి సినిమాలోనూ మనసుకు హత్తుకునే సన్నివేశం ఒక్కటైనా ఉంటుంది.
యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలో అయితే ప్రేక్షకులతో విజిల్స్ వేయించే సన్నివేశాలు తప్పుకుండా ఉంటాయి. హర్రర్ సినిమాల విషయానికి వస్తే ప్రేక్షకుడిని థ్రిల్ చేసే సీన్లపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు దర్శకుడు. టాలీవుడ్ (Tollywood)లో సూపర్‌హిట్ అయిన సినిమాల్లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన సన్నివేశాలపై ఒక లుక్కేద్దాం..
‘అఖండ’ (Akhanda) సినిమాలో బాలకృష్ణ ఎంట్రీ :
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) నటించిన సూపర్‌డూపర్ హిట్ సినిమా అఖండ. ఈ సినిమాలో డబుల్ రోల్‌లో కనిపించారు బాలయ్య. మొదటి క్యారెక్టర్‌లో ఊరిపెద్దగా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించి అలరించారు. ఇక రెండో పాత్రలో అఘోరాగా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బాలకృష్ణ.
సినిమా మొదలైనప్పటి నుంచి ఒక రేంజ్‌లో సాగినప్పటికీ.. అఘోరాగా బాలకృష్ణ వెండితెరపై కనిపించడం, ఆ సమయంలో వచ్చే ఫైట్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.
‘డీజే టిల్లు’(DJ Tillu)లో ఇంటర్వెల్ సీన్ :
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు.
నేహా శెట్టి ఫ్లాట్‌లో శవాన్ని తీసుకుని వేరే చోట పూడ్చి పెట్టే సీన్ నుంచి ఆ సన్నివేశాన్ని వేరే వ్యక్తి చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు అడిగే సీన్, ఆ తర్వాత డబ్బుల కోసం హీరోహీరోయిన్లు చేసే పనులు, వాళ్ల మధ్య వచ్చే డైలాగ్స్ విపరీతంగా అలరిస్తాయి. అంతేకాకుండా సిద్ధును పోలీసులు అరెస్ట్ చేసే సన్నివేశంలో వచ్చే డైలాగ్స్ కూడా హైలైట్‌గా నిలుస్తాయి.
‘గాడ్‌ఫాదర్’ (GodFather) క్లైమాక్స్ :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ సినిమా గాడ్‌ఫాదర్. లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన గాడ్‌ఫాదర్.. ఫస్ట్ సీన్ నుంచి ఆసక్తిగానే సాగుతుంది. మలయాళంలో సూపర్‌హిట్ అయిన సినిమా కథలో తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పు చేర్పులు చేసి తెరకెక్కించారు దర్శకుడు మోహన్‌రాజా.
పైకి సామాన్యుడిగానే కనిపించే చిరంజీవి తన స్టామినాతో కథలో ఆసక్తి రేకెత్తిస్తుంటారు. సత్యదేవ్, చిరంజీవి, నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్‌లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక, క్లైమాక్స్‌లో బాస్ ఆఫ్ ద బాసెస్, గాడ్‌ఫాదర్ అంటూ చిరంజీవి గురించి చెప్పే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) ఇంటర్వెల్ బ్యాంగ్ :
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Junior NTR), మెగాపవర్‌స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోలుగా నటించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. పాన్ ఇండియా సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. వివిధ దేశాల్లో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్, రాంచరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం, వీరిద్దరూ కలిసి బాబును కాపాడే సీన్, క్లైమాక్స్ అన్నీ గూస్‌బంప్స్ తెప్పించేలా తెరకెక్కించారు రాజమౌళి.
ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుంది. పులులు, సింహాలు ఇతర క్రూర జంతువులను కోటలోకి తీసుకొచ్చే సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు కూడా అలరిస్తాయి.
‘భీమ్లానాయక్’ (BheemlaNayak)లోని బస్సు సీన్ డైలాగ్ :
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (PawanKalyan) హీరోగా తెరకెక్కిన సినిమా భీమ్లానాయక్. రానా దగ్గుబాటి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ‘అయ్యప్పనున్ కోషియమ్’కు రీమేక్‌గా తెరకెక్కింది. అరెస్టు అయిన తర్వాత రానా చెప్పే డైలాగ్స్, పోలీస్ స్టేషన్‌లో జరిగే సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. అక్కడ జరిగే పరిణామాల ఆధారంగానే సినిమా మొత్తం సాగుతుంది.
