సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం !

Updated on Jul 10, 2022 12:43 AM IST
చిరంజీవి (CHiranjeevi) నటించిన టాప్‌ సినిమాల పోస్టర్లు
చిరంజీవి (CHiranjeevi) నటించిన టాప్‌ సినిమాల పోస్టర్లు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఘనమైన స్థానాన్ని సంపాదించుకున్నారు చిరు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, మెగాస్టార్‌‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు చిరంజీవి. మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా తన డ్యాన్స్‌లు, ఫైట్లతో అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఆరు పదుల వయస్సులో కూడా యూత్‌తో పోటీ పడేలా సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు చిరంజీవి. ఇదే క్రమంలో, కోట్లాది మంది అభిమానులను అలరించడానికి కృషి చేస్తున్నారు చిరు. 150కు పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి కెరీర్‌‌లో ఎన్నో సూపర్‌‌ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న కొన్ని సినిమాలపై ఒక లుక్‌ వేద్దాం..

చిరంజీవి (Chiranjeevi) పున్నమినాగు సినిమా పోస్టర్

పున్నమినాగు (Punnami Nagu)

మెగాస్టార్ చిరంజీవి, రతి అగ్ని హోత్రి జోడీగా నటించిన సినిమా ‘పున్నమినాగు’. చిరంజీవికి నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమాల్లో 'పున్నమినాగు' ముందు వరుసలో నిలుస్తుంది. 1980, జూన్‌ 13వ తేదీన రిలీజైన ఈ సినిమాలో నరసింహరాజు మరో కీలకపాత్రలో కనిపించారు. యమ్‌.రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'పున్నమినాగు' సినిమాకు కె.చక్రవర్తి సంగీతం అందించారు.   

ఈ సినిమా ఓ పాముని ఆడించుకొని బతికే వ్యక్తి కథ. కాల క్రమేణ తన మీద విష ప్రయోగం జరగడం వల్ల, అదే వ్యక్తి తన దేహంలోని అనువనువూ సర్ప గుణాలతో  నిండిపోయిందని తెలుసుకుంటాడు.

తన శరీరంలో ప్రవహిస్తోంది కాలకూట విషమని తెలుసుకొని రోదించే సమయంలో చిరంజీవి పండించిన భావోద్వేగాలు మామూలుగా ఉండవు. ఒక అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అది. ప్రతి పౌర్ణమికి సర్పంలా మారే వ్యక్తిగా చిరు నటన నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు. 

చిరంజీవి (Chiranjeevi) శుభలేఖ సినిమా పోస్టర్

శుభలేఖ

చిరంజీవి, సుమలత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘శుభలేఖ’ సినిమాకి కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. 1982, జూన్‌ 11వ తేదీన రిలీజైన ఈ సినిమాలోని ఒక పాటలో.. వివిధ సాంప్రదాయ నృత్యకారుల వేషధారణల్లో కనిపిస్తారు చిరంజీవి. కేవీ మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

కె. విశ్వనాథ్ వరకట్న దురాచారంపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం ఈ చిత్రం. హోటల్‌లో వెయిటర్‌‌గా పని చేసే చిరంజీవి, కాలేజీలో లెక్చరర్‌‌గా పనిచేసే సుమలతల మధ్య ఏర్పడిన పరిచయం, వారిని మంచి స్నేహితులుగా మారుస్తుంది. అయితే ఓ అనుకోని సమస్య వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ఈ క్రమంలో తమవాళ్లను విడిచి వారు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారు? ఓ సాంఘిక సమస్యపై వారు చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే, ఈ చిత్రాన్ని చూడాల్సిందే . ఈ సినిమాలో నటించిన బేతా సుధాకర్‌‌ పేరు శుభలేఖ సుధాకర్‌‌గా స్థిరపడిపోయింది. 

