Telugu Songs : సృష్టికర్త ఒక బ్రహ్మ.. అతనిని సృష్టించిందొక అమ్మ (టాప్ 10 అమ్మ పాటలు)
Telugu Songs : సృష్టికి జీవం పోసింది అమ్మ.. సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మ గొప్పదనాన్ని చెబుతూ టాలీవుడ్‌లో ఎన్నో పాటలు వచ్చాయి. అమ్మ సెంటిమెంట్‌పై సాగే పాటలు హిట్ సాధించాయి. అంతేకాడు అమ్మ ప్రేమ కోసం తీసిన కథలు బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. తెలుగు రచయితలు అద్భుతమైన లిరిక్స్‌తో అమ్మ పాటలను రాశారు. టాప్ 10 అమ్మ పాటలపై స్పెషల్ స్టోరి.
1. మేజర్ (Major)
కన్నా కన్నా.. చిన్నారి కన్నా
జోలాలి పాటై నీ చెంతనున్న
నిదురించరా..
కన్నా.. నిదురించరా..
మేజర్ (Major) సినిమాలో కన్నా.. కన్నా.. అమ్మ పాటగా సాగింది. ఈ పాట ఎన్నో భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది. 'మేజర్' సందీప్‌ను చిన్నతనంలో తన అమ్మ నిద్రపుచ్చేందుకు పాడిన జోల పాటను రామజోగయ్య శాస్త్రి గొప్పగా రాశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శ్రీ చరణ్ పాకాల వ్యవహరించారు. 'మేజర్'లో శ్రీ చరణ్ కంపోజ్ చేసిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ముంబై దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా తెరకెక్కింది. హీరో అడివి శేష్ (Adivi Sesh) 'మేజర్' పాత్రలో మెప్పించారు. మేజర్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప దేశభక్తి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అడవి శేష్ తల్లిగా రేవతి అద్భుతంగా నటించారు. ఈ సినిమాను శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. .'మేజర్' చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
2. కేజీఎఫ్ చాప్టర్ 2 (K.G.F: Chapter 2)
ఎదగరా ఎదగరా దినకరా
జగతికే జ్యోతిగా నిలవరా
పడమర నిశితెర వాలనీ
చరితగా ఘనతగా వెలగరా
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరు ఈ ఒక్క డైలాగుతో అమ్మ గొప్పదనం గురించి తెలిపిన సినిమా కేజీఎఫ్ చాప్టర్2. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సూపర్ హిట్ సాధించింది.రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.సుచేత బస్రూర్ అద్భుతంగా ఆలపించారు. కేజీఎఫ్ చాప్టర్2 సినిమాలో యశ్‌కు అమ్మగా నటించి మెప్పించారు అర్చన జైస్.
ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం అమ్మ కోసం తీసుకొస్తానంటూ చెప్పిన డైలాగులు అమ్మపై ప్రేమను చూపాయి. ఎన్ని కష్టాలొచ్చినా దాటుకుని ఎదగాలనే పాట అమ్మ బిడ్డ భవిష్యత్తు కోసం పడే తాపత్రయం ఒక్క పాటతో చూపించారు.
కేజీఎఫ్ చాప్టర్‌కు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్2 (K.G.F: Chapter 2) ను ప్రశాంత్ నీల్ తెరెక్కించారు. అమ్మ సెంటిమెంట్‌పై హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. కన్నడ సినిమా చరిత్రలోనే కేజీఎప్ చాప్టర్ 2 ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
3. బిచ్చగాడు (Bichagadu)
వంద దేవుళ్ళే కలిసొచ్చిన
అమ్మ నీలాగా చూడలేరమ్మ
కోట్ల సంపదే అందించిన
నువ్వుచ్చే ప్రమే దొరకదమ్మ
అమ్మ ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారిన కొడుకు కథగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. అమ్మ కోసం ఎంత చేసినా తక్కువ అనే మెసేజ్‌తో తమిళ దర్శకుడు శశి బిచ్చగాడు సినిమాను తెరకెక్కించారు. విజయ్ అంటోనీ బిచ్చగాడు సినిమాలో జీవించారు. అంతేకాదు ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించారు. బాషశ్రీ ఈ పాటకు లిరిక్స్ రాశారు.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై చదలవాడ తిరుపతిరావు బిచ్చగాడు సినిమాను నిర్మించారు. పిచ్చైకారన్ అనే తమిళ సినిమా తెలుగులో బిచ్చగాడుగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
4.యోగి (Yogi)
ఏ నోము నోచిందో
ఏ పూజ చేసిందో
పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
ప్రభాస్ నటించిన యోగి సినిమాలో అమ్మ పాటగా ఏ నోము నోచిందో సాగింది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. ప్రభాస్‌కు తల్లిగా శారద ఈ సినిమాలో నటించారు. యోగి సినిమాకు వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. ఈశ్వరీ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పి.సుదర్శన్ రెడ్డి, పి.చంద్రప్రతాపరెడ్డిలు నిర్మించారు.
