Megastar Chiranjeevi: 'సూపర్ స్టార్' రజినీకాంత్ వాకింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. వీడియో వైరల్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి మాస్‌లో ఉండే ఇమేజ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ డ్యాన్సులు, ఫైటులతో ఆయన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.
ఇదే పంథాలోకి వస్తారు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా. తనదైన నటన, స్టైల్, నడక, అందంతో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నారు రజినీకాంత్. సినిమాల్లో ఆయన నడిచినా, కూర్చున్నా, సిగరెట్ కాల్చినా... ఇక ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకత కనిపిస్తుంది.
ఎవరి స్టైల్‌లో వారి మేటి అనిపించుకొని, ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్, సూపర్ స్టార్ (SuperStar Rajinikanth). ఒకరు అదిరిపోయే డాన్స్, ఫైట్, యాక్టింగ్ చేస్తే.. మరొకరు కేవలం స్టైల్, డైలాగ్స్, నడకతోనే వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.
అయితే.. వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఊహించుకున్నారా.. ఆ కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కాబట్టి.. అదెలాగో జరిగేలా లేదు. కానీ.. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తే.. ఆ కిక్కే వేరప్పా! అనిపిస్తుంది.
రజనీకాంత్ వాకింగ్ స్టైల్‌ను టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి అచ్చు గుద్దినట్టు దించితే ఎలా ఉంటుంది? ఇక దానికి పవర్‌ఫుల్ నేపథ్య సంగీతం తోడైతే, ఎంతటి మజా వస్తుంది? కాగా.. పండగలాంటి ఆ దృశ్యం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ చిరంజీవి.. రజనీకాంత్‌ని ఇమిటేట్ చేసింది ఎక్కడంటే? ఓటీటీ సంస్థ 'ఆహా'లో 'తెలుగు ఇండియన్ ఐడల్' (Telugu Indian Idol) అనే కార్యక్రమం ప్రసారమైన సంగతి మనందరికి తెలిసిందే.
ఇక గ్రాండ్ ఫినాలేకు (Telugu Indian Idol Grand Finale) చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాక ఈ వేదికపైనే చిరు అలా వాక్ చేశారు. కాగా తన సీట్లో నుంచి లేచి ఓ గాయకుడిని అభినందించడానికి వెళ్లే క్రమంలో.. ఆయన రజనీకాంత్ స్టైల్‌లో నడిచి, అందరినీ అలరించారు. ఇంకేముంది సూపర్ స్టార్ వాకింగ్ స్టైల్‌ను మెగాస్టార్ అనుకరించడంతో ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈలలు, కేరింతలతో స్టేజ్ దద్దరిల్లింది.
ఇదే కార్యక్రమంలో 'విరాటపర్వం' (Virataparvam) నాయకా,నాయికలు రానా దగ్గుపాటి, సాయి పల్లవి కూడా ఈ ఫినాలేలో పాల్గొని సందడి చేశారు. ఇకపోతే ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని రానా గుర్తు చేసుకున్నారు. అలాగే చిరంజీవి ఇంట్లో ఉండే టెలీస్కోప్‌తో తానేం చేశారో చెప్పారు. అనంతరం, తన తనయుడు రామ్‌చరణ్-రానాల స్నేహం గురించి చిరంజీవి వివరించారు.
ఇక ''నేను టెలిస్కోప్ మూత తీయమంటే రానా.. చరణ్ (Ramcharan) గది కిటికీ గ్రిల్‌ను తీశాడు. కాగా వారిద్దరు గదిలో చదువుకుంటున్నారేమో అనుకునేవాళ్లం. కానీ, కాదు.. వాళ్లకిష్టమొచ్చినట్టు బయట తిరిగొచ్చి, తర్వాత మళ్లీ గ్రిల్ పెట్టేవారు. అయితే దీన్ని కనిపెట్టేందుకు, మాకు సుమారు 3 నెలల సమయం పట్టింది'' అని చిరంజీవి నవ్వులు కురిపించారు.