పవన్ కల్యాణ్‌ను అరెస్టు చేసే సమయంలో రానా చెప్పే డైలాగ్స్, వీరిద్దరి మధ్య బస్సులో జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. బస్సులో పవన్ చెప్పే ఇన్‌స్పిరేషనల్ డైలాగ్స్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులను కూడా అలరిస్తాయి.
‘కార్తికేయ2’ (Karthikeya2) సినిమాలోని అనుపమ్ ఖేర్ డైలాగ్స్ :
నిఖిల్ సిద్ధార్ధ్ (Nikhil Siddharth), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా కార్తికేయ2. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. కార్తికేయ2 సినిమాతో నిఖిల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడికి కథపై ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.
అయితే శ్రీకృష్ణుడి గురించి బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. పాశ్చాత్య కాలంలోనే సైన్స్ నేటి రోజులకంటే ఎంతో డెవలప్ అయ్యిందని, దానిని మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఆపాదిస్తూ ఆయన చెప్పే మాటలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.
‘సీతారామం’ (Seetaramam)లోని క్లైమాక్స్ సీన్ :
మనసుకు హత్తుకునే ప్రేమకథగా తెరకెక్కిన సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ అద్భుత ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించారు దర్శకుడు.
సీతారామం సినిమాలోని కీలకపాత్రలో నేషనల్ క్రష్ రష్మికా మందాన నటించారు. ఈ సినిమాలోని ప్రేమ సన్నివేశాలన్నీ మనసును హత్తుకునేవే అయినప్పటికీ.. క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రతి ఒక్కరికీ తప్పక గుర్తుండిపోతుంది. హీరోహీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ సినిమాకు హైలైట్.
‘బింబిసార’ (Bimbisara)లో పాపను కల్యాణ్‌రామ్ చూసే సీన్ :
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam).. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాలకు పెద్ద పీట వేసే సినిమాలు చేస్తుంటారు. ఆ క్రమంలో తెరకెక్కించిన సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది. కల్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బింబిసార సినిమాతో కల్యాణ్‌రామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
అనుకోకుండా జరిగిన కొన్ని పరిణామాల వలన భవిష్యత్తులోకి వచ్చిన కల్యాణ్‌రామ్.. పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో తను చంపిన చిన్న పాప తనను ఒక ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ఆ సన్నివేశంలో పాపను చూసిన తర్వాత కల్యాణ్‌రామ్ హావభావాలు అద్భుతంగా ఉంటాయి.
‘యశోద’ (Yashoda) సినిమాలో సమంత పోలీస్ అని రివీల్ చేసే సీన్ :
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సరోగసి నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా సినిమాను రూపొందించారు దర్శకులు హరి, హరీష్. ప్రెగ్నెంట్ లేడీగా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.
యశోద సినిమాలో చాలా సన్నివేశాలు హృద్యంగా ఉండేలా తెరకెక్కించారు. అయితే, సినిమాలో ఎన్నో కష్టాలు పడే యువతిగా సమంతను చూసిన ప్రేక్షకులు.. ఆమె పోలీస్ అని రివీల్ అయ్యే సన్నివేశంలో మాత్రం తప్పక షాకవుతారు.
‘మేజర్’ (Major) సినిమాలోని క్లైమాక్స్ సీన్ :
అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మేజర్. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మేజర్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ప్రారంభం నుంచి సందీప్ ఉన్ని కృష్ణన్ ప్రేమ, ఫ్యామిలీ, ఆర్మీలోకి రావడానికి ఆయన పడే తపనను మనసుకు హత్తుకునేలా చూపించారు.
టెర్రరిస్టులు తాజ్ హోటల్‌ను ఆక్రమించుకున్న సమయం నుంచి అందులో చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో అడివి శేష్ అద్భుతంగా నటించారు. ఇక, క్లైమాక్స్‌లో టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయే సన్నివేశం ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది.
Read More : Tollywood : 2023లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్ సినిమాలు