Teachers Day Special : 'గురువే దైవం .. గురువు మాట వేదం' అని చాటి చెప్పిన టాప్ 10 తెలుగు చిత్రాలు మీకోసం !
బడి పంతులు (Badi Panthulu) : ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు విద్యార్థులను సన్మార్గంలో నడిపించే గురువు పాత్రలో నటించారు. తన జీవితంలో ఎందరో పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఆ గురువే ఆఖరికి.. కన్నబిడ్డలు పట్టించుకోకపోవడంతో నిరాశ్రయుడవుతాడు. ఇలాంటి సమయంలో ఆయన వద్ద విద్యనభ్యసించిన వారే ఆయనకు బాసటగా నిలుస్తారు.
మరో ప్రపంచం (Maro Prapancham) : అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం యూటోపియన్ వరల్డ్ అనే అంశంపై తెరెకెక్కిన గొప్ప స్ఫూర్తిదాయకమైన చిత్రం. సమ సమాజ స్థాపన కోసం కొందరు ఉపాధ్యాయులు ఏకమై, స్వార్థపూరిత లోకానికి దూరంగా పిల్లలను తీసుకెళ్లి .. అక్కడ వారికి శాస్త్రీయ విధానంలో బోధన చేయడానికి ప్రయత్నిస్తారు. తమ విద్యా వ్యవస్థకు మరో ప్రపంచం అనే పేరు పెట్టుకుంటారు.
రేపటి పౌరులు (Repati Pourulu) : విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విద్యా వ్యవస్థలో, సమాజంలో సమూలమైన మార్పును ఆశించే ఓ ఉపాధ్యాయురాలి కథ. టి.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ టీచర్ పాత్ర ద్వారా విద్యార్థులకు సమాజంలో జరిగే అన్యాయ, అక్రమాల గురించి ఒక అవగాహన కల్పించడం గమనార్హం. సమాజంలోని చెడును ఎదుర్కొనేందుకు విద్యార్థులను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చిత్రమిది.
హైహై నాయకా (Hai Hai Nayaka) : నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జంధ్యాల మార్కు కామెడీ చిత్రం. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడైన కథానాయకుడు ఓ అల్లరి పిల్లవాడిని మంచి విద్యార్థిగా మార్చే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడో మనకు తెలియజేస్తుంది. "గురువంటే గుండ్రాయి కాదు.. బుడుగంటే బుడిచెంబు కాదు" అనే పాట ఈ సినిమాలోనిదే.
గోల్కొండ హైస్కూల్ (Golconda High School) : స్కూల్లో పిల్లలకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే ఓ వ్యాయామ ఉపాధ్యాయుడి కథ ఇది. కోరిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత కష్టపడాలో, పిల్లలకు ఎలాంటి పట్టుదల ఉండాలో తెలిపే ఈ సినిమాలో కోచ్ పాత్రలో సుమంత్ నటించారు.
ఓనమాలు (Onamalu) : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో రిటైర్డ్ మాస్టారి పాత్రలో అద్భుతంగా నటించారు. ఒక ఊరిలో మార్పు తీసుకురావడానికి ఓ అధ్యాపకుడు పడే తాపత్రయం ఈ చిత్రం.
ప్రొఫెసర్ విశ్వం (Professor Viswam) : నమ్మవర్ అనే తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ చిత్రం. కాలేజీ విద్యార్థులలో మార్పు తేవడం కోసం, తనదైన శైలిలో కొత్త పద్థతులకు శ్రీకారం చుట్టే ఓ ప్రొఫెసర్ కథ ఇది. ఈ సినిమాలో కమల్ హాసన్ హిస్టరీ ప్రొఫెసర్‌గా నటించారు.
మాస్టర్ (Master) : ఈ సినిమాలో చిరంజీవి కాలేజీ లెక్చరర్‌గా నటించారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులకు సన్మార్గంలో పెట్టడానికి, ర్యాగింగ్ పేరుతో కళాశాల వాతావరణాన్ని చెడగొట్టే రాజకీయ నాయకుల పిల్లలకు బుద్ధి చెప్పడానికి ఓ లెక్చరర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ సినిమా తెలియజేస్తుంది.
గురు (Guru) : వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఓ బాక్సింగ్ కోచ్ కథ. ఓ గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయికి బాక్సింగ్ పై ఉండే ఇష్టాన్ని గమనించి, తనకు ఆ క్రీడలో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాడు. మరి ఆమె తను అనుకున్న లక్ష్యం చేరుకుందో లేదో తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. హిందీ చిత్రం సాలా కాదూస్‌కి రీమేక్ ఈ చిత్రం.
రాక్షసి (Rakshashi) : జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కథ. విద్యా వ్యవస్థలో మార్పు కోసం ఓ ఉపాధ్యాయురాలు చేసే పోరాటమే ఈ సినిమా. స్కూల్లో పిల్లలను, టీచర్లను కూడా సన్మార్గంలో పెట్టడానికి ఓ అధ్యాపకురాలు పడే ఆరాటం ఈ చిత్రం. ఈ సినిమాకు గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించారు.
తమ వద్ద విద్యను అభ్యసించే విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, వారి భవితకు బాటలు వేసే ఆదర్శ గురువుల జీవితాలను ప్రతిబింబించే ఇంకా అనేక చిత్రాలు వచ్చాయి. ఏదేమైనా, ఇలాంటి సినిమాలు పిల్లలలో స్ఫూర్తిని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read More: సినిమాల్లో "విద్యా" వెలుగులు