Prabhas : ప్రభాస్ 'ప్రాజెక్టు కె' వార్ ఫిల్మ్ కోసం 'మహీంద్ర' సంస్థతో డీల్? ఈ సినిమా గురించిన టాప్ 5 విశేషాలివే
'బాహుబలి' చిత్రం విడుదలై సక్సెస్ సాధించాక, ప్రభాస్ (Prabhas) రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో ఆయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్'తో పాటు .. నాగ్ ఆశ్విన్ డైరెక్ట్ చేస్తున్న 'ప్రాజెక్టు కె' చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో 'ప్రాజెక్టు కె'చిత్రానికి సంబంధించి అనేక కొత్త విషయాలు చర్చకు వచ్చాయి. వాటి గురించిన ఈ కథనం మీకోసం ప్రత్యేకం
మూడో ప్రపంచ నేపథ్యంలో సాగే కథ
'ప్రాజెక్టు కె' (Project K) అనేది ఓ వార్ ఫిల్మ్ అని.. మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ యుద్ధానికి మహాభారత యుద్ధానికి కూడా కథలో లింక్ ఉంటుందట. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఈ కథలో భాగమయ్యే అవకాశం ఉందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, పలు ప్రముఖ మీడియా ఛానళ్లు టీవీలలో కథనాలను కూడా ప్రసారం చేశాయి.
సైన్స్ ఫిక్షన్ సినిమాగా..
'మహా నటి' సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు నాగ్ ఆశ్విన్ (Nag Ashwin). ఆయనే ఈ 'ప్రాజెక్టు కె' చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్.
రూ. 500 కోట్ల బడ్జెట్‌తో
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'ప్రాజెక్టు కె' చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పడుకొనే, దిశా పటానీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, డానీ సాంచెజ్ లోపేజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు.
మహీంద్ర కంపెనీతో ఒప్పందం
'ప్రాజెక్టు కె' (Project K) చిత్రంలో కథ అంతా ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ మీద నడుస్తుందట. అయితే దర్శకుడు ఈ వెహికల్స్‌ని స్క్రీన్ మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో చూపించకూడదని భావించారట. అందుకే వాహనాల తయారీలో దిగ్గజ సంస్థ అయిన 'మహీంద్ర' (Mahindra) తో ఒప్పందం కుదుర్చుకొని, నిజంగానే ఈ ప్రత్యేకమైన వాహనాలను డిజైన్ చేయించారట.
ప్రత్యేకమైన కెమెరాతో షూటింగ్
'ప్రాజెక్టు కె' (Project K) సినిమా కోసం భారతదేశంలోనే తొలిసారిగా ఓ ప్రత్యేకమైన కెమెరాను వాడుతూ షూటింగ్ చేస్తున్నారట. Arri Alexa (అరి అలెక్స్) అనే డిజిటల్ మోషన్ పిక్చర్ కెమెరా సిస్టమ్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మన దేశంలో ఈ టెక్నాలజీని వాడుతున్న తొలి సినిమా 'ప్రాజెక్టు కె' కావడం విశేషం.
ఇవండీ.. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ప్రాజెక్టు కె' సినిమా సంగతులు. ఈ విషయాలను బట్టి చూస్తే, ఈ సినిమా కచ్చితంగా ఓ పెద్ద ట్రెండ్ సెట్టర్ అవుతుందని అనిపించక మానదు కదా.