‘వారసుడు’ (Varasudu) సినిమా విడుదలపై వివాదం.. ఆసక్తి రేకెత్తిస్తున్న దళపతి విజయ్ (Vijay) ఫ్యాన్స్ మీట్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత అంత అభిమాన దళం ఉన్న కథానాయకుడు విజయ్ తప్ప మరొకరు లేరని అనడంలో అతిశయోక్తి లేదు. తన అభిమాన సంఘాల ద్వారా దళపతి విజయ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చాన్నాళ్లుగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తన ఫ్యాన్స్‌ను ఎప్పుడు కలిసినా అది ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
కరోనా తర్వాత ఇదే తొలిసారి
కనీసం ఏడాదికి ఒకసారైనా అభిమానులను కలుస్తుంటారు విజయ్. అయితే కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన తన ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా భేటీ కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని స్థానిక పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వాహకులు, కార్యకర్తలతో దళపతి సమావేశమయ్యారు. ఆయన నటిస్తున్న ‘వరిసు’ చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో.. విజయ్ ఫ్యాన్స్ మీట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సంక్రాంతికి ‘వరిసు’ మూవీ రిలీజ్ అవ్వడం సందేహంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’, నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాలు కూడా పొంగల్ బరిలో ఉన్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొనడంతో తెలుగు సినీ నిర్మాతల మండలి పండుగ రోజుల్లో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటిస్తూ ఓ లేఖను విడుదల చేసింది. ఇది తమిళ చిత్రసీమలో తీవ్ర చర్చకు దారితీసింది. నాన్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ లాంటి వాళ్లు తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
అభిమానులతో ఏం చర్చించారో..?
ఈ పరిస్థితుల నేపథ్యంలో విజయ్ తన అభిమానులతో భేటీలో ఏయే విషయాలపై చర్చించారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ‘వారసుడు’ (Varasudu) విడుదల వివాదంపై వారితో చర్చించారా లేదా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ‘వరిసు’ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా మరోసారి స్పష్టం చేశారు.
Read more: Governors Award: "గవర్నర్స్ అవార్డు"ల్లో భారతీయుల్ని గర్వపడేలా చేసిన రాజమౌళి SS Rajamouli)