అర్ధాంతరంగా ఆగిపోయిన ‘అచలుడు’ (Achaludu).. దర్శకుడు బాలా మూవీ నుంచి వైదొలిగిన స్టార్ హీరో సూర్య (Suriya)
సహజసిద్ధమైన సినిమాలను తెరకెక్కిస్తారనే దర్శకుడిగా బాలా (Director Bala)కు మంచి పేరుంది. ‘శివపుత్రుడు’, ‘వాడువీడు’ లాంటి చిత్రాలు ఈ కోలీవుడ్ డైరెక్టర్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చాయి. సూర్య, విక్రమ్, విశాల్‌లో ఉన్న నటనా పటిమను బయటకు తీసుకొచ్చిన క్రెడిట్ బాలాకు దక్కుతుంది. అలాంటి బాలాకు కొన్నాళ్లుగా సరైన హిట్ పడలేదు. ‘వాడు-వీడు’ చిత్రం తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఆయన అందుకోలేకపోయారు.
ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిమీదున్న బాలా.. స్టార్ హీరో సూర్య తో జతకట్టారు. వీరి కాంబోలో వచ్చిన ‘నందా’, ‘శివపుత్రుడు’ బ్లాక్‌బస్టర్లుగా నిలవడంతో మళ్లీ ఓ మూవీ చేయాలని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసి ‘అచలుడు’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీంతో మరో వైవిధ్యమైన సినిమా వస్తోందని ఆడియెన్స్ భావించారు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
‘అచలుడు’ (Achaludu) చిత్రం నుంచి హీరో సూర్య (Suriya) తప్పుకున్నారు. 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమా నుంచి సూర్య తప్పుకోవడంపై దర్శకుడు బాలా స్పందించారు. ఈ క్రమంలో బాలా సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. ‘అచలుడు’ కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని.. దీంతో ఈ మూవీ స్టోరీ సూర్యకు సరిపోదని అనిపించిందని ఆ లేఖలో బాలా తెలిపారు. ‘పరస్పర అంగీకారంతోనే సూర్య ‘అచలుడు’ చిత్రం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నా. సూర్య తప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొనసాగుతుంది’ అని ఆ లెటర్‌లో బాలా రాసుకొచ్చారు.
ఇకపోతే, బాలా గతంలో కూడా అజిత్‌తో ఓ చిత్రాన్ని మొదలుపెట్టి.. మధ్యలోనే ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. ఇటీవల ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ను కూడా ముందుగా ధృవ్ విక్రమ్‌తో తెరకెక్కించారు. కొంతమేర షూటింగ్ పూర్తయిన తర్వాత అవుట్‌పుట్ సరిగ్గా లేదని సినిమాను బాలా క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత గిరీశాయ ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు సూర్యతో మూవీ (Suriya 41) కూడా అర్ధంతరంగా ఆగిపోవడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా కృతి శెట్టి ఎంపికయ్యారు. ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆమె.. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో తీవ్రంగా నిరాశపడ్డారని సమాచారం.