‘కృష్ణంరాజు (Krishnam Raju) గారిని చాలా మిస్ అవుతున్నాను': రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఎమోషనల్ ట్వీట్!
ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మృతిని టాలీవుడ్ ప్రముఖులు, అలాగే ఇతర పరిశ్రమలలో ఆయనను అభిమానించేవారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి.. ప్రభాస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఇక సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు (Krishnam Raju) పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ నుంచి మొయినాబాద్‌లోని కనకమామిడిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ వరకు అధికార లాంఛనాలతో తీసుకెళ్లారు. ఈ అంత్యక్రియలలో భాగంగా, ప్రభాస్ అన్న ప్రభోద్ కృష్ణంరాజు పార్థివ దేహానికి తలకొరివి పెట్టడంతో కార్యక్రమం ముగిసింది. ఇక, కృష్ణంరాజుకి తుదివీడ్కోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు.
తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. కృష్ణంరాజు, ప్రభాస్ (Prabhas) ప్రధాన తారాగణంగా లారెన్స్ గతంలో 'రెబల్' (Rebel Movie) చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 'రెబల్' సినిమా షూటింగ్ సమయంలో కృష్ణంరాజు ఇచ్చిన ఆతిథ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఎమోషనల్ అయ్యాడు లారెన్స్.
ప్రభాస్, కృష్ణంరాజులతో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకుంటూ.. లారెన్స్ (Raghava Lawrence) ఈ రోజు భావోద్వేగభరితమైన ప్రకటనను విడుదల చేశారు. ‘కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నాను. ఆయన సెట్‌లో ఉంటే, ప్రతి ఒక్కరిని తన పిల్లల మాదిరిగానే చూసుకుంటారు. అలాగే మా పట్ల చాలా కేర్ తీసుకునేవారు. అందరి ఆలనా పాలనా చూసుకునేవారు. సెట్‌లో ప్రతి ఒక్కరూ తిన్నారా లేదా? అనే విషయాన్ని ప్రత్యేకంగా గమనించేవారు. తినని వారికి కన్నతల్లి మాదిరి కొసరి కొసరి తినిపించేవారు’ అంటూ ఆయనతో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు లారెన్స్.
'కృష్ణంరాజు (Krishnam Raju) గారి ప్రేమను, కేర్‌ను మిస్ అవుతున్నా. నేను నగరంలో లేకపోవడం వల్ల ఆయనకు వీడ్కోలు పలకలేకపోవడం నా దురదృష్టం. ఆయన వారసత్వం ప్రభాస్ (Prabhas) ద్వారా ఎల్లపుడూ కొనసాగుతుంది' అంటూ రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.