Vijay Deverakonda: గొప్ప మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. రౌడీస్టార్ కీలక నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న అభిమానులు
టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ యువ కథానాయకుడు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాను బతికున్నంత వరకు శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉండేలా చూస్తానని.. చనిపోయన తర్వాత వాటిని దానం చేస్తానని విజయ్ దేవరకొండ ఇటీవల వెల్లడించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్‌లోని పేస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో చిన్నారుల్లో కాలేయ మార్పిడి అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి విజయ్‌తోపాటు మాలావత్ పూర్ణ పాల్గొన్నారు. కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం 24 గంటల హెల్ప్ లైన్ సేవలను వీరిద్దరూ ప్రారంభించారు. చిన్నారులతో కాసేపు మాట్లాడి వారికి బహుమతులు అందజేశారు.
విజయ్ పాల్గొన్న ఈ కార్యక్రమం తాలూకు వీడియోలను ఆస్పత్రి వర్గాలు ట్విట్టర్‌లో బుధవారం పోస్ట్ చేశాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ విజయ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ అన్న’, ‘మంచి మనసున్న హీరో’ అంటూ రౌడీస్టార్‌ను మెచ్చుకుంటున్నారు. ‘అవయవ దానం చేయడం దక్షిణాసియా దేశాల్లో చాలా తక్కువ. విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షును పెంచినవారమవుతాం’ అని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.
‘ఖుషి’ వచ్చేది అప్పుడే..!
ఇకపోతే, ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ ఆసక్తిని రేపుతోంది.
ఆచితూచి అడుగులేస్తున్న రౌడీస్టార్
‘లైగర్’ చిత్రం ఫలితంతో నిరాశలో ఉన్న రౌడీస్టార్.. ‘ఖుషి’తో బంపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి, ఈ చిత్రం ఆయనకు ఏ రేంజ్ హిట్‌ను అందిస్తుందో చూడాలి. విజయ్ తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్‌తోపాటు పలువురు బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథలను ఆయన విన్నారట. అయితే వాటిలో ఇంకా దేనికీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ‘లైగర్’ ఎఫెక్ట్‌తో నెక్స్ట్ చేయబోయే మూవీస్ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.