Thalapathy Vijay : దళపతి విజయ్ బర్త్ డే స్పెషల్.. తెలుగులో కూడా రీమేక్ అయిన ఈ సూపర్ స్టార్ సినిమాలు ఎన్నో !

Updated on Jun 22, 2022 10:10 PM IST
విజయ్ (Thalapathy Vijay).. తెలుగు సినీ అభిమానులకు కూడా పాపులర్ హీరోనే. ఎందుకంటే ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్ కూడా అయ్యాయి.
విజయ్ (Thalapathy Vijay).. తెలుగు సినీ అభిమానులకు కూడా పాపులర్ హీరోనే. ఎందుకంటే ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్ కూడా అయ్యాయి.

దళపతి విజయ్ (Thalapathy Vijay) .. తమిళ స్టార్ హీరో. కోలీవుడ్‌లో ఈయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా ఈయనకు అంతే ఫాలోయింగ్ ఉంది. ఈయన నటించిన తమిళ చిత్రాలు కొన్ని తెలుగులో కూడా డబ్ చేయబడి, బ్లాస్ బస్టర్స్‌గా నిలిచాయి. అదిరింది, విజిల్, స్నేహితుడు, మాస్టర్ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. 

తెలుగులో కూడా పాపులర్ నటుడే

విజయ్ (Thalapathy Vijay).. తెలుగు సినీ అభిమానులకు కూడా పాపులర్ హీరోనే. ఎందుకంటే ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్ కూడా అయ్యాయి. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన తమ్ముడు, పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలను స్వయంగా విజయ్ తమిళంలో రీమేక్ చేశారు. 

ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ తనయుడైన విజయ్ (Thalapathy Vijay) లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశారు. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ప్రముఖ గాయని మరియు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతురాలు.

 

 

చిన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన విజయ్, రెండు సంవత్సరాల వయసులోనే తన సోదరిని కోల్పోవడం తనపై బాగా ప్రభావం చూపించిందని అంటారు. అప్పటి నుండీ జీవితంలో ఏదైనా సాధించాలనే తపన పెరిగిందని అంటారు. తన సోదరి పేరిట విద్యా విజయ్ ప్రొడక్షన్స్ పేరిట ఓ ఫిల్మ్ కంపెనీని కూడా ప్రారంభించారాయన. 

చిన్నప్పటి నుండీ నటనే అభిరుచి

10 ఏళ్ల వయసులోనే విజయ్ 'వెట్రి' సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు. చైల్డ్ యాక్టర్‌గా ఎన్నో సినిమాలలో నటించారు. 1990 లలో మంచి రొమాంటిక్ హీరోగా విజయ్ అతివల మనసులు దోచుకున్నారు. ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. శ్రీలంక తమిళ అమ్మాయి సంగీతను విజయ్ 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు జేసన్ సంజయ్, అమ్మాయి పేరు దివ్య సాషా.

విజయ్ మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ, ఆయన తనను తాను బిజీగా ఉంచుకుంటూ ఉంటారు. ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చి ఇనిస్టిట్యూట్ విజయ్ సేవలను కొనియాడుతూ, డాక్టరేట్ అందించింది. 

విజయ్ నటించిన మెర్సెల్, కావలన్, సర్కార్ లాంటి చిత్రాలు ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శితమయ్యాయి. కాదళక్కు మర్యాదై, తుల్తుద మానుమ్ తుల్లుమ్, తిరుప్పాచి మొదలైన సినిమాలలో నటనకు విజయ్ ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర పురస్కారం అందుకున్నారు. వెట్టైకారన్, తుపాకీ, పోకిరి, నంబన్, తలైవా, కత్తి లాంటి సినిమాలలో నటనకు విజయ్ స్టార్ ఇండియా పురస్కారాలను కూడా అందుకున్నారు.

Thalapathy Vijjay Movies which are Remade in Telugu

తెలుగు కూడా రీమేక్ అయ్యి.. హిట్ అయిన విజయ్ సినిమాలు ఇవే

ఖుషీ (ఖుషీ)

తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషీ‘ చిత్రంలో విజయ్, జ్యోతిక జంటగా నటించారు. ఇదే చిత్రం అదే పేరుతో తెలుగులో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా తెరకెక్కింది. ఎస్ జె సూర్య తెలుగు వెర్షన్‌కు కూడా తానే దర్శకత్వం వహించారు. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమకథగా ఈ సినిమా నడుస్తుంది. రెండు భాషలలోనూ ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.  

తిరుప్పాచి (అన్నవరం)

పేరరసు దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘తిరుప్పాచి‘ చిత్రంలో విజయ్, త్రిష జంటగా నటించారు. ఇదే చిత్రానికి తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆసిన్ కథానాయికగా నటించింది. సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా కథ నడుస్తుంది. 