చిరంజీవి (Chiranjeevi) అభిలాష సినిమా పోస్టర్

అభిలాష

రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘అభిలాష’. ఈ సినిమాతో నవలా నాయకుడిగా ఎదిగారు చిరు. ఒక సామాజిక అంశాన్ని తీసుకుని కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు అమాయకత్వంతో చెప్పిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులకు మెసేజ్‌తోపాటు ఫన్ కూడా అందింది. ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్.

ఈ సినిమాలో చిరంజీవి లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఐపీసీ 302 ని భారత శిక్షా స్మృతి నుంచి తొలగించడానికి ప్రయత్నించే ఒక యువ లాయర్‌‌గా చిరంజీవి నటన ఆకట్టుకుంటుంది. తన తండ్రికి జరిగిన అన్యాయం వేరే వాళ్లకు జరగకూడదనే ఉద్దేశంతో ఉరిశిక్షను విధించే సెక్షన్‌ను చట్టాల నుంచి తొలగించడానికి ప్రయత్నించడమే ఈ సినిమా కథలోని ప్రధానమైన అంశం.

చిరంజీవి (Chiranjeevi) ఖైదీ సినిమా పోస్టర్

ఖైదీ

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్‌‌ను అమాంతం పైకి ఎత్తేసిన సినిమా 'ఖైదీ'. మెగాస్టార్‌‌ కెరీర్‌‌ను ఉదహరించాలంటే 'ఖైదీ' సినిమాకు ముందు.. ఆ తర్వాత అని చెప్పుకునే స్థాయికి ఈ సినిమా చేరుకుంది. 'ఖైదీ' సినిమా హిట్‌తో చిరంజీవి కెరీర్‌‌ గ్రాఫ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.

ఈ చిత్రంతో మాస్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు చిరు. చిరంజీవి సరసన మాధవి హీరోయిన్‌గా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన 'ఖైదీ' సినిమా 1983లో రిలీజై రికార్డులు సృష్టించింది.

ఐఏఎస్ చదవాలనే ఆశయం ఉన్న చిరంజీవి..తన కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లపై ఎలా పగ సాధించాడు అనేది ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్. తన జీవితంలోని ఆటుపోట్లకు కారణమైన శత్రువులను కథానాయకుడు హతమార్చే సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ రివెంజ్ డ్రామాలో చిరంజీవి అద్భుతంగా నటించారు.  

చిరంజీవి (Chiranjeevi) స్వయంకృషి సినిమా పోస్టర్

స్వయంకృషి

తన కెరీర్‌‌లో కింది స్థాయి నుంచి మెగాస్టార్‌‌గా చిరంజీవి ఎలా ఎదిగారో.. అలాగే చెప్పులు కుట్టే స్థాయి నుంచి బిజినెస్‌ మ్యాన్‌గా అభివృద్ధి చెందిన వ్యక్తిగా చిరంజీవి నటించిన సినిమా ‘స్వయంకృషి’. ఈ సినిమాలో విజయశాంతి, సుమలత హీరోయిన్లుగా నటించారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1987 సెప్టెంబర్‌‌ 3వ తేదీన విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

చెప్పులు కుట్టుకునే చిరంజీవి కష్టపడి పెద్ద బిజినెస్ మ్యాన్‌గా ఎదుగుతాడు. తన అభివృద్ధిలో భాగమైన విజయశాంతిని పెళ్లి చేసుకుంటాడు. కష్టపడి సంపాదించిన డబ్బులతో సుమలతను చదివిస్తాడు. చనిపోయిన చెల్లెలు కొడుకు అర్జున్‌ను సొంత కొడుకులా పెంచుతాడు. చిరంజీవి ఇంట్లో గొడవలు సృష్టించి ఆస్తి కాజేయాలని అర్జున్ తండ్రి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో తన ఆస్తిని  చెల్లెలి బిడ్డ పేరిట రాసి, మళ్లీ చెప్పులు కుట్టుకునే వృత్తిని మొదలుపెడతాడు చిరు. అదే సినిమా కథ.

