Dil Raju ‘Varisu’: 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. ‘వారసుడు’ వివాదంపై దిల్ రాజు రియాక్షన్

Updated on Nov 28, 2022 12:41 PM IST
‘వరిసు’ (Varisu)ను ప్రారంభించిన సమయంలోనే తమిళం, తెలుగు, హిందీల్లో సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించామని నిర్మాత దిల్ రాజు గుర్తు చేశారు
‘వరిసు’ (Varisu)ను ప్రారంభించిన సమయంలోనే తమిళం, తెలుగు, హిందీల్లో సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించామని నిర్మాత దిల్ రాజు గుర్తు చేశారు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న ‘వరిసు’ (Varisu) చిత్రం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలుగులో ‘వారసుడు’గా రానున్న ఈ సినిమా రిలీజ్‌పై సందిగ్ధత ఏర్పడింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘వారసుడు’.. పండుగకు ఆడియెన్స్ ముందుకు రావడం కాస్త అనుమానంగానే మారింది. 

సంక్రాంతికి మరో రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న ‘వీరసింహారెడ్డి’ పొంగల్ బరిలో ఉన్నాయి. విజయ్ సరసన రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ‘వారసుడు’ (Varasudu)ను కూడా పండుగ రేసులో నిలిపేందుకు నిర్మాత దిల్ రాజు సిద్ధమవుతున్నారు. అయితే సంక్రాంతి, దసరా లాంటి పండుగ సీజన్స్‌లో తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 

 ‘వారసుడు’ (Varasudu)ను కూడా పండుగ రేసులో నిలిపేందుకు నిర్మాత దిల్ రాజు సిద్ధమవుతున్నారు

డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. అనువాద చిత్రాలను ఎవరూ ఆపలేరంటూ దిల్ రాజుకు మద్దతుగా మాట్లాడారు. తాజాగా ఈ వివాదంపై దిల్ రాజు (Dil Raju) నోరు విప్పారు. రీసెంట్‌గా ఓ టీవీ షోకు వెళ్లిన ఆయన.. ‘వరిసు’ వివాదంపై తనదైన శైలిలో స్పందించారు. ‘వరిసు’ను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని తాము మే నెలలోనే ప్రకటించామన్నారు. 

‘మేం వారసుడు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మే నెలలోనే చెప్పాం. ఈ మూవీ ప్రారంభించిన సమయంలోనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సంక్రాంతికి విడుదల చేస్తామన్నాం. ఇక ‘వాల్తేరు వీరయ్య’ జనవరిలో విడుదలవుతుందని జూన్‌లో ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ అనౌన్స్‌మెంట్ మాత్రం అక్టోబర్‌లో వచ్చింది. నిజానికి బాలకృష్ణ సినిమా డిసెంబర్‌లోనే థియేటర్లలో రావాల్సింది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావడం వల్లనో లేక సంక్రాంతి అడ్వాంటేజ్ కోసమో డిసెంబర్ నుంచి పండుగకు వస్తున్నట్లున్నారు’ అని దిల్ రాజు తెలిపారు. 

‘ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటం 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. దీని గురించి ‘గిల్డ్’కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వాళ్లను ఎవరూ ప్రశ్నించనూ లేదు. నిర్మాతలకు లేని ఇబ్బంది వేరే వాళ్లకు ఎందుకు వచ్చింది’ అని దిల్ రాజు క్వశ్చన్ చేశారు. ‘వారసుడు’ సినిమాను తాను అన్ని ఏరియాల్లోనూ అమ్మేశానన్నారు. తన మీద నమ్మకంతోనే వాళ్లు కొంటున్నారని.. డిస్ట్రిబ్యూటర్స్‌కు చాయస్ లేదనేది నిజమేనన్నారు. కాగా, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను ఒకే బ్యానర్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. 

Read more: "కృతి సనన్ (Kriti Sanon) మనసులో ఉన్న హీరో దీపికా పదుకొణెతో (Deepika Padukone) బిజీగా ఉన్నాడు": వరుణ్ ధావన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!