Tollywood : 2023లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్ సినిమాలు
జనవరి 1వ తేదీ కొత్త ఏడాది మొదలవుతుంది. తేదీలో మాత్రమే మార్పు ఉన్నప్పటికీ జనవరి 1న నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉంటారు చాలామంది. ఇక, ఇండస్ట్రీలో అయితే డిసెంబర్ నెలాఖరు వరకు వచ్చిన సినిమాలు పాత సంవత్సరానికి చెందినవిగా, జనవరి నుంచి వచ్చే సినిమాలు కొత్త సంవత్సరంలో రిలీజ్ అయ్యేవిగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ క్రమంలో 2022 డిసెంబర్ నెల గడిచిపోతోంది. 2023వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు టాలీవుడ్ సిద్ధంగా ఉంది. 2022వ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతి శుక్రవారం మంచి సంఖ్యలోనే సినిమాలు విడుదలయ్యాయి. అదే విధంగా విడుదలైన వాటిలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి.
చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు భారీ కలెక్షన్లను కొల్లగొట్టగా.. పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అంతేకాదు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ఇక, వచ్చే సంవత్సరం (2023) టాలీవుడ్ (Tollywood)లో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం..
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) :
గాడ్‌ఫాదర్ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆచార్య సినిమా రిజల్ట్‌తో కొంచెం డీలా పడినట్టు కనిపించిన చిరు.. మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల తర్వాతి ప్రాజెక్టులపై కూడా చిరంజీవి క్లారిటీతో ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే వాటికి సంబంధించి కథలను కూడా ఓకే చేశారని టాక్.
ఇక, కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 11, 2023న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది.
వీరసింహారెడ్డి (Veera Simhareddy) :
2022లో అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (BalaKrishna). కరోనాతో అతలాకుతలమైన ఇండస్ట్రీకి అఖండ సినిమా కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి.
బాలకృష్ణ లుక్, పాటలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. 2022 ప్రారంభంలోనే అఖండతో అలరించిన బాలయ్య 2023 జనవరి 11న వీరసింహారెడ్డిగా థియేటర్లలో సందడి చేయనున్నారు.
భోళా శంకర్ (Bhola Shankar) :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించనున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ భోళా శంకర్. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని టాక్. భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
2023 వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో భోళా శంకర్ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తిస్థాయిలో మొదలుకాలేదు.
ఏజెంట్ (Agent) :
అక్కినేని అభిల్ (Akhil Akkineni) హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ చాలాకాలంగా జరుగుతోంది. అఖిల్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఫిజిక్, యాక్షన్ సీన్ల చిత్రీకరణ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
శాకుంతలం (Shaakuntalam) :
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి విజయాన్ని అందుకున్నారు.
2022వ సంవత్సరానికి విజయంతో వీడ్కోలు పలుకుతున్న సమంత..2023కు కూడా అంతే సక్సెస్‌తో వెల్‌కమ్ చెప్పాలని అనుకుంటున్నారు. శాకుంతలం సినిమాతో విజయపరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఫిబ్రవరి 10, 2023న శాకుంతలం సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
దాస్ కా ధమ్‌కీ (Das Ka Dhamki)
యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwaksen) హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దాస్ కా ధమ్‌కీ. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విశ్వక్.. 2022లో అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అయితే ఓరి దేవుడా సినిమా మాత్రం అనుకున్నంత సందడి చేయలేకపోయింది.
దాస్ కా ధమ్‌కీ సినిమాను ఫిబ్రవరి 17, 2023న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
టిల్లు స్క్వేర్ (Tillu2) :
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన డీజే టిల్లు (DJ Tillu) కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2022 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
డీజే టిల్లు సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్‌తో దాని సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవలే సీక్వెల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.. టిల్లు స్క్వేర్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2023, మార్చిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
హరిహర వీరమల్లు (HariHara VeeraMallu) :
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (PawanKalyan) హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వకీల్‌సాబ్, భీమ్లానాయక్ వంటి సూపర్‌హిట్ సినిమాల తర్వాత పవన్ చేస్తున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటవలే ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్ర యూనిట్. కాగా, హరిహర వీరమల్లు సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్.
దసరా (Dasara) :
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న సినిమా దసరా. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న దసరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన నాని ఫస్ట్ లుక్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దసరా సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
రావణాసుర (Ravanasura) :
మాస్ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడి సినిమాలు ఈ ఏడాది విడుదలై నిరాశపరిచాయి. 2022 డిసెంబర్‌లో ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు రవితేజ. 2022వ సంవత్సరం మూడు సినిమాలను విడుదల చేసి అదరగొట్టిన మాస్ మహారాజా.. 2023ను కూడా అదే జోష్‌తో కొనసాగించాలని చూస్తున్నారు.
2023 ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా (SSMB28) :
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ మొదలు కానున్న సమయంలోనే మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించారు. అనంతరం ఆయన తండ్రి సీనియర్ హీరో కృష్ణ కూడా మరణించడంతో షూటింగ్ వాయిదా పడింది. ఎస్‌ఎస్‌ఎంబీ28ను ఏప్రిల్ 28, 2023న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఖుషి (Kushi) :
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న సినిమా ఖుషి. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కాశ్మీర్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఖుషి సినిమా తర్వాతి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ సినిమా ఖుషి. ఈ సినిమా టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమాకావడం, లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఖుషిపై అంచనాలు పెరిగాయి. 2023, మే 12వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.
ఆదిపురుష్ (Adipurush) :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, బాలీవుడ్ భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా 2023, జనవరి నెలలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. దసరా సందర్భంగా ఆదిపురుష్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో సినిమా విడుదలను పోస్ట్‌పోన్ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాను 2023, జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
సలార్ (Salaar) :
ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా సలార్. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్ దక్కలేదు. సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని అనుకుంటున్నారు ప్రభాస్. రాధేశ్యామ్, సాహో సినిమాలు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ సాధించకపోవడంతో ఆదిపురుష్, సలార్ సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్.
సలార్ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ప్రభాస్ మాస్ లుక్ ప్రేక్షకులకు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్ సినిమాను 2023, సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
Read More : Tollywood : వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా సత్తాచాటుతున్న టాలీవుడ్ స్టార్లు