Telugu Mythological Movies: భారత చలనచిత్ర చరిత్రలో నిలిచిన తెలుగు పౌరాణిక చిత్రాలు (టాప్ 10 చిత్ర విశేషాలు)
Telugu Mythological Movies: భారతీయ చలనచిత్ర చరిత్రలో పౌరాణిక సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించి మెప్పించారు కాబట్టే వారు అగ్ర స్థానంలో నిలిచారు. తెలుగు పౌరాణిక చిత్రాలంటే అప్పట్లో ఓ సంచలనం. మాయాబజార్ విడుదలై 65 ఏళ్లు గడుస్తున్నా, భారతదేశంలో ఇప్పటికీ అత్యుత్తమమైన సినిమాగా కొనసాగుతోంది.
తెలుగు సినిమాల్లో అగ్ర స్థానంలో నిలిచిన పది పౌరాణిక చిత్ర విశేషాలు..
పౌరాణికం అంటే?
పౌరాణికం అంటే పురాణ కథల్లోని పాత్రల ఆధారంగా కథను చెప్పడం. ఇదే ఇతివృత్తంతో రంగస్థలం మీద నటీనటులతో ప్రదర్శించే నాటకాలను పౌరాణిక నాటకాలంటారు. అప్పటి కాలంలో సమాజంలో నైతిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కలిగించేందుకు పౌరాణిక నాటకాలు ఎంతో ఉపయోగపడేవి. పౌరాణిక నాటకాలకు మంచి ప్రజాదరణ ఉండేది. దీంతో దర్శక, నిర్మాతలు ఎన్నో గొప్ప గొప్ప పౌరాణిక చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.
1. మాయాబజార్ (Mayabazar)
అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. మాయాబజార్ సినిమా పౌరాణిక చిత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. వెండితెరపై నవరసాలను పండించిన చిత్రంగా మాయాబజార్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్‌వీ రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, రమణా రెడ్డి, సూర్యకాంతం ఈ చిత్రంలో నటించారు. 1957 మార్చి 27న మాయాబజార్ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా వ్యవహరించారు.
అలాగే ఇదే చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. కేవీ రెడ్డితో వచ్చిన విభేదాలతో సాలూరు సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో మిగిలిన బాణీలను ఘంటసాల అందించారు. ఈ సినిమా కథా రచనతో పాటు పాటలు, పద్యాలను పింగళి నాగేంద్రరావు రాశారు. తస్మదీయులు, దుష్టచతుష్టయం వంటి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలకు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి. అయితే సినిమా టైటిల్స్‌లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు. మాయా బజార్ చిత్రం విడుదల సందర్భంగా చందమామ పుస్తకంలో ఈ సినిమా పూర్తి కథను ప్రచురించారు.
కథా విశేషాలు
బలరాముడిగా గుమ్మడి వేంకటేశ్వరరావు, కృష్ణుడిగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు. వీరిద్దరి చెల్లెలు సుభద్ర. పాండవుల్లో ఒకరైన అర్జునుడి భార్య సుభద్ర. వీరి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. శశిరేఖ పాత్రలో సావిత్రి నటించారు. అభిమన్యుడు, శశిరేఖల వివాహం కోసం కృష్ణుడు ఘటోత్కచుడు (ఎస్.వి. రంగారావు)తో కలిసి చేసిన మాయ ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం.
2. నర్తనశాల (NarthanaSala)
మహాభారతంలోని విరాట పర్వం ఇతివృత్తంగా నర్తనశాల సినిమాను తెరకెక్కించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1963 అక్టోబర్ 11న ఈ సినిమా తెలుగులో విడుదలైంది. రాజ్యం పిక్చర్స్ బ్యానరుపై సి.లక్ష్మీరాజ్యం,కె.శ్రీధరరావులు నిర్మించారు. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. పాటల రచయితగా సముద్రాల రాఘవాచార్య వ్యవహరించారు.
నటీనటులు
నందమూరి తారక రామారావు, సావిత్రి, దండమూడి రాజగోపాలరావు,ఎస్.వి.రంగారావు, మిక్కిలినేని, రేలంగి, రాజనాల, ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం, కాంచనమాల, అల్లు రామలింగయ్య, శోభన్ బాబు ఈ చిత్రంలో నటించారు.
