Lokesh Kanagaraj: రోలెక్స్ క్యారెక్టర్‌తో కొత్త మూవీ.. వచ్చే పదేళ్లు లోకేశ్ కనగరాజ్ చేయబోయే చిత్రాలివే..

Updated on Dec 13, 2022 04:45 PM IST
రాబోయే పదేళ్లకు సరిపడా చిత్రాల షెడ్యూల్‌ను తాను సిద్ధం చేసుకున్నానని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అన్నారు
రాబోయే పదేళ్లకు సరిపడా చిత్రాల షెడ్యూల్‌ను తాను సిద్ధం చేసుకున్నానని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అన్నారు

పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలనేది ఓ సామెత. ఎక్కడైనా సరే కొత్తదనం ఉంటేనే బాగుంటుంది. చిత్ర పరిశ్రమలో కూడా కొత్తవారు వస్తుంటేనే.. విభిన్నమైన సినిమాలు వస్తుంటాయి. నటీనటులతోపాటు టెక్నీషియన్లు కూడా కొత్త వారు వస్తేనే వైవిధ్యానికి ఆస్కారం ఉంటుంది. అలా వచ్చిన వాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటేనే మరిన్ని అవకాశాలు వారిని వరిస్తాయి. అలాంటి నూతన తరం దర్శకుల్లో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు. తక్కువ సినిమాలే తీసినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. 

కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తి, విజయ్‌లతో ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలు తీసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు లోకేశ్. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)తో ‘విక్రమ్’ చిత్రాన్ని తీసి తమిళ చిత్ర పరిశ్రమను షేక్ చేశారాయన. ఈ సినిమా ఆల్‌టైమ్ టాప్–3 హయ్యెస్ట్ కోలీవుడ్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడాయన తదుపరి సినిమాకు సంబంధించిన పనుల్లో మునిగిపోయారు. ఈ చిత్రం వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు. 

 ‘విక్రమ్’ సినిమాలో డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ క్యారెక్టర్‌లో సూర్య (Suriya) నటించారు

ఇటీవల ఓ ఆన్‌లైన్ ఫిల్మ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ కనగరాజ్ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ‘ప్రస్తుతం విజయ్‌ హీరోగా ఓ మూవీ చేస్తున్నా. దీని తర్వాత కమల్‌ హాసన్‌ గారితో కూర్చొని మాట్లాడతా. ఆ తర్వాత ‘ఖైదీ 2’ను ప్రారంభిస్తా. అది పూర్తయిన వెంటనే ‘విక్రమ్‌’కు సీక్వెల్‌ ఉంటుంది. అంతేకాదు, రోలెక్స్‌ (‘విక్రమ్’ చిత్రంలో సూర్య పోషించిన పాత్ర) నేపథ్యంలో ఓ సినిమా కూడా ఉంటుంది. పరిస్థితులను బట్టి ఈ చిత్రాలు కాస్త అటూ ఇటూ అవ్వొచ్చు. ఇది మల్టీ యూనివర్స్‌. దీంతో ఏ మూవీ ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. అది ప్రీక్వెల్‌ లేదా సీక్వెల్‌ కూడా కావొచ్చు. వచ్చే పదేళ్ల వరకూ నేను ఫుల్ సెటిల్‌’ అని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు.

ఇకపోతే, ‘విక్రమ్’ సినిమాలో డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ క్యారెక్టర్‌లో సూర్య (Suriya) నటించారు. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంత సేపు థియేటర్లను ఆయన షేక్ చేశారు. సూర్య తన స్పెషల్ అప్పీయరెన్స్‌తో ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. రోలెక్స్ (Rolex Movie) రోల్‌పై ఓ సినిమా తీస్తే.. అందులో ఆయన తన జీవితాన్ని ఎలా మొదలుపెట్టాడు? డ్రగ్ మాఫియా డాన్ ఎలా అయ్యాడనేది చూపించే అవకాశం ఉంది. లోకేశ్ చెప్పినట్లు ఈ సినిమాలన్నీ వరుసగా వస్తే మాత్రం ఆడియెన్స్‌కు పండగే.  

Read more: Avatar: The Way of Water: 'అవతార్2' లో కొత్త పాత్రలను పరిచయం చేయనున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!