Father & Son Duo : వెండితెర 'విచిత్రాలు'.. టాలీవుడ్ 'స్క్రీన్' పై కలిసి నటించిన తండ్రీ కొడుకులు వీరే !
టాలీవుడ్‌లో తండ్రి హీరో అయితే, కొడుకు కూడా అదే బాటలో పయనించి విజయాన్ని సాధించిన ఘట్టాలు చాలా ఉన్నాయి. సినీ నటుల వారసులు కూడా సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సందర్భాలు అనేకం. తండ్రి, కొడుకులిద్దరూ నటులైతే ఆ కిక్కే వేరు. ఒకరి నటన గురించి మరొకరు వీలున్నప