కథ
మహాభారతంలోని విరాట పర్వంలో భాగంగా రచించిన పాండవుల అజ్ఞాతవాసపు కథ ఆధారంగా నర్తనశాల చిత్రాన్ని తెరకెక్కించారు. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసానికి వెళతారు. షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ అజ్ఞాతవాస ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని నర్తనశాల చిత్రాన్ని రూపొందించారు.
కీచకునిగా ఎస్వీరంగారావు, బృహన్నలగా రామారావు ,ద్రౌపదిగా సావిత్రి ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. కీచకునిగా నటించిన రంగారావుగారికి ఆనాటి జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి పురస్కారం లభించడం విశేషం.
నర్తనశాల అప్పట్లో రాష్ట్రపతి బహుమానాన్ని పొందింది. నంది అవార్డు కూడా సాధించింది. 1964లో ఇండొనీషియా రాజధాని జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు పొందింది.
3. పాండవ వనవాసం (Pandava Vanavasam)
పాండవ వనవాసం సినిమా 1965 జనవరిలో విడుదలైంది. పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు నిర్మించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం సమకూర్చారు. సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర గీత రచన చేశారు.
కథా విశేషాలు
మహాభారతంలో పాండవులు మాయా జూదంలో ఓడిపోతారు. జూదంలోని షరతులు కారణంగా 12 ఏళ్లు అరణ్య వాసానికి వెళతారు. ఆ వనవాసంలోని విశేషాలతో పాండవ వనవాసం తెరకెక్కించారు. ఎన్టీఆర్ భీముడిగా, ఎస్వీ రంగారావు దుర్యోధనుడిగా, కాంతారావు కృష్ణుడిగా, సావిత్రి ద్రౌపదిగా నటించి మెప్పించారు.
4. శ్రీ కృష్ణ తులాభారం (Sri Krishna Tulabharam)
భాగవతంలో పారిజాతాపహరణం ఘట్టం ఉంది. ఆ ఘట్టాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవి తిమ్మన తనదైన శైలిలో రాశారు. తిమ్మన రాసిన పారిజాతాపహరణం కథ ఆధారంగా శ్రీ కృష్ణ తులాభారం అనే నాటకాన్ని ముత్తురాజు సుబ్బారావు రూపొందించారు. దీంతో శ్రీ కృష్ణ తులాభారం సినిమా తెరకెక్కింది. 1966 ఆగస్టు 25న ఈ సినిమాను విడుదల చేశారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్, రుక్మిణిగా అంజలి దేవి, సత్యభామగా జమున నటించారు. ఈ సినిమాకు కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. నిర్మాత డి రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. పెండ్యాల నాగేశ్వర రావు సంగీతం అందించారు.
కథ
నరకాసుర వధ తర్వాత శ్రీకృష్ణసత్యభామలు ద్వారకకు వస్తారు. సత్యభామ తన వల్లే నరకాసుర వధ జరిగిందనే గర్వంతో ఉంటుంది. శ్రీకృష్ణుడిని కొంగున ముడేసుకోవాలని పుణ్యక వత్రం చేస్తుంది. వత్రంలో భాగంగా శ్రీ కృష్ణుడిని నారదుడికి దానం చేస్తుంది. నారదుడి నుంచి భర్తను తిరిగి పొందాలంటే, సత్యభామ శ్రీ కృష్ణ తులాభారం ఏర్పాటు చేయాల్సిందే.
అయితే సత్యభామ ఎంత సంపద తూచినా, శ్రీకృష్ణుడి బరువుకు సరిపోదు. అప్పుడు కేవలం రుక్మిణి వల్లే శ్రీ కృష్ణ తులాభారం సాధ్యమని నారదుడు చెబుతాడు. రుక్మిణి కేవలం ఒకే ఒక తులసీదళంతో శ్రీ కృష్ణుడిని తులాభారంలో తూచగలుగుతుంది. అప్పుడు సత్యభామ గర్వం నశించి శ్రీకృష్ణుడి దాసిగా మారుతుంది.
5.. భక్త ప్రహ్లాద (Bhakta Prahlada)
1967లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా విడుదలైంది. రోజారమణి బాల నటిగా నటించారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కథ ఆధారంగా వచ్చిన సినిమా భక్త ప్రహ్లాద.
ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా ఎస్.వి. రంగారావు, ప్రహ్లాదుడిగా రోజారమణి, ప్రహ్లాదుడి తల్లిగా అంజలీ దేవి నటించారు.బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఏవీ మెయ్యప్పన్ నిర్మించాడు. నరసరాజు సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు సమకూర్చారు. మంగళంపల్లి
6.సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam)
శోభన్ బాబు రాముడి పాత్రలో నటించిన చిత్రం సంపూర్ణ రామాయణం. సీత పాత్రను చంద్రకళ పోషించారు. ఈ సినిమాకు దర్శకత్వం బాపు వహించారు. ముళ్లపూడి వెంకటరమణ రచన ఆధారంగా సంపూర్ణ రామాయణం చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీరాముడి జననం, సీతతో వివాహం, రావణుడి సంహారం, శ్రీరామ పట్టాభిషేకం ఘట్టాలను ఈ సినిమాలో చూపించారు. లక్ష్మీ ఎంటర్‌ప్రైజస్ బ్యానర్‌పై నిడమర్తి పద్మాక్షి నిర్మించిన ఈ సినిమా 1971లో విడుదలైంది. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు, పద్యాలను ఆరుద్ర రచించారు.
7. బాల భారతం (Bala Bharatam)
బాల భారతం సినిమా 1972లో విడుదలైంది. పాండవులు, కౌరవుల చిన్నతనంలో జరిగిన విశేషాలను ఈ సినిమాలో చిత్రీకరించారు. శ్రీదేవి బాల నటిగా నటించారు. కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిర్మాత సి.హెచ్.ప్రకాశరావు వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్వీ రంగారావు, కాంతారావు, అంజలీదేవి, మిక్కిలినేని, మాస్టర్ ప్రభాకర్, హరనాథ్, ఎస్.వరలక్ష్మి, బేబీ శ్రీదేవి ఈ సినిమాలో నటించారు.
8. దానవీర శూరకర్ణ (Daana Veera Soora Karna)
నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన దానవీర శూరకర్ణ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. పది లక్షల రూపాయలు ఈ సినిమా బడ్జెట్. కానీ కోటి రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. దానవీర శూరకర్ణ సినిమాను 1977 జనవరి 14న విడుదల చేశారు.
ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా ఎన్టీఆర్ వ్యవహరించారు. రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. సి.నారాయణ రెడ్డి, దాశరధి కృష్ణమాచార్యులు పాటలను రాశారు. తిరుపతి వెంకట కవులు, కొండవీటి వెంకటకవి పద్యాలను సమకూర్చారు.
కథా విశేషాలు
కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడి పాత్రల ఔన్నత్యాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ మూడు పాత్రలలో నందమూరి తారక రామారావు నటించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అభిమన్యుడి పాత్రను పోషించగా, నందమూరి హరికృష్ణ అర్జునుడి పాత్రలో నటించారు.
9. బాల రామాయణం (Ramayanam)
బాల రామాయణంలో ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించారు. 1996 ఏప్రిల్ 11 తేదిన ఈ చిత్రం విడుదల అయింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'బాల రామాయణం ' సినిమాను మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించారు. రాముడు, సీత పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, స్మితా మాధవ్ నటించి మెప్పించారు. ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్, ఎల్.వైద్యనాధన్ సంగీతం సమకూర్చారు.
10. శ్రీ రామరాజ్యం (Sri Rama Rajyam)
హిందూ పురాణాల్లో ఉత్తర రామాయణం ఆధారంగా 'శ్రీ రామరాజ్యం' చిత్రాన్ని తెరకెక్కించారు. బాలకృష్ణ రాముడి పాత్రలో నటించారు. నయనతార సీత పాత్రలో మెప్పించారు. బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీరామరాజ్యం 2011 నవంబరు 17 న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ముళ్ళపూడి వెంకట రమణ మాటలు రాశారు.
కథ
సీతా వనవాసం.. ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చివరాంకంలో లవకుశులను రామునికి అప్పగించి, సీత భూదేవితో కలిసిపోతుంది. ఆ తర్వాత రాముడు లవకుశులకు అయోధ్య రాజ్య పట్టాభిషేకం చేసి, తాను సైతం వైకుంఠం చేరుతాడు. ఈ కథను బాపు శ్రీ రామ రాజ్యంగా తెరకెక్కించారు.