The Warriorr Movie Review : మాస్ అభిమానులకు 'రామ్ పోతినేని' స్పెషల్ ట్రీట్ .. కానీ 'కథ' విషయానికి వస్తే ?
నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
దర్శకత్వం : ఎన్.లింగుస్వామి
రెడీ, ఒంగోలు గిత్త, కందిరీగ, ఉన్నది ఒకటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ హీరో స్థానాన్ని కైవసం చేసుకున్న నటుడు రామ్ పోతినేని (Ram Pothineni). ఇటీవలే రామ్ తొలిసారిగా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన “ది వారియర్” (The Warriorr) చిత్రంలో నటించారు. ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఈ సినిమాలో ప్రతినాయకుడు.
రామ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కిన “ది వారియర్” చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా కథా కమామీషు ఏంటో మనమూ తెలుసుకుందాం
కథ:
కర్నూల్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడానికి వచ్చే డాక్టర్ సత్య (రామ్), అనుకోకుండా గురు (ఆది పినిశెట్టి) అనే స్థానిక ముఠా నాయకుడితో పేచీ పెట్టుకుంటాడు. ఇదే క్రమంలో తనకు పరిచయమైన విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) అనే అమ్మాయితో ప్రేమలో కూడా పడతాడు.
కానీ రోజురోజుకీ గురు ఆగడాలను అడ్డుకొనే క్రమంలో, సత్య జీవితమే ఓ ప్రమాదంలో పడుతుంది. అటువంటి సమయంలో ఐపీఎస్ చదవాలనే కీలక నిర్ణయం తీసుకుంటాడు సత్య. రౌడీల నడ్డి విరవాలంటే, పోలీస్ అవ్వడం ఒకటే దారి అని అనుకుంటాడు. మరి అతని ఆశయం నెరవేరిందా? సత్య ఆఖరికి గురుకి ఎలా బుద్ధి చెప్పాడు? ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరో రామ్ నటన గురించి. రెండు భిన్న పార్శ్వాలున్న పాత్రలో ఆయన ఒదిగిపోయారు. అలాగే యాక్షన్ సీన్స్‌లో కూడా తన మార్క్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలో నటించిన తీరు ఫ్యాన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.
ఇక కథానాయిక కృతి శెట్టి (Kriti Shetty) తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. విజిల్ మహాలక్ష్మిగా ఆమె నటన కూడా ఆకట్టుకొనే విధంగానే ఉంది. అలాగే దర్శకుడు లింగుస్వామికి ఇలాంటి సబ్జెక్టులు కొట్టిన పిండి. తమిళంలో మంచి యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరొందిన లింగుస్వామి, తెలుగులో చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే.
అదేవిధంగా, ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి బాగా నటించారు. విలన్ పాత్రలోకి అలవోకగా పరకాయ ప్రవేశం చేసేశారు. ఆయన సీన్స్ అన్ని కూడా ఆసక్తికరంగానే సాగాయి. అలాగే భావోద్వేగాలతో ముడిపడిన సన్నివేశాలలో నదియా నటన కూడా బాగుంది. ఆమె పాత్ర సినిమాకి ప్లస్ అయ్యింది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రతికూల అంశం ఉందంటే, అది హీరో, హీరోయిన్ల మధ్య నడిచే ప్రేమకథ అనే చెప్పాలి. ఇంత పెద్ద మాస్ మసాలా సినిమాలో ప్రేమ సన్నివేశాలు అంతబాగా ఎలివేట్ కాలేదు. అలాగే కొన్ని చోట్ల ఫైట్స్ కథకు అడ్డం పడుతూ, ఫ్లోని బ్రేక్ చేస్తుంటాయి. కాకపోతే ఓ డాక్టర్ దుర్మార్గులను ఎదిరించడం కోసం ఐపీఎస్ చదవడం అనే పాయింట్ కొత్తగా ఉంది. సన్నివేశాలను కూడా దర్శకుడు కథకు తగ్గట్లుగానే అల్లుకున్నారు. అయితే కొన్ని చోట్ల అవి వర్కవుట్ కాలేదని అనిపిస్తుంది.
టెక్నికల్ అంశాలు:
తెలుగు ప్రేక్షకులకు మాస్ మసాలా యాక్షన్ సినిమాలు కొత్తేమీ కాదు. “ది వారియర్” (The Warriorr) చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఫర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమాకు బలాన్ని చేకూర్చిన అంశమేదైనా ఉందంటే, అది సినిమాటోగ్రఫీ మాత్రమే. విజువల్స్ మంచి నాణ్యతతో ఉండి, సినిమాకి అందాన్ని తీసుకొచ్చాయి. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందనే చెప్పాలి. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
రామ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కానీ సగటు ప్రేక్షకుడిని అలరిస్తుందో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
రేటింగ్ : 2.75/5