చిరంజీవి (Chiranjeevi) ఆపద్బాంధవుడు సినిమా పోస్టర్

ఆపద్బాంధవుడు

చిరంజీవి అద్భుత నటనకు మరో నిదర్శనం ‘ఆపద్బాంధవుడు’ సినిమా. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటనకుగాను చిరంజీవి ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నారు. అక్టోబర్ 9, 1992వ సంవత్సరంలో రిలీజైన 'ఆపద్బాంధవుడు' సినిమాకు 'హాస్య బ్రహ్మ' జంధ్యాల డైలాగ్స్ రాయడంతో పాటు, ఓ పాత్రలో నటించారు కూడా. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో నటనకుగాను చిరంజీవి నంది అవార్డు కూడా అందుకున్నారు.

చిరంజీవి (Chiranjeevi) రుద్రవీణ సినిమా పోస్టర్

రుద్రవీణ

కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘రుద్రవీణ’.  మంచి మెసేజ్‌తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. అయినా ఈ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. మార్చి 4, 1988 తేదిన రిలీజైన 'రుద్రవీణ' సినిమాలో శోభన హీరోయిన్‌గా నటించగా.. జెమినీ గణేశన్, దేవి లలిత, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం ఆల్‌టైమ్‌ హిట్‌గా నిలిచింది.

సంగీతంలో ప్రావీణ్యుడైన జెమినీ గణేశన్‌కు ఇద్దరు కొడుకులు. వారిలో ప్రసాద్ బాబు మూగవాడు. అయినా సన్నాయి నాదంలో దిట్ట. చిన్న కొడుకు చిరంజీవి తండ్రి దగ్గర సంగీతంలో శిక్షణ పొందుతూ ఉంటాడు. తక్కువ జాతిలో పుట్టిన కారణంగా నాట్యంలో ప్రావీణ్యం ఉన్నా.. శోభన అన్నింటికీ దూరంగా బతుకుతుంది. ఆమెలోని కళకు ముగ్ధుడై, తనకు చేరువ కావడానికి ప్రయత్నిస్తాడు కథానాయకుడు చిరు. ఇదే క్రమంలో కుల ప్రస్తావన తీసుకొచ్చిన తన తండ్రిని ఎదిరిస్తాడు. తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?..  తండ్రి చేతే శభాష్ అనిపించుకొనే విధంగా కొడుకు ఎలా ఎదిగాడన్నదే ఈ  సినిమా కథ. 

చిరంజీవి (Chiranjeevi) గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్

గ్యాంగ్‌ లీడర్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌‌లో మరో మైలు రాయిగా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా విజయ బాపినీడు దర్శకత్వంలో 1991, మే 9 తేదిన తేదీన విడుదలైంది ‘గ్యాంగ్‌ లీడర్‌‌’ సినిమా. మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ పెరిగింది. రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, మురళీ మోహన్, శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు చిరంజీవి. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు మురళీమోహన్. ఐఏఎస్ కావడానికి ప్రయత్నిస్తున్న శరత్‌కుమార్‌‌ను కూడా చదివిస్తూ ఉంటాడు. అయితే చిరంజీవి మాత్రం ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటాడు. ఈ క్రమంలో మురళీమోహన్‌ హత్య జరుగుతుంది. ఆ తర్వాత చిరంజీవి  తన కుటుంబాన్ని ఎలా పోషించాడు?  ఐఏఎస్ అయ్యి కూడా తన కుటుంబాన్ని వీడి, పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న చిరు సోదరుడు శరత్ కుమార్లో ఎలాంటి మార్పు వస్తుందనేదే చిత్ర కథ.

చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా పోస్టర్

ఇంద్ర

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరింత పెంచిన సినిమా 'ఇంద్ర '. ఈ సినిమాలో పవర్‌‌ఫుల్ డైలాగులు, స్టెప్స్ అభిమానులను అలరించాయి. 'ఇంద్ర ' సినిమాలో చిరంజీవి చెప్పిన మాస్ డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సోనాలీ బింద్రే, ఆర్తీ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన 'ఇంద్ర ' సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించగా.. అశ్వనీదత్ నిర్మించారు.

