IMDb Best of 2022 : 2022లో అత్యంత జనాదారణ పొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR)
IMDb Best of 2022: 2022 సంవత్సరానికిగానూ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల జాబితాను ఇంటర్‌నెట్ మూవీ డాటాబేస్ (IMDB) సంస్థ విడుదల చేసింది. బాలీవుడ్ సినిమాలను వెనక్కు నెట్టి తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' అగ్ర స్థానంలో నిలిచింది. 2022 ఐఎండీబీ టాప్ 10 సినిమా జాబితాలో టాలీవుడ్ (Tollywood) సినిమాలు మేజర్, సీతారామం కూడా స్థానం సంపాదించుకున్నాయి.
'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) (RRR) సినిమా భారతదేశ స్వాంతంత్య్ర సమర యోధుల కథ. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా.. కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' ఈ ఏడాది మార్చిలో ఐదు భాషల్లో రిలీజ్ అయింది.
'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డులు మీద రికార్డులు సాధిస్తుంది. ఈ సినిమా ఆస్కార్ లెవల్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమమే జరిగింది. 21 సంవత్సరాల తరువాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఉత్తమ విదేశీ చిత్రానికి అలాగే బెస్ట్ సాంగ్ కేటగిరీలలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది.
బాలీవుడ్ సినిమాలను వెనక్కు నెట్టి 'ఆర్ఆర్ఆర్' 2022 సంవత్సరానికిగానూ అత్యంత జనాదారణ పొందిన సినిమాగా ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. హిందీ సినిమా 'ది కశ్మీరీ ఫైల్స్' ఒకటే టాప్ 10 జాబితాలో నిలిచింది. ఈ సినిమా రెండవ స్థానంలో నిలిచింది.
కశ్మీర్ పండితులపై జరిగిన మారణహోమాన్నిదర్శకుడు వివేక్ అగ్నిహోత్ 'ది కశ్మీరీ ఫైల్స్' సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ఏడాది విడుదలైన అన్ని హిందీ సినిమాల్లో 'ది కశ్మీరీ ఫైల్స్' కమర్షియల్ హిట్ సాధించింది.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్ర' కాసుల వర్షం కురిపించింది. కానీ అత్యంత జనాదారణ పొందిన సినిమాగా చోటు దక్కించుకోలేకపోయింది. 'బ్రహ్మాస్త్ర' సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
మొదటి స్థానంలో తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' నిలవగా.. ఏడవ స్థానంలో మేజర్ చిత్రం, ఎనిమిదవ స్థానంలో సీతారామం చోటు దక్కించుకున్నాయి.
తమిళ సినిమాల విషయానికి వస్తే.. 'విక్రమ్', 'పొన్నియిన్ సెల్వన్1', 'రాకెట్రీ- ది నంబీ ఎఫెక్ట్' ఐఎండీబీ జాబితాలో ఉన్నాయి. మూడు కన్నడ సినిమాలు అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రాలుగా నిలిచాయి. ఆ సినిమాలు 'కేజీఎఫ్ చాప్టర్2', 'కాంతార', '777 చార్లీ'.
బయోపిక్ సినిమాలు 'రాకెట్రీ - ది నంబీ ఎఫెక్ట్', 'మేజర్' ఐఎండీబీ టాప్ 10 సినిమాల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్, కమల్ హాసస్‌లు దాదాపు ఐదేళ్ల తరువాత వెండితెరపై కనిపించారు. 'పొన్నియన్ సెల్వన్ 1' చిత్రంలో ఐశ్వర్యరాయ్ నెగెటీవ్ షేడ్ పాత్రలో నటించి మెప్పించారు. కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో తమిళ సినిమా రికార్డులను కొల్లగొట్టారు. వీరు నటించిన రెండు సినిమాలు ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ 2022లో లిస్టులో ఉండటం విశేషం.