5. నాని (Naani)
పెదవే పలికిన మాటల్లోనే తీయదనం అమ్మా
కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా
మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో అమ్మ పాటకు మంచి గుర్తింపు లభించింది. చంద్రబోస్ ఈ పాటను రాశారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించిన పెదవే పలికిన మాటల్లోనే సాంగ్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. భార్య తల్లి కాబోతుందని తెలుసుకున్న హీరో అమ్మను గుర్తు చేసుకుంటూ నాని అమ్మ పాటను పాడుతారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు అమ్మగా దేవియాని నటించారు. భార్యగా అమేషా పటేల్ యాక్ట్ చేసుకున్నారు. ఎస్. జె. సూర్య దర్శకత్వంలో నాని విడుదలైంది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మంజుల ఘట్టమనేని ఈ సినిమా నిర్మించారు.
6.అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి (Amma Nanna O Tamila Ammayi)
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా అంటే టక్కున గుర్తుకొచ్చే పాట "నీవే నీవే నీవే నేనంట". అమ్మ అంటే ఏంటో చెప్పే ఈ పాటను పెద్దాడ మూర్తి రాయగా.. చక్రి సంగీతాన్ని అందించారు. హీరో రవితేజకు అమ్మగా జయసుధ అమ్మ పాత్రలో జీవించారు. దర్శక, నిర్మాతగా పూరీ జగన్నాథ్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాను తెరకెక్కించారు.
7. ప్రియరాగాలు (Priyaragalu)
చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
మలయాళ చిత్రం పప్పయుడే స్వాంతం అప్పూసు సినిమాను తెలుగులో ప్రియరాగాలుగా రీమేక్ చేశారు. సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు. జగపతిబాబు, సౌందర్య, మహేశ్వరీలు నటించిన ఈ చిత్రంలో అమ్మ పాటకు మంచి గుర్తింపు దక్కింది. బాల నటుడుగా ఆనందవర్ధన్ కోసం తల్లి పాత్రలో సౌందర్య పాడే పాట "చిన్న.. చిరు చిరు" సాగింది. కీరవాణి అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించగా.. సుంకర మధుమురళి నిర్మాతగా వ్యవహరించారు.
8.ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (Intlo Illalu Vantintlo Priyuralu)
అమ్మనే అయ్యనురా నీ రాకతో
కమ్మని ఆనందమే నిండాలి నీతో
ఓహ్ జాబిలి కునా లాలిజో ఓ
నవ్వుల నానా లాలిజో
వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ సినిమాలో అమ్మ కాకపోయినా.. ఓ బాబును సొంత కొడుకుకన్నా ఎక్కువగా చూసుకునే పాత్రలో సౌందర్య అద్భుతంగా నటించారు. సామవేదం షణ్ముక శాస్త్రి లిరిక్స్ రాశారు. కోటి సంగీతం సమకూర్చారు.
9. అభిషేకం (Abhishekam)
నాలో నిను చూసుకోగ
నాతో మురిపించుకోగ
ఒళ్లో పాపాయివయినావమ్మా..
అభిషేకం సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో నటించిన సినిమా. రాధిక అమ్మ పాత్రలో నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి అభిషేకం సినిమాకు సంగీతం అందించారు.
10.అమ్మరాజీనామా (Amma Rajinama)
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మ రాజీనామా సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. శారద అమ్మ పాత్రలో జీవించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎవరు రాయగలరు అనే పాటను అద్భుతంగా రాశారు. కె. చక్రవర్తి ఈ పాటకు సంగీతం అందించారు. అశ్వినీ దత్ అమ్మ రాజీనామాను నిర్మించారు.