Panchathantram Review : భావోద్వేగాలు, అనుభవాలను పంచే ‘పంచతంత్రం’ కథలు

Updated on Dec 10, 2022 02:09 PM IST
కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం నటించిన పంచతంత్రం సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది
కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం నటించిన పంచతంత్రం సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది

టైటిల్‌ : పంచతంత్రం

న‌టీన‌టులు : బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్

మ్యూజిక్ డైరెక్టర్ :  ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్

నిర్మాతలు : అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు  

ద‌ర్శక‌త్వం : హర్ష పులిపాక

విడుద‌ల‌ తేదీ : 9-12-2022

రేటింగ్ : 3.5 / 5

కొన్ని క‌థ‌లను కలుపుతూ సినిమాలు చేయ‌డాన్ని ఆంథాలజీ అంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది.  ఓటీటీల్లో ఎక్కువగా ఈ తరహా సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో మాత్రం ఈ ట్రెండ్ కొంచెం తక్కువగా ఉంది. తెలుగులో ‘పంచ‌తంత్రం’ పేరుతో ఒక ఆంథాల‌జీని తెరకెక్కించారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించడంతో  పంచతంత్రం సినిమాపై ఆసక్తి నెలకొంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క‌థ ఏంటంటే : 

ఇర‌వై సంవత్సరాల వ‌య‌సులో కాదు.. అర‌వై ఏళ్ల వయసులో కూడా కెరీర్‌‌ను మొద‌లుపెట్టొచ్చనే ఆలోచ‌న ఉన్న వ్యక్తి వేద వ్యాస్ మూర్తి (బ్రహ్మానందం). కూతురు రోషిణి (స్వాతి)తో క‌లిసి జీవిస్తుంటారు. రిటైర్మెంట్ త‌ర్వాత స్టాండ‌ప్ స్టోరీ టెల్లింగ్ పోటీల‌కు వెళ‌తారు. గట్టి పోటీ ఉన్నప్పటికీ.. త‌న అనుభ‌వంతో క‌థ‌లు చెప్పడం మొద‌లుపెడ‌తారు వేద వ్యాస్‌.  ఆ పోటీల్లో నెగ్గారా? ఆ క‌థ‌ల్లో విహారి (న‌రేష్ అగ‌స్త్య),- సుభాష్ (రాహుల్ విజ‌య్‌), లేఖ (శివాత్మిక రాజశేఖ‌ర్‌), రామ‌నాథం (స‌ముద్రఖ‌ని), ఆయ‌న భార్య మైత్రి (దివ్యవాణి), శేఖ‌ర్ (వికాస్‌), ఆయ‌న భార్య దేవి (దివ్య శ్రీపాద‌), చిత్ర అలియాస్ లియా  (స్వాతి) జీవితాలు ఏం చెప్పాయో అనేది సినిమా కథ.

ఎలా ఉందంటే :

