HBD Suriya: "నెపోటిజం"తో కాదు.. ప్రేక్షకుల మనసులు నెగ్గి ఉత్తమ నటుడైన హీరో సూర్య !
HBD Suriya: కళామతల్లి ముద్దుబిడ్డల్లో సూర్య ఒకరు. తన కళను నమ్ముకోవడమే కాదు.. కళాకారుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లోనూ నటించారు సూర్య (Suriya). తను స్టార్ హీరో అయినప్పటికీ కూడా.. వేరే హీరోల సినిమాల్లో సైతం ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించారు. 'విక్రమ్' సినిమాలో చేసిన రోలెక్స్ సర్ పాత్ర అందుకు గొప్ప ఉదాహరణ.
ఇటీవలే సూర్య నటించిన "ఆకాశమే హద్దురా" చిత్రం ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పలు విభాగాలలో జాతీయ పురస్కారం అందుకొని, దేశం మొత్తాన్ని దక్షిణాది వైపు చూసేలా చేసింది. నటుడుగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా సూర్య సుపరిచితులు. ఆయన సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయన నెపోటిజంతో పైకి రావాలనుకోలేదు.. ప్రజల మనసులు నెగ్గి ఎంతో ఎత్తుకు ఎదిగారు.
ప్రముఖ హీరో కుమారుడే సూర్య
తమిళ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడే సూర్య (Suriya). ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. 1975లో మద్రాస్‌లో సూర్య జన్మించారు. లయోలా కాలేజ్‌లో బీకామ్ వరకు చదివారు. తండ్రి స్టార్ హీరో కావడంతో సూర్యకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. చదువు పూర్తయ్యాక, కొన్నాళ్లు గార్మెంట్స్ కంపెనీలో పనిచేశారు. సూర్య తను ఓ స్థాయికి వచ్చే వరకు శివకుమార్ కుమారుడని ఎవరికీ చెప్పుకోలేదట. నటనపై ప్రేమతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు సూర్య.
HBD Suriya: సూర్యకు పేరు పెట్టిన మణిరత్నం..
‘నెరుక్కునేర్’ అనే తమిళ చిత్రంతో సూర్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సూర్య మొదటి సినిమాను తెరకెక్కించారు. శరవణన్ శివకుమార్ పేరును సూర్యగా మార్చింది మణిరత్నమే. మొదటి సినిమా సూర్యకు హిట్ ఇవ్వలేదు. కానీ సూర్య తానేంటో పరిశ్రమకు నిరూపించాలని అనుకున్నాడు. బాల తెరకెక్కించిన 'నందా'తో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. నందాలో నటనకు గానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి సూర్య అవార్డు అందుకున్నారు.
సూర్య నటించిన తమిళ చిత్రాలు దాదాపుగా తెలుగులో కూడా డబ్ అయి రిలీజ్ అవుతుంటాయి. తెలుగు ప్రేక్షకులకు సూర్య తన నటనతో చాలా దగ్గరయ్యాడు. తెలుగు ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. గజని, ఆరు, యముడు, గ్యాంగ్, ఈటీ, విక్రమ్, సింగం సినిమాలతో టాప్ హీరోగా సూర్య కొనసాగుతున్నారు.
సూర్య హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రల్లో కనిపించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాడే వీడు, విక్రమ్ లాంటి సినిమాలలో సూర్య ప్రత్యేక పాత్రలలో నటించారు. శివపుత్రుడు, సుందరాంగుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్, 24 లాంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు సూర్య. తాజాగా విక్రమ్‌లో 'రోలెక్స్' పాత్ర సూర్యకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.
నిర్మాతగా సూర్య
HBD Suriya: సూర్య తన 36 ఏళ్ళ వయసులోనే సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. మగువలు మాత్రమే, పొన్మగల్ వందాళ్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్, ఓ మై డాగ్ వంటి చిత్రాలకు నిర్మాత సూర్యానే. సూర్య నిర్మించి, నటించిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు లభించాయి.
