HBD Vijaya Shanthi: విజయశాంతి బర్త్ డే స్పెషల్ .. స్వయంకృషితో విజేతగా నిలిచిన మన 'రాములమ్మ' !
టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి (Vijaya Shanthi). విజయశాంతి టాప్ హీరోలతో పోటీగా నటించడమే కాకుండా.. రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో అందుకున్నారు. కథానాయకురాలిగా ఎన్నో పాత్రలలో నటించారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి, విజయశాంతి ఓ చరిత్రనే సృష్టించారు.
'కర్తవ్యం' చిత్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విజయశాంతి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 'ఓసేయ్ రాములమ్మ' చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ అనే బిరుదు దక్కించుకున్న ఘనత విజయశాంతికే దక్కింది . గ్లామర్ పాత్రలు చేయడమే కాకుండా, యాక్షన్ హీరోయిన్‌గా కూడా సక్సెస్ సాధించిన విజయశాంతి బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరి మీకోసం.
బాల్యం
విజయశాంతి 1964 జూన్ 24న వరంగల్‌లో జన్మించారు. విజయశాంతి అసలు పేరు శాంతి. విజయశాంతి పిన్ని విజయలలిత తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలలో నటించారు. పిన్ని పేరులోని విజయను తన పేరులో చేర్చుకుని.. విజయశాంతిగా మారిన శాంతి అనే అమ్మాయి తర్వాత తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు.
సినిమా జీవితం
విజయశాంతి 1979లో విడుదల అయిన 'కల్లుక్కుళ్ ఈరమ్'తో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'కిలాడీ కృష్ణుడు' సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి మొదట్లో తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. 'నేటి భారతం' సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‌గా కొనసాగారు.
అగ్నిపర్వతం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, స్వయం కృషి, మువ్వగోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, పడమటి సంధ్యారాగం, శత్రువు, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి సినిమాలతో విజయశాంతి (Vijaya Shanthi) స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు.
అదరగొట్టే డాన్సులు
చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, సుమన్, భానుచందర్, కృష్ణ, రాజశేఖర్ వంటి హీరోలతో విజయశాంతి వేసే స్టెప్పులు ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవితో విజయశాంతి వేసే బ్రేక్ డాన్సులకు అప్పట్లో భలే క్రేజ్ ఉండేది. విజయశాంతి సెట్స్‌లో చాలా చాలా యాక్టివ్‌గా ఉంటారట. ముఖ్యంగా పాటల చిత్రీకరణ టైంలో ఎంతో ఎనర్జీగా ఉండేవారట.
డైలాగ్ క్వీన్
విజయశాంతి డైలాగుల్లో పంచ్ పవర్ ఉంటుంది. అప్పట్లో హీరోలకు పోటీగా విజయశాంతి పాత్రలు ఉండేవి. సినిమాలలో హీరోలకు లేదా విలన్లకు కౌంటర్ ఇస్తూ, విజయశాంతి చెప్పే డైలాగులు థియేటర్లలో చప్పట్లు మోగించేవి. విజయశాంతి నటనలో ఓ ధైర్యం కనిపిస్తుంది. కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాల్లో విజయశాంతి చెప్పిన డైలాగులకు థియేటర్లు షేక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్ విజయశాంతి అని చెప్పడం అతిశయోక్తి కాదు.
జాతీయ అవార్డు అందుకున్న విజయశాంతి
'కర్తవ్యం' సినిమాలో విజయశాంతి నటనను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా 'కర్తవ్యం' సినిమాలో విజయశాంతి నటన ఓ అద్భుతం. ఈ సినిమా చూసి ప్రేరణను పొంది, పోలీస్ రంగంలోకి వచ్చిన అమ్మాయిలెందరో. ప్రముఖ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవిత కథ ప్రేరణతో 'కర్తవ్యం' సినిమా తెరకెక్కింది అంటారు. 'కర్తవ్యం' చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు విజయశాంతి.
దక్షిణ భారత దేశంలో విజయశాంతి చాలా ఏళ్లు సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగారు. జాతీయ అవార్డుతో పాటు ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్న హీరోయిన్ విజయశాంతి. 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందారు. నాలుగు సార్లు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకున్నారు.
చిరంజీవితో కలిసి విజయశాంతి నటించిన 'స్వయంకృషి' చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. అలాగే హాలీవుడ్ నటుడు థామస్ జనెతో కలిసి నటించిన 'పడమటి' సంధ్యారాగం చిత్రాన్ని లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
హీరోలతో సమానంగా పారితోషికం
విజయశాంతి టాప్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకునేవారు. హీరోలతో పోటీ పడి మరీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఏకైక హీరోయిన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 'కర్తవ్యం' సినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకున్నారట.
బాలీవుడ్ ఎంట్రీ.. నిర్మాతగా మారిన విజయశాంతి
విజయశాంతి, అనిల్ కపూర్ జంటగా 'స్వాతి ముత్యం' సినిమాని హిందీలో రీమేక్ చేశారు. 'ఈశ్వర్' టైటిల్‌తో ఈ సినిమా రిలీజ్ అయింది. అలాగే కర్తవ్యం హిందీ రీమేక్ 'తేజస్విని' లో కూడా విజయశాంతి తన పాత్రను తానే పోషించారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. విజయశాంతి సౌత్‌తో పాటు, నార్త్ ఇండియాలో కూడా పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు.
తలైవా ఫ్యాన్స్‌ను మెప్పించిన విజయశాంతి
రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ సినిమాలో రజనీకాంత్‌ను కొట్టే పాత్రలో విజయశాంతి నటించారు. 'మన్నన్' సినిమాలో రజనీకాంత్‌ను చెంపదెబ్బ కొట్టే సీన్‌లో విజయశాంతి నటించి మెప్పించారు. రజనీకాంత్ అభిమానులు తమ హీరోపై ఈగ వాలితేనే సహించరు.. కానీ విజయశాంతి కొడితే ఏం చేస్తారనే టెన్షన్ మేకర్స్‌లో ఉంది. కానీ విజయశాంతి నటనకు 'తలైవా' అభిమానులు కూడా జై కొట్టారు. సౌత్‌లో విజయశాంతి తన యాక్టింగ్ టాలెంట్‌తో, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
రాజకీయ జీవితం
విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎంపీ అయ్యారు. కొన్ని కారణాలతో ఆ పార్టీ విజయశాంతిని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం విజయశాంతి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.
సినిమా రీ ఎంట్రీ
మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో విజయశాంతి మళ్లీ సినీ పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. విజయశాంతి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించి మెప్పించారు. విజయశాంతి మరిన్ని సినిమాలలో వెండితెరపై కనిపించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం రాములమ్మ తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రాజకీయ నాయకురాలుగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విజయశాంతి సక్సెస్ ఫుల్ కావాలని పింక్ విల్లా కోరుకుంటుంది.