Chiranjeevi: నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. తనయుడు చరణ్ (Ram Charan) గురించి చిరు ఎమోషనల్ ట్వీట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ పురస్కారం చరణ్‌ను వరించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తన కుమారుడి అచీవ్‌మెంట్‌పై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
చిరంజీవి ట్విట్టర్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. చెర్రీ అవార్డు అందుకోవడం మీద గర్వంగా ఉందన్నారు. ‘కంగ్రాట్స్ డియర్ చరణ్. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ అవార్డును నువ్వు అందుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నా. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మా నేనూ కోరుకుంటున్నాం’ అని చిరు (Chiranjeevi) ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌పై చరణ్ స్పందిస్తూ.. ‘లవ్ యూ అప్పా’ అని బదులిచ్చారు.
రాజమౌళి ఆస్కార్‌కు అర్హుడు
ఇక ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి గురించి చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ బరిలోకి దిగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు రాజమౌళికి ఆ అవార్డు రావాలని తాను కోరుకుంటున్నానని చెర్రీ చెప్పారు. ‘ఆస్కార్ పురస్కారానికి రాజమౌళి అర్హుడు. ఆయనకు ఆ అవార్డు రావాలి. ‘నాటు నాటు’ అంటే ఒక డ్యాన్స్ లేదా వీడియో కాదు. అది స్నేహం, ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధానికి సంబంధించింది. దక్షిణాదిలో మా కుటుంబానికి, తారక్ ఫ్యామిలీకి పోటీ ఉంది. అయితే ఈ సినిమాను మాత్రం ఇరు కుటుంబాలకు చెందిన అభిమానులు కలసి సెలబ్రేట్ చేసుకున్నారు’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే, రామ్ చరణ్ సినిమా సినిమాకు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రం నుంచి ఆయన వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. అంతకుముందు వరకు ఎన్ని హిట్లున్నా.. నటుడిగా ఆయనలోని అసలైన సత్తాను మాత్రం ‘రంగస్థలం’ మూవీయే బయటపెట్టింది. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడనే పేరున్న చరణ్.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలనని ఆ చిత్రంతో నిరూపించుకున్నారు.
‘రంగస్థలం’ తర్వాత వచ్చిన ‘వినయ విధేయ రామ’ నిరాశపర్చినప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’తో మళ్లీ తానేంటో చరణ్ ప్రూవ్ చేశారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒకవైపు బ్రిటిషర్లకు విధేయతను చూపుతూనే.. మరోవైపు స్వాత్రంత్ర్య కాంక్షతో రగిలిపోయే పోరాట యోధుడిగా, స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మిత్రుడిగా సున్నితమైన ఎమోషన్స్‌ను పలికించడంలో ఆయన ఫుల్ సక్సెస్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ ఇంటెన్సివ్ యాక్టింగ్‌కు టాలీవుడ్‌తోపాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. దీంతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపును సంపాదించారు.