సూర్య కుటుంబం
సూర్య నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2006 సెప్టెంబర్ 11న జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు.. వారే దియా, దేవ్.
ఓటీటీలో, టీవీ షోలలో సూర్య హవా
ప్రేక్షకులకు వినోదం పంచడమే సూర్య ఆశయం. అందుకనే హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రత్యేక పాత్రల్లో వెండితెరపై కనిపిస్తూ ఉంటారు. నిర్మాతగా కూడా సూర్య రాణిస్తున్నారు. అంతేకాకుండా సూర్య ఓటీటీలో కూడా తన సినిమాలను రిలీజ్ చేసి, తన సత్తా చూపిస్తున్నారు. మణిరత్నం తీసిన 'నవరస' అనే వెబ్ సిరీస్‌లో కూడా సూర్య నటించాడు.
తమిళనాడులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి సూర్య హోస్టుగా వ్యవహరించారు . అలాగే రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా యాక్ట్ చేశాడు. వాటిలో ‘హీరోవా జీరోవా’ ఒకటి. దీనికి సూర్య నిర్మాతగా కూడా వ్యవహరించారు. సూర్యతో పాటు మాధవన్, జ్యోతిక, విజయ్ కూడా ఈ చిన్ని చిత్రంలో నటించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ఈ షార్ట్ ఫిలిమ్ తీశారు.
అదేవిధంగా, గురు, ఘాజీ, పొన్ మగళ్ వందాల్ చిత్రాలకు సూర్య డబ్బింగ్ చెప్పారు. అంతే కాకుండా అన్‌జాన్, పార్టీ, ఆకాశమే నీ హద్దురా చిత్రాలలో పాటలు కూడా పాడి అలరించారు సూర్య.
మానవసేవ మాధవసేవ అంటున్న సూర్య
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకుంటారు సూర్య. అందుకనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎయిడ్స్ అవగాహనకు కృషి చేసే 'ట్యాంకర్ ఫౌండేషన్'కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. 'అగరం ఫౌండేషన్' ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల్ని తన సొంత ఖర్చుతో చదివిస్తున్నారు. టీబీ పేషెంట్స్కు సర్వీస్ చేసే రీచ్ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నారు. మూగజీవాల రక్షణ కోసం కూడా సూర్య తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు.
పుట్టినరోజు పార్టీలు, సెలబ్రేషన్లకు సూర్య దూరంగా ఉంటారు. అలాగే ఎక్కడ ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు సంభవించినా సూర్య సహాయం చేసేందుకు ముందుంటారు.
'బాల' డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా కోసం సూర్య కన్యాకుమారిలో మూడు ఇళ్లు కట్టారు. షూటింగ్ ముగిశాక వాటిని అక్కడి జాలర్లకు ఫ్రీగా ఇచ్చేశారు. తన తండ్రి పేరు మీద ఉన్న 'శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా సూర్య కుటుంబం మొత్తం శ్రీలంకలోని తమిళ చిన్నారుల విద్యకు సహాయం అందిస్తున్నారు.
సమస్యలపై సూర్య పోరాటం
హీరో సూర్య చదువుకొనే విద్యార్థులకు మద్దతుగా ఉంటారు. పిల్లలలోని టాలెంట్‌ను వెలికితీయాలని, అందుకు విద్యా వ్యవస్థ సరిగ్గా పనిచేయాలని ఆయన పలుమార్లు తెలిపారు. ఇటీవలే 'నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ' సరిగ్గా లేదంటూ సూర్య ప్రశ్నించారు. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు
ఉత్తమ నటుడు
భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే జాతీయ అవార్డుకు సూర్య ఎంపికయ్యారు. 2020 సంవత్సరానికి గానూ ఉత్తమ హీరోగా సూర్య జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సూరయై పొట్రు అనే తమిళ చిత్రానికి గానూ ఈ అవార్డు లభించింది. ఈ సినిమా తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' అనే టైటిల్‌తో రిలీజ్ అయింది.