Aditya 999: వచ్చే ఏడాది ‘ఆదిత్య 999’ ఉంటుంది’: ‘దాస్ కా ధమ్కీ’ ఈవెంట్‌లో బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్
తెలుగు సినిమా చరిత్రలో ‘ఆదిత్య 369’ (Aditya 369) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ప్రియుల మదిలో ఈ మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిది. పారాణికానికి, సైన్స్ ఫిక్షన్ నేపథ్యం జోడించి తీసిన ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తారని ఎప్పటినుంచో ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కథను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సిద్ధం చేస్తున్నారని కూడా కథనాలు మీడియాలో వచ్చాయి. అయితే వాటిపై అధికారికంగా క్లారిటీ రాలేదు.
‘ఆదిత్య 369’ సీక్వెల్ వార్తలపై తాజాగా బాలకృష్ణ (Balakrishna) స్పందించారు. వచ్చే ఏడాది దీనిపై ఈ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని బాలయ్య చెప్పారు. యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకలో బాలయ్య పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. విశ్వక్‌సేన్ గురించి కూడా మాట్లాడారు.
‘విశ్వక్‌సేన్ (Vishwak Sen)కు సినిమా అంటే ప్యాషన్. ఎన్నో ఒడిదొడుకులను దాటి ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి మూవీ చేస్తే నన్ను నేను ఊహించుకుంటా. నాకు అన్ని జోనర్స్ చేయాలని ఉంది. వచ్చే ఏడాది ఆదిత్య 999 (Aditya 999) ఉంటుంది. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ చిత్రం తన దర్శకత్వంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు.
హీరో విశ్వక్‌సేన్ బాలయ్య గురించి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఎంత పవర్‌ఫుల్లో అంత స్వీట్ కూడా. నేను ఎంతో నమ్మిన చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు. బాలయ్య తనను బ్రో అని పిలుస్తారని చెప్పారు. ఇక ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీతో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.
Read more: ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో రికార్డులు బద్దలుకొట్టిన టాప్10 సినిమాలు