Tamannaah Bhatia : ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా వివాహం.. ఈ వార్తలో నిజమెంత ?
తెలుగు చిత్ర పరిశ్రమలో రూమర్స్‌కు కొదవ లేదు. అయితే, అప్పుడప్పుడు అవే గాసిప్స్ నిజం కూడా అవుతుంటాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ నటి తమన్నా మీద కూడా అలాంటి వార్తలే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రముఖ కథానాయిక తమన్నా (Tamannaah Bhatia) త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని పలు పత్రికలు వార్తలు వ్రాశాయి.
ప్రస్తుతం తమన్నా వయసు 32 సంవత్సరాలు. ఈమె త్వరలోనే ముంబయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొనే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. తమన్నా ప్రస్తుతం దక్షిణాది భాషలలో సినిమాలు చేస్తూ, సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.
తమన్నా ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమకు వచ్చి 17 ఏళ్లు అయ్యింది. అలాగే 50 కి పైగా చిత్రాలలో కూడా నటించింది. అలాగే పలు బాలీవుడ్ సినిమాలలో కూడా హీరోయిన్ పాత్రలు పోషించింది. ఇటీవలే వెంకటేష్‌తో తమన్నా జంటగా చేసిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా ప్రస్తుతం తమన్నా నటిస్తోంది. ఈమె నటించిన 'బబ్లీ బౌన్సర్' చిత్రం ఇటీవలే ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. అంతకు ముందు నితిన్ హీరోగా తెరకెక్కిన 'అంధాదున్' సినిమా తెలుగు రీమేక్ 'మేస్ట్రో' కూడా తమన్నా ఓ నెగటివ్ పాత్రలో నటించింది.
ఇటీవలే చిరంజీవి కథానాయకుడిగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' సినిమాలోని కథానాయిక పాత్రకు తమన్నా సైన్ చేసింది. అలాగే సత్యదేవ్ సరసన 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో కూడా తమన్నా (Tamannaah Bhatia) నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు ఇది అధికారిక రీమేక్ .