అన్నీ మ‌న క‌థ‌లే అనిపించే ఐదు క‌థ‌లతో ఈ సినిమాను తెరకెక్కించారు. క‌న్నవాళ్లతో, జీవిత భాగ‌స్వామితో, ప్రపంచంత, నీతో నీకుండే క‌థ‌లే అని ట్రైల‌ర్‌లో చెప్పిన‌ట్టుగా ఎక్కడో ఒక చోట ఎవ‌రి జీవితాల్ని వాళ్లకు గుర్తు చేస్తూ సాగే కథలను సినిమాలో చూపించారు. వేద‌వ్యాస్ ప్రపంచం ప‌రిచ‌యమయ్యాక  విహారి క‌థతో పంచ‌తంత్రం క‌థ‌లు మొద‌ల‌వుతాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఒక యువ‌కుడి సంఘ‌ర్షణ‌ని ఈ క‌థ‌తో ఆవిష్కరించారు. సినిమా మొదట్లో స‌న్నివేశాలు నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించినా, మిగ‌తా క‌థ‌ల్లో వేగం క‌నిపించ‌డంతోపాటు భావోద్వేగాలు కూడా బాగా పండాయి. సుభాష్‌, లేఖ పెళ్లి చూపుల క‌థ అందంగా, మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా సాగుతుంది. క్రీడ‌ల‌తో పెళ్లి చూపుల‌ని ముడిపెడుతూ రాసుకున్న సంభాష‌ణ‌లతోపాటు, సుభాష్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌  ఆక‌ట్టుకుంటుంది. త‌న పిల్లల భ‌విష్యత్తు గురించి క‌న్నవాళ్లు మాన‌సికంగా ఎలా స‌త‌మ‌త‌మ‌వుతుంటారో, వాళ్ల జీవితాల్ని అది ఎంతగా ప్రభావితం చేస్తుంటుందో మూడో క‌థ‌తో చెప్పే ప్రయ‌త్నం చేశారు. వాస‌న వాస‌న అంటూ న‌డిచే కొన్ని స‌న్నివేశాలు రిపీటెడ్‌గా అనిపించినా ఈ క‌థ థ్రిల్‌తోపాటు, భావోద్వేగాలను కూడా పంచుతుంది. ఇంటర్వెల్‌ సీన్లు సినిమాపై  ఆస‌క్తిని పెంచుతాయి. నాలుగో క‌థ‌లో ఆవిష్కరించిన శేఖ‌ర్‌, దేవిల ప్రపంచం మ‌రింత హృద్యంగా అనిపిస్తుంది. క‌ష్టాలు ఎన్నైనా రానీ.. వాటిని పంచుకోవాలి కానీ, బంధాల్ని తెంచుకోకూడ‌ద‌నే విష‌యాన్ని భావోద్వేగాల‌తో ఆవిష్కరించారు. ఐదో క‌థ చిత్ర అలియాస్ లియా జీవితం నేప‌థ్యంలో సాగుతుంది. వేద‌వ్యాస్ నా కూతురు లాంటి కూతురు క‌థ అంటూ ఈ క‌థ‌ని చెప్పడం మొద‌లుపెడ‌తాడు. ఈ క‌థ‌లో చిన్నపాప, ఉత్తేజ్‌ పాత్ర కీల‌కం. భావోద్వేగాలు, డ్రామా, రొమాంటిక్ నేప‌థ్యం అన్నీ క‌లిశాయి. మొదటి క‌థ తప్పితే మిగిలిన కథలన్నీ అనుభూతిని, అనుభవాల్నీ పంచుతాయి. రుచి, వాస‌న‌, దృశ్యం, ధ్వని, స్పర్శతో ముడిపెడుతూ తీసిన ఈ ఐదు క‌థ‌ల్ని వేద‌వ్యాస్ జీవితంతోనూ ముడిపెట్టిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

ఎవ‌రెలా నటించారంటే : 

బ్రహ్మానందం అన‌గానే కామెడీనే గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. కానీ ఇందులోని పాత్ర అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వేద‌వ్యాస్ పాత్రలో ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. రెండు కోణాల్లో సాగే క్యారెక్టర్‌‌లో స్వాతి రెడ్డి క‌నిపిస్తారు. రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ న‌ట‌న, వారి పాత్రలు సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌. దివ్య శ్రీపాద - వికాస్, స‌ముద్రఖ‌ని - దివ్యవాణి జోడీ, ఉత్తేజ్‌ న‌ట‌న బాగున్నాయి. న‌రేష్ అగ‌స్త్య, శ్రీవిద్య, ఆద‌ర్శ్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ద‌ర్శకుడు హ‌ర్ష పులిపాక పంచ‌తంత్రం క‌థ‌ల్ని ఎంత ప‌రిణ‌తితో రాసుకున్నారో, అంతే స్పష్టంగా తెర‌పైనా ఆవిష్కరించారు. 

ప్లస్ పాయింట్స్ : భావోద్వేగంతో సాగే కథలు, న‌టీన‌టులు

మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే సన్నివేశాలు

ఒక్క మాటలో : భావోద్వేగాలను పంచే ‘పంచ‌తంత్రం’ క‌థ‌లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!