God Father : 'గాడ్ ఫాదర్' చిత్రంలో చిరంజీవి పలికిన ఆసక్తికరమైన పొలిటికల్ డైలాగ్ ఇదే.. వైరల్ అవుతున్న వీడియో !
గాడ్ ఫాదర్ (God Father).. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే సినిమా గురించిన చర్చ నడుస్తోంది. మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో, ఈ రోజే ఈ సినిమా నుండి ఓ డైలాగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు..’అంటూ చిరంజీవి (Chiranjeevi) చెప్పిన ఈ డైలాగ్‌ను మేకర్స్ ట్వీట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. పొలిటికల్ కాన్సెప్ట్‌తో సాగిన ఈ డైలాగ్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చిరు మళ్లీ పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందా? అని కూడా పలువురు పోస్టులు పెడుతున్నారు.
మెగా ట్రెండ్ మొదలైంది
ప్రస్తుతం ఈ డైలాగ్ అంతర్జాలంలో ట్రెండింగ్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా ఈ డైలాగ్ ఆడియోని తన ట్విటర్‌లో షేర్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
అక్టోబర్ 5వ తేదిన 'గాడ్ ఫాదర్' సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌తో పాటు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. లక్ష్మీ భూపాల్ (Lakshmi Bhupal) సంభాషణలు రాస్తున్నారు.
మలయాళంలో 'లూసిఫర్' సూపర్ హిట్
మలయాళంలో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా నటించిన 'లూసిఫర్' సినిమా ఆధారంగా 'గాడ్ ఫాదర్' (God Father) చిత్రం తెరకెక్కుతోంది. 'లూసిఫర్' చిత్రం మలయాళంలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. పృథ్విరాజ్ సుకుమారన్ మలయాళంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'లూసిఫర్' రీమేక్‌గా తెలుగులో విడుదల అవుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రం పై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.