Kamal Haasan Birthday Special : "తకిట తదిమి తందానా" అంటూ నటనకే నడకలు నేర్పిన నటరాజు !

Updated on Nov 07, 2022 05:19 PM IST
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, గాయకుడిగా, .. ఇలా బహుముఖ పాత్రలు పోషించిన ఘనత కమల్ హాసన్‌ (Kamal Haasan)కే సొంతం.
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, గాయకుడిగా, .. ఇలా బహుముఖ పాత్రలు పోషించిన ఘనత కమల్ హాసన్‌ (Kamal Haasan)కే సొంతం.

నటనపై నమ్మకమే కమల్‌ (Kamal Haasan)ను బాల నటుడిగా తమిళ సినిమాకి పరిచయం చేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఆయన భారతదేశంలోనే విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, గాయకుడిగా, వ్యాఖ్యాతగా.. ఇలా బహుముఖ పాత్రలు పోషించిన ఘనత కమల్ హాసన్‌కే సొంతం. కళలంటే కమల్‌కు ఎంతో అభిమానం. అందుకే తన నట విశ్వరూపం చూపించి కళామతల్లి ముద్దుబిడ్డగా సినీ రంగంలో వెలుగొందుతున్నారు.

కమల్ హాసన్ భరతనాట్యంలో చిన్నప్పుడే శిక్షణ తీసుకున్నారు. బాలనటుడిగా సినిమాలలో నటిస్తూనే భరతనాట్యం, సంగీతం, శాస్త్రీయ కళలను అభ్యసించారు. పలు సినిమాలకు నృత్య దర్శకుడిగా కూడా వ్యవహరించారు. తమిళ దర్శకుడు కె. బాలచందర్‌తో కమల్ అనుబంధం ప్రత్యేకమైంది. లోక నాయకుడిగా తన చిత్రాల ద్వారా అభిమానుల గుండెలలో నిలిచిపోయిన కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం మీకోసం.

కమల్ హాసన్‌ (Kamal Haasan)

మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు
‘కలత్తూర్ కన్నమ్మ’ చిత్రంతో బాల నటుడిగా కమల్ హాసన్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డును సాధించారు. 

తమిళ దిగ్గజ నటులు శివాజీగణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేషన్ లాంటి హీరోల సినిమాలలో కమల్ బాల నటుడిగా నటించారు. లెజెండ్ హీరోల నటనను చూస్తూ పెరిగారు కమల్ .

కమల్ హాసన్‌ (Kamal Haasan)

అన్ని భాషల్లో కమలే
1974లో విడుదలైన మలయాళం సినిమా "కన్యాకుమారీ"తో కమల్ హాసన్ మరింత పాపులర్ అయ్యారు. ఈ సినిమా తరువాత తమిళ, తెలుగు, హిందీ సినిమా అవకాశాలను అందుకున్నారు.  

‘మరోచరిత్ర’, ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’,‘శుభ సంకల్పం’.. తెలుగులో కమల్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు. కమల్ హాసన్ నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేవారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు కమల్. 

భారతీయుడు, పుష్పక విమానం, నాయకుడు, పోతురాజు, విచిత్ర సోదరులు, బ్రహ్మచారి, తెనాలి, దశవతారం, సత్యం శివం, ఈనాడు,  విశ్వరూపం.. ఈ సినిమాలలో చాలా వైవిధ్యమైన పాత్రలలో కమల్ నటించారు. 

కమల్ హాసన్‌ (Kamal Haasan)

అంకిత భావం ఉన్న నటుడు
కమల్ హాసన్ (Kamal Haasan) తాను నటించే పాత్రల కోసం మానసికంగా, శారీరకంగా హార్డ్ వర్క్ చేస్తారు. క్యారెక్టర్‌కు తగినట్లు తనను తాను మార్చుకుంటారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే గొప్ప నటుడు కమల్. 
‘దశావతారం’ సినిమాలో పది పాత్రలలో నటించి కమల్ హాసన్ చరిత్ర సృష్టించారు. భారతీయ ఉత్తమ చిత్రాల జాబితాలో కచ్చితంగా కమల్ సినిమాలు కూడా ఉంటాయి. నవరసాలు పండించే నటుడుగా కమల్ హాసన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.  

కమల్ హాసన్‌ (Kamal Haasan)

అవార్డులు
బాల నటుడిగా మొదటి సినిమాతోనే కమల్ జాతీయ అవార్డు అందుకున్నారు. కమల్ మొత్తం నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. 20 ఫిలిమ్ ఫేర్ అవార్డులు సాధించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం అందించే అవార్డు  Ordre des Arts et des Lettres (Chevalier)  అందుకున్న భారతీయ నటుడు కూడా కమలే.

2022లో విడుదలైన కమల్ హాసన్ చిత్రం "విక్రమ్" భారీ విజయాన్ని సాధించింది.  ఈ సినిమా రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో అత్యంత భారీ కలెక్షన్ రాబట్టిన సినిమాగా "విక్రమ్" నిలిచింది. ఈ సినిమాలో కమల్ హాసన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కమల్ హాసన్‌ (Kamal Haasan)

స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న "భారతీయుడు 2" సినిమాలో కమల్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కాంబోలో తెరకెక్కే సినిమా మరో చరిత్ర సృష్టించడం ఖాయం.

కమల్ హాసన్ సినిమాలతో పాటు రాజకీయాలలోనూ కూడా చురుగ్గా ఉంటారు. ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఎప్పటికైనా ప్రజలకు రాజకీయాల ద్వారా సేవ చేయాలన్నదే కమల్ కల.

Read More: తేనెలొలుకు తెలుగు భాషంటే.. విశ్వనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan)కు ఎందుకంత అభిమానమో తెలుసా?

కమల్ హాసన్‌ (Kamal Haasan)

 
 
కమల్ హాసన్  వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 61 ఏళ్ల సినీ జీవితంలో కమల్ సాధించిన రికార్డులు, అవార్డులు ఎన్నో. కమల్ హాసన్ మరిన్ని పాత్రలతో వెండితెరపై వినోదం పంచాలని కోరుకుంటూ.  హ్యాపీ బర్త్ డే లోకనాయకుడా...!
పింక్ విల్లా
 
Advertisement
Credits: Wikipedia

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!