'MAJOR' REVIEW (మేజర్ రివ్యూ): దేశాన్ని ప్రేమించడం అందరి పని, వారిని కాపాడటం సోల్జర్ పని : అడివి శేష్
సినిమా - మేజర్
నటీనటులు : అడవి శేష్, సయీ మంజ్రేకర్
దర్శకుడు - శశి కిరణ్ తిక్కా
నిర్మాతలు - మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
బ్యానర్: సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్
సంగీతం - శ్రీచరణ్ పాకాల
రేటింగ్ - 4/5
26/11 ముంబై దాడుల్లో ప్రాణ త్యాగం చేసి, ప్రజలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా 'మేజర్' (Major) సినిమాను దర్శకుడు శశికిరణ్ తెరకెక్కించారు.
పాన్ ఇండియా సినిమాగా మేజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో అడవి శేష్ (Adivi Sesh) అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించారు.'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్క 'మేజర్' సినిమాకు దర్శకత్వం వహించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయెపిక్‌ను ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక, మేజర్ పాత్రలో అడవి శేష్ జీవించేశారనే చెప్పాలి. అశోకచక్ర పురస్కార గ్రహీత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్, మన దేశం కోసం చేసిన త్యాగాన్ని ప్రతీ భారతీయుడి కళ్లకు కట్టేలా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇదే క్రమంలో ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ఆలోచనలను పంచుకున్నారు. 'గూఢచారి' సినిమా తీసిన శశి కిరణ్ వల్లే 'మేజర్' సినిమా సాధ్యమైందని తెలిపారు. కేవలం శశి కిరణ్ మీద నమ్మకంతోనే.. 'మేజర్' సినిమాను తెరకెక్కించేందుకు ఒప్పుకున్నామని అన్నారు.
అసలు ముంబై మారణ హోమం ఎలా జరిగింది?
2008 నవంబర్ 26 తేదిన భారత్‌లోని ముంబై నగరం ఉగ్ర దాడులతో హోరెత్తింది. నవంబరు 26 నుంచి 29 వరకు దక్షిణ ముంబైలో ఉగ్ర మూక మారణకాండ సృష్టించింది. వీరు మొదట టాక్సీల్లో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్ మొదలైన చోట్ల భయంకర మారణ హోమాన్ని సృష్టించారు.
ఉగ్రవాదులు జరిపిన దాడిలో 166 మంది భారతీయులు చనిపోయారు. అలాగే ఏడుగురు ఆర్మీ సైనికులు కూడా దాడుల్లో మరణించారు. వీరిలో 14 మందిని కాపాడి, ప్రాణ త్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) కూడా ఉన్నారు.
సెల్యూట్ టు మేజర్ !
Major: మేజర్ సినిమా అడవి శేష్ డ్రీమ్ ప్రాజెక్టు. అడవి శేష్ వల్లే మేజర్ సినిమా తెరకెక్కిందని పలు ఇంటర్వ్యూలలో దర్శకుడు శశికిరణ్ తిక్క చెప్పారు. సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల కోసం, మేజర్ సినిమా చేయాలనుకున్నానని శశి అన్నారు.
"అమరవీరుడిగా సందీప్ ఉన్నికృష్ణన్ దేశానికి చేసిన సేవను, ప్రాణ త్యాగాన్ని ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలి. అందుకే ఈ చిత్రాన్ని తీశాం" అని శశి చెప్పారు. ఇక నటన విషయానికి వస్తే అడవి శేష్ (Adivi Sesh) యాక్టింగ్, డైలాగ్స్‌లో చాలా పరిణితి కనబరిచారు. క్లైమాక్స్ సీన్స్‌లో, ముఖ్యంగా భావోద్వేగంతో మిళితమైన సన్నివేశాలలో, ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించారు.
"దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వారిని కాపాడటం సోల్జర్ పని" అంటూ అడవి శేష్ చెప్పిన డైలాగ్స్‌కు, థియేటర్‌లో ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. దేశభక్తి ఔన్నత్యాన్ని చాటేవిధంగా, ఈ చిత్రంలోని సంభాషణలను రచయిత అబ్బూరి రవి వ్రాశారు. ఇక "సెల్యూట్.. అడవి శేష్" అంటూ కొందరు ప్రేక్షకులు థియేటర్‌లోనే కేరింతలు కొట్టడం ఆశ్చర్యకరం.
మేజర్ కథ
Major Sandeep Unnikrishnan: సందీప్ ఉన్నికృష్ణన్ (అడివి శేష్) మలయాళీ కుటుంబంలో జన్మిస్తారు. ఆయన తండ్రి కె. ఉన్నికృష్ణన్ (ప్రకాశ్ రాజ్), తల్లి ధనలక్ష్మీ ఉన్నికృష్ణన్ (రేవతి). సందీప్‌కు చిన్నపటి నుంచి నేవీలో చేరాలనే ఆశయం ఉంటుంది. ఎప్పుడూ నేవీ రంగం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో నేవీ ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత సాధిస్తాడు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం సెలక్ట్ కాలేకపోతాడు.
ఇక కాలేజీ రోజుల్లోనే ఇషా (సయీ మంజ్రేకర్) తో ప్రేమలో పడతాడు సందీప్. అలాగే, నేవీలో సెలక్ట్ కాకపోవడంతో ఆర్మీలోకి వెళ్లాలనుకుంటాడు. సందీప్ తల్లిదండ్రులకు తమ కుమారుడిని ఇండియన్ ఆర్మీకి పంపడం ఇష్టం ఉండదు. కానీ ఆయన ఆశయాన్ని గౌరవిస్తారు.
ఆర్మీలో చేరిన కొన్ని రోజులకు సందీప్ ఉన్నికృష్ణన్ ఇషాను పెళ్లి చేసుకుంటారు. తర్వాత తన కష్టంతో, ఆర్మీలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. నేషనల్ సెక్యూరిటీ గాడ్స్ (ఎన్ఎస్‌జీ) 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్‌కు ట్రైనర్‌గా కూడా ఎంపికవుతాడు. అయితే అనుకోకుండా, ఉన్నికృష్ణన్‌కు తన భార్య ఇషాతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సెలవుపై ఇషాను కలవాలనుకున్న సందీప్‌కు మరో సవాల్ ఎదురవుతుంది.
అవే ముంబై ఉగ్ర దాడులు. వెంటనే సెలవును రద్దు చేసుకుని.. ముంబైలోకి చొరబడ్డ ఉగ్ర మూకలను హతమార్చేందుకు సందీప్ ఉన్నికృష్ణన్ స్పాట్‌కు వెళతాడు. ఉగ్రవాదులు అప్పటికే తాజ్ హోటల్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులతో సందీప్ ఎలా పోరాడాడు? 14 మంది ప్రాణాలను ఎలా కాపాడాడనే సన్నివేశాలను కచ్చితంగా థియేటర్లకి వెళ్లి మరీ చూడాల్సిందే. ప్రమోదతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కాపాడటం కోసం.. మేజర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటుంది. సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) కు మేజర్ సినిమా ఓ ఘనమైన నివాళి. అందులో ఎలాంటి సందేహం లేదు.
అడవి శేష్ మేజర్‌గా మెప్పించారా?
Adivi Sesh: అడవి శేష్ మేజర్ పాత్రలో 100 శాతం ప్రేక్షకులను మెప్పించారు. ఎందుకంటే ప్రతీ సన్నివేశంలో ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు. అమ్మ, నాన్నల ముద్దల కొడుకుగా కూడా పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఇక సయీ మంజ్రేకర్‌తో నటించిన సీన్స్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'పాకిస్తాన్ బోర్డర్ కూడా మనదే ' అంటూ ఆయన మేజర్‌గా చెప్పిన డైలాగులు కేక పుట్టిస్తాయి.
'దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వారిని కాపాడటం సోల్జర్ పని ' అనే డైలాగులు థియేటర్లలో పేలాయి. పలు చోట్ల 'మేజర్ ' సినిమా ప్రివ్యూ షోలు వేశారు. ప్రతీ ప్రివ్యూలోనూ 'మేజర్ 'కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 'సెల్యూట్ ' అంటూ అడవి శేష్‌ను అభినందిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా అడవి శేష్ ప్రదర్శించిన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి . అడవి శేష్ సినిమా కెరీర్‌లో మేజర్ (Major) ఎప్పటికీ ఓ మంచి జ్ఞాపకంలా మిగులుతుంది.
మేజర్‌లో మిగతా నటులు ఎలా యాక్ట్ చేశారు?
హీరోయిన్ సయీ మంజ్రేకర్ కూడా మేజర్ భార్యగా నటించి మెప్పించారు. ఇక ప్రకాశ్ రాజ్ డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా చివరాంకంలో మేజర్ తండ్రిగా ఆయన నోటి వెంట వచ్చే డైలాగులు, ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. అలాగే, మేజర్ తల్లి పాత్రలో రేవతి లీనమైపోయారు. ఇక ఆర్మీ అధికారిగా మురళి శర్మ పాత్ర సినిమాకి ఎంతో కీలకం. తన గత సినిమాల కన్నా మురళి శర్మ, ఈ సినిమాలో పోషించిన పాత్ర భిన్నమైంది. సీరియస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను మెప్పించారాయన. ఇక ప్రమోద క్యారెక్టర్‌లో కూడా శోభితా ధూళిపాళ్ల చాలా బాగా నటించారు.
పాన్ ఇండియా సినిమాగా మేజర్ (Major) జూన్ 3 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారతీయ సైనికుల ఘనతను సెల్యూలాయిడ్ పై అద్భుతంగా ఆవిష్కరించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. కానీ ఆయన ఎలాంటి విలువలతో జీవించారన్న విషయాన్ని, ప్రతీ భారతీయుడికి తెలిసేలా చేశారు దర్శకుడు శశి కిరణ్ తిక్క. సోల్జర్ అంటే ఏంటో.. దేశానికి ఏం చేస్తారో.. ఈ తరం వారికి అర్థమయ్యేలా తెలిపారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల 'మేజర్ ' సినిమాకు అద్భుతమైన పాటలను అందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఓ యువ సైనికుడు తన ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి.. చావుకు ఎదురెళ్లి చేసే పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
ప్లస్ పాయింట్స్
అడవి శేష్ నటన
సంభాషణలు
క్లైమాక్స్
భావోద్వేగ సన్నివేశాలు