ఒక్క సినిమా ఫలితంతో మారుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్ల ఆలోచనలు.. జాగ్రత్తలు తీసుకుంటున్న హీరోలు

Updated on Sep 05, 2022 04:33 PM IST
కరోనా తర్వాత టాలీవుడ్‌ (Tollywood)లో రిలీజైన పలు సినిమాల ఫలితాలు స్టార్ హీరోల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి
కరోనా తర్వాత టాలీవుడ్‌ (Tollywood)లో రిలీజైన పలు సినిమాల ఫలితాలు స్టార్ హీరోల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి

టాలీవుడ్‌ (Tollywood)లో కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. కరోనాతో అనుకోకుండా వచ్చిన విరామాన్ని హీరోలు, దర్శక నిర్మాతలు బాగానే ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో హీరోలు మంచి కథలను ఎంపిక చేసుకుని, సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. లాక్‌డౌన్ ఎత్తేసిన సమయం నుంచి తాము గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సినిమాలను అధికారికంగా ప్రకటిస్తూ.. వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు హీరోలు. వారిలో స్టార్ హీరోలు ఒక అడుగు ముందే ఉన్నారు.

అయితే ఒక్క సినిమా విజయం ఎంత కిక్ ఇస్తుందో, అదే ఒక్క సినిమాకు వచ్చే నెగెటివ్ టాక్‌ హీరో, దర్శకుడు, నిర్మాతలకు అంతే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా ఇస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాల ఫలితాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హిట్‌తో వచ్చిన కిక్‌ను ఎంజాయ్ చేస్తూనే తర్వాత ప్రాజెక్టులను పట్టాలెక్కించిన హీరోలు, నెగెటివ్‌ టాక్‌ రావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్న స్టార్లు వాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రకటించిన సినిమాల విషయంలో మారుతున్న నిర్ణయాలపై ఒక లుక్కేద్దాం..

కరోనా తర్వాత టాలీవుడ్‌ (Tollywood)లో రిలీజైన పలు సినిమాల ఫలితాలు స్టార్ హీరోల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి

ఆచార్య ఫలితంతో..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగాపవర్‌‌ స్టార్ రాంచరణ్ (RamCharan) నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు లేక చతికిలపడింది. ఆచార్య సినిమా ఫలితంతో మెగాస్టార్‌‌ ఆలోచనలో మార్పు వచ్చిందని ఇండస్ట్రీ టాక్.

కరోనా ప్యాండమిక్ తర్వాత స్పీడ్ పెంచిన చిరు.. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటిని శరవేగంగా పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే ఆయన గాడ్‌ఫాదర్, భోళాశంకర్‌‌ సినిమాలతోపాటు బాబీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా ఒకటి, రెండు కథలను ఓకే చేసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు చెప్పారు కూడా.

ఆచార్య ఫలితంతో చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గాడ్‌ఫాదర్ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తై విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో కాకుండా తక్కువ థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌కు చిరు సూచించినట్టు తెలుస్తోంది. ఇక, తర్వాత సినిమాల విషయంలో కూడా మెగాస్టార్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్.

‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల దర్శకుడు వెంకీ కుడుములతో ఒక చిత్రం చేయనున్నట్లు చిరు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టారని సమాచారం. ‘ఆచార్య’ ఫలితంతో కథల ఎంపికలో చిరంజీవి పునరాలోచనలో పడ్డారని, ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు సినిమా పూర్తి చేసిన తర్వాతే మరో సినిమాపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

కరోనా తర్వాత టాలీవుడ్‌ (Tollywood)లో రిలీజైన పలు సినిమాల ఫలితాలు స్టార్ హీరోల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి

‘ఖుషి’ తర్వాత ఎవరి డైరెక్షన్‌లో..

లైగర్ ఫలితం ఇచ్చిన షాక్‌తో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్లాన్స్‌లో మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ‘లైగర్‌’ విడుదలకు ముందే పూరీ జగన్నాథ్‌తో  ‘జనగణమన’ సినిమాను పట్టాలెక్కించారు విజయ్‌. ‘లైగర్‌’ ఫ్లాప్ కావడంతో ‘జనగణమన’ను ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లు సమాచారం. దీంతో ఖుషి సినిమా తర్వాత విజయ్‌ నటించే సినిమా కోసం కథా చర్చలు మొదలయ్యాయని తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఖుషి సినిమా. ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ‘పుష్ప2’ సినిమా పూర్తి చేసిన తర్వాతగానీ విజయ్‌తో సినిమా కోసం సుకుమార్‌ రంగంలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు.

దీంతో ఈ గ్యాప్‌లో విజయ్‌ దేవరకొండతో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ కోసం మోహనకృష్ణ ఇంద్రగంటి, గౌతమ్‌ తిన్ననూరి వంటి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమా బాధ్యతలను దిల్‌ రాజు.. హరీష్‌ శంకర్‌‌కు అప్పగించారని, ఆయన కథ రెడీ చేసే పనిలో ఉన్నారని టాక్. మరి ఈ విషయంలో ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.

కరోనా తర్వాత టాలీవుడ్‌ (Tollywood)లో రిలీజైన పలు సినిమాల ఫలితాలు స్టార్ హీరోల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి

‘పుష్ప2’ అనంతరం..

‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun). ఈ సినిమా ఘన విజయం సాధించడంతో బన్నీ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ‘పుష్ప2’ సినిమా కోసం రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ ఏ బ్యానర్‌‌లో సినిమా చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు. అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు కథలు రెడీ చేశారని సమాచారం.

వేణు శ్రీరామ్‌ ‘ఐకాన్‌’తో పాటు కొరటాల శివతో బన్నీ సినిమా చేయనున్నట్టు గతంలోనే ప్రకటనలు వచ్చాయి. ప్రస్తుతం ఆ లిస్ట్‌లో బోయపాటి శ్రీను, మురుగదాస్‌, ప్రశాంత్‌ నీల్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్లందరిలో బన్నీ ముందుగా ఎవరికి చాన్స్‌ ఇస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా ఇమేజ్‌కు తగిన కథలను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్‌ కొత్త ప్రాజెక్ట్‌పై దసరా నాటికి స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.

కరోనా తర్వాత టాలీవుడ్‌ (Tollywood)లో రిలీజైన పలు సినిమాల ఫలితాలు స్టార్ హీరోల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి

‘శంకర్‌‌’తో సినిమా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద బ్యాక్‌ టు బ్యాక్‌ సందడి చేశారు మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan). చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత గౌతమ్‌ తిన్ననూరితో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టేశారని టాక్.

అయితే చరణ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ చెప్పనున్నట్టు తెలుస్తోంది. రాంచరణ్‌ కోసం తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో సినిమా సెట్‌ చేసే పనిలో యూవీ క్రియేషన్స్‌ ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వీళ్లు మాత్రమే కాకుండా దాదాపుగా స్టార్ హీరోలందరూ కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఒకవైపు కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా వందల కోట్లు వసూలు చేస్తుండగా.. కథ కొంచెం వీక్‌గా ఉన్నా స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయి. ఈ పరిస్థితి టాలీవుడ్‌ (Tollywood)తోపాటు బాలీవుడ్‌లోనూ కొనసాగుతోంది.  

Read More : ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్‌పై సూచనలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఖైదీ గెటప్‌ కలిసొచ్చేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!