మేజర్ (Major) టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
మేజర్ (Major) టీమ్‌ను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రశంసించారు. 26/11 మారణహోమంలో అశువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తెలుగులో రావడం ఆనందం కలిగించిందన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీర మరణాన్ని, వెండితెరపై ఆవిష్కరించిన చిత్ర యూనిట్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు పవన్. దేశాన్ని రక్షించడానికి ఎందరో సైనికులు పోరాడుతున్నారని, వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
తప్పకుండా మేజర్ చూస్తాను - పవన్ కల్యాణ్
మేజర్ (Major) సినిమాకు వస్తున్న స్పందన తెలుసుకున్నానని ఇటీవలే ఓ ప్రకటనలో పవన్ కల్యాణ్ తెలిపారు. తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా, ఇప్పటివరకు 'మేజర్' చూడలేకపోయానన్నారు. కానీ తప్పకుండా 'మేజర్' సినిమా చూస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రముఖ తెలుగు రచయిత అడవి బాపిరాజు మనుమడు, 'మేజర్' పాత్ర పోషించిన నటుడు అడవి శేష్‌కు అభినందనలు తెలిపారు.
అడవి శేష్ లాంటి హీరోలు తెలుగు సినిమా పరిశ్రమకు మరింత మంది రావాలని కోరారు. ఓ సాహస కథను గొప్పగా తీసిన దర్శకుడు శశి కిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు లాంటి అగ్ర నటుడు 'మేజర్' సినిమాను నిర్మించడం గొప్పవిషయం అంటూ పవన్ కొనియాడారు.
మేజర్ లాంటి సినిమాలు మరిన్ని రావాలి
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన 'మేజర్' (Major) సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాదించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మేజర్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
'మేజర్' సినిమాకు ఎంతో మంది ప్రముఖుల నుండి ప్రశంసలు లభించడం విశేషం. సినీ, రాజకీయ వర్గాల నుంచే కాకుండా ఆర్మీ అధికారుల నుండి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గాంగ్‌స్టర్ సినిమాలు కాకుండా.. దేశం కోసం పోరాడే వారి సినిమాలు మరిన్ని రావాలని నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.