ఫ్యాక్షన్‌ గొడవల్లో తండ్రిని కోల్పోతాడు చిరంజీవి. సీమను కాపాడడానికి అన్నదమ్ములు ఎవరూ ముందుకు రాకపోవడంతో, తండ్రి స్ధానాన్ని భర్తీ చేయడానికి రెడీ అవుతాడు. కట్‌ చేస్తే కొన్నేళ్ల తర్వాత, కాశీలో ట్యాక్సీ డ్రైవర్‌‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో  చిరంజీవి మేనకోడలు, కాలేజీలో తన క్లాస్ మేట్ అయిన శివాజీని ప్రేమిస్తుంది. శివాజీతో తన మేనగోడలి పెళ్లిని చిరంజీవి జరిపించే  క్రమంలో సీమ నుంచి ఆర్తి అగర్వాల్ వస్తుంది. ఆ వివాహాన్ని అడ్డుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? అసలు చిరంజీవి కాశీ రావడానికి కారణం ఏమిటి? అనేది ఇంద్ర సినిమా కథ.

చిరంజీవి (Chiranjeevi) ఠాగూర్ సినిమా పోస్టర్

ఠాగూర్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులతోపాటు,  సినీ ప్రేమికులు కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా 'ఠాగూర్ '. మాస్ ఇమేజ్‌తో అభిమానులను అలరిస్తూ.. మెగాస్టార్‌‌గా ఎదిగిన చిరు చేసిన సందేశాత్మక సినిమా 'ఠాగూర్ '. జ్యోతిక, శ్రియ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే కీలకపాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన 'ఠాగూర్ ' సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. 2003 సెప్టెంబర్ 24న విడుదలైన 'ఠాగూర్ ' సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులను తిరగరాసింది.

ఓ కాలేజీలో లెక్చరర్‌‌గా పనిచేస్తూ ఉంటారు చిరంజీవి. అనాథ పిల్లలను కొందరిని దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి తెలియకుండా యాంటీ కరప్షన్ ఫోర్స్ అనే సంస్ధను కూడా స్ధాపిస్తారు ఆయన. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తూ  లంచం తీసుకునే వాళ్లను కిడ్నాప్‌ చేసి, వారిలోని  టాప్ కరప్టెడ్‌ ఆఫీసర్‌‌ను చంపేయడమే ఈ ఫోర్స్ పని.

ఈ పని చేసేది ఎవరు? అనే మిస్టరీని చేధించడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలు, ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడం వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలంటే, ఈ చిత్రం చూడాల్సిందే. 

చిరంజీవి (Chiranjeevi) సినిమా పోస్టర్లు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌‌లో ఠాగూర్‌‌కు ముందు.. ఆ తర్వాత కూడా చాలా సూపర్‌‌హిట్‌ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్నింటి గురించే ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇవే సినిమాలు కాకుండా ముఠామేస్త్రి, ఘరానా మొగుడు, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, శంకర్‌‌దాదా ఎంబీబీఎస్, ఖైదీ నంబర్ 150, అన్నయ్య, జై చిరంజీవ, బావగారూ బాగున్నారా, విజేత, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు కూడా హిట్ సినిమాలే.

చిరంజీవి చేసిన సుమారు 153 సినిమాల్లో దాదాపుగా 100 సినిమాలు హిట్‌ సినిమాలే కావడం విశేషం. తాజాగా రిలీజైన 'ఆచార్య ' సినిమా ఫలితం కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం చిరంజీవి  భోళాశంకర్, గాడ్‌ఫాదర్ సినిమాల్లో నటిస్తున్నారు.

Read More : Mega Heroes: సంక్రాంతి బరిలోకి మెగా హీరోలు! అభిమానులకు నిజంగా పండుగే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!