తుళ్లుత మనముమ్ తుళ్లుమ్ (నువ్వు వస్తావని)

ఎజిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, సిమ్రాన్ జంటగా నటించారు. తెలుగులో ఇదే సినిమాని విఆర్ ప్రతాప్ నాగార్జున హీరోగా తెరకెక్కించారు. తెలుగులో కూడా సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. సింగర్ అవ్వాలనే ధ్యేయం గల యువకుడు ఎలా ఓ అంధురాలైన అమ్మాయికి బాసటగా నిలుస్తాడో, ఇదే క్రమంలో ఆమె అతన్ని ఎందుకు ఎలా అపార్థం చేసుకుంటుదన్న కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. 

తిరుమలై (గౌరి)

విజయ్, జ్యోతిక ఈ చిత్రంలో తారాగణంగా నటించారు. రమణ ఈ సినిమా దర్శకుడు. తెలుగులో ఇదే చిత్రం సుమంత్, ఛార్మీ హీరో, హీరోయిన్లుగా ‘గౌరి‘ పేరిట తెరకెక్కింది. ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడే మెకానిక్ కథ ఇది. 

పూవే ఉనక్కాగ (శుభాకాంక్షలు)

తమిళ చిత్రం ‘పూవే ఉనక్కాగ‘లో విజయ్, సంగీత జంటగా నటించారు. విక్రమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో భీమనేని శ్రీనివాసరావు జగపతిబాబు, రాశి తారాగణంగా తెరకెక్కించారు. తన ప్రియురాలి ప్రేమను గెలిపించడానికి, తన ప్రేమను త్యాగం చేసే ఓ భగ్న ప్రేమికుడి కథ ఈ 'శుభాకాంక్షలు'

ప్రియముదన్ (ప్రేమించే మనసు)

విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో విజయ్, కౌసల్య ప్రధాన పాత్రలలో నటించారు. ఇదే చిత్రం తెలుగులో 'ప్రేమించే మనసు' పేరుతో వడ్డే నవీన్ హీరోగా తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోది నెగిటివ్ ఛాయలున్న పాత్ర. 

వన్స్ మోర్ (డాడీ డాడీ)

ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, శివాజీ గణేశన్ తండ్రీ, కొడుకులుగా నటించారు. ఇదే చిత్రం తెలుగులో 'డాడీ డాడీ' పేరుతో తెరకెక్కగా అక్కినేని నాగేశ్వరరావు, హరీష్ తండ్రి, కొడుకులుగా నటించారు. 'డాడీ డాడీ' చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 

లవ్ టుడే (సుస్వాగతం)

బాలశేఖరన్ దర్శకత్వంలో తమిళంలో 'లవ్ టుడే' పేరుతో తెరకెక్కిన చిత్రంలో విజయ్, సువలక్ష్మి జంటగా నటించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో 'సుస్వాగతం' పేరుతో తెరకెక్కించగా.. పవన్ కళ్యాణ్, దేవయాని నాయకా, నాయికలుగా నటించారు. ఓ అమ్మాయి ప్రేమను పొందే క్రమంలో  తండ్రిని పోగొట్టుకొని, ఆఖరికి తన ప్రేయసి కంటే లక్ష్య సాధనే ముఖ్యమని నమ్మిన ఓ యువకుడి ప్రయాణమే ఈ చిత్రకథ. 

కత్తి (ఖైదీ నెంబర్ 150)

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, సమంత జంటగా నటించారు. ఇదే చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా తెరకెక్కగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించారు. తెలుగులో ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. భూకబ్జాలు చేస్తున్న పెత్తందార్ల ఆగడాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కన్నీళ్లను తుడవడానికి నడుం బిగించిన ఓ యువకుడి కథ ఈ చిత్రం. 

  

 

తెలుగులో వరుసగా విడుదల అవుతున్న విజయ్ డబ్బింగ్ సినిమాలు

గత అయిదారు సంవత్సరాల నుండి విజయ్ సినిమాలు తెలుగులో వరుసగా విడదల అవుతున్నాయి. సచిన్, పోలీసోడు, అన్న, తుపాకీ, స్నేహితుడు, అదిరింది, విజిల్, సర్కార్, మాస్టర్ లాంటి సినిమాలు తెలుగులో కూడా ఆదరణను పొందాయి. 

ప్రస్తుతం 'వారసుడు' చిత్రంతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్.  

Read More: Thalapathy Vijay : దళపతి విజయ్ కొత్త సినిమా ‘వారసుడు’.. టైటిల్ ప్రకటించిన మేకర్స్ !

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!