Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టాప్ 10 చిత్రాలు.. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే !
రజనీకాంత్ (Rajinikanth) .. దక్షిణాదితో పాటు ఉత్తరాది చిత్ర పరిశ్రమ కూడా ఈయనను సూపర్ స్టార్ అని పిలుస్తుంది. రజనీకాంత్‌కు భారతదేశంతో పాటు జపాన్, చైనా, కొరియా, థాయిలాండ్ లాంటి దేశాలలో కూడా ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. బెంగళూరులో జన్మించిన రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ భాషలలో కూడా రజనీకాంత్ నటించారు. కానీ గత 25 ఏళ్ళ నుండి రజనీకాంత్ తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయడం లేదు. ఆయన తమిళంలో నటించిన సినిమాలే తెలుగులో కూడా విడుదలై... ఇక్కడ కూడా బహుళ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అలాంటి చిత్రాలలో కొన్ని మీకోసం ప్రత్యేకం !
ముత్తు - 1995 లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో రజనీకాంత్ (Rajinikanth) సరసన మీనా నటించారు. శరత్ బాబు, రాధారవి, వడివేలు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రజనీకాంత్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది
బాషా -1995 లో విడుదలైన బాషా చిత్రానికి సురేష్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ (Rajinikanth) ఆటోడ్రైవర్‌గా, డాన్‌గా రెండు విభిన్న పాత్రలను పోషించారు. ఈ సినిమా కూడా తెలుగులో రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది.
అరుణాచలం - 1997 లో విడుదలైన అరుణాచలం చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించారు. సౌందర్య ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. 30 రోజులలో 30 కోట్ల రూపాయలను నైతికమైన పద్ధతిలో ఖర్చు పెడితేనే, తండ్రి ఆస్తికి కథానాయకుడు వారసుడవుతాడనే కొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ చిత్రంగానే నిలిచింది.
నరసింహ -2001 లో తమిళంలో విడుదలైన పడయప్పా చిత్రాన్ని తెలుగులో నరసింహ పేరుతో డబ్ చేశారు. ఇందులో నీలాంబరి పాత్ర పోషించిన నటి రమ్యక్రిష్ణతో రజనీకాంత్ ((Rajinikanth) పోటాపోటీగా నటించారు. ఈ చిత్రానికి తిరుపతి స్వామి దర్శకత్వం వహించారు.
చంద్రముఖి - 2005 లో విడుదలైన చంద్రముఖి చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించారు. జ్యోతిక ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. ఇందులో సైకాలజిస్టుగా, మహారాజుగా రెండు విభిన్నమైన పాత్రలను రజనీకాంత్ (Rajinikanth) పోషించారు. ఈ సినిమా కూడా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
రోబో - 2010 లో తమిళంలో విడుదలైన ఎంతిరన్ చిత్రం, తెలుగులో రోబో పేరుతో డబ్ చేయబడింది. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో కథనాయిక. ఈ సినిమాలో రోబోలను తయారుచేసే డాక్టర్ వశీకరన్‌గా, అలాగే చిట్టి పేరుతో నడిచే రోబోగా రెండు వైవిధ్యమైన పాత్రలను రజనీ పోషించారు. ఈ సినిమా తెలుగులో కూడా అనేక రికార్డులను తిరగరాసింది.
శివాజీ - 2007 లో విడుదలైన శివాజీ మూవీకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భారతదేశంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే అత్యున్నతమైన ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని నిర్మించాలని సంకల్పించిన శివాజీ అనే ఎన్నారై పాత్రలో రజనీకాంత్ నటించారు. ఈ చిత్రం కూడా తెలుగులో హిట్ అయ్యింది.
కబాలి - 2016 లో పా రంజిత్ దర్శకత్వంలో రిలీజైన చిత్రం కబాలి రజనీకాంత్ విశ్వరూపానికి ప్రతీక. మలేషియాలో నివసించే కబాలి అనే ఇండియన్ డాన్ కథ. కొందరు ముషర్కుల చేతిలో చనిపోయారని భావించిన తన భార్య, బిడ్డలు బతికే ఉన్నారని తెలిసి, జైలు నుండి విడుదలైన కబాలి వారిని కలవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తాడన్నదే ఈ చిత్రకథ. తెలుగులో కూడా ఈ చిత్రం ఓ మాదిరి వసూళ్లను రాబట్టింది.
కాలా - 2018 లో విడుదలైన ఈ సినిమా ముంబాయిలోని ధారావి ప్రాంతపు మురికివాడలలో నివసిస్తున్న పేదల హక్కుల కోసం పోరాడిన కరికాలుడు (కాలా) అనే దక్షిణాది పోరాటయోధుడిది. కాలా పాత్రలో రజనీకాంత్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. తెలుగు ప్రేక్షకులలో కూడా చాలామందికి ఈ సినిమా నచ్చింది. విమర్శకుల చేత కూడా ప్రశంసలు పొందిన చిత్రం ఇది. పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇవండీ.. రజనీకాంత్ నటనా ప్రతిభను చాటిన చిత్రాలు. ఇవి తమిళ చిత్రాలైన్నప్పటికీ కూడా, తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించిన సినిమాలివి. తెలుగు రాష్ట్రాలలో కూడా రజనీకాంత్‌కు ఓ పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి మనకు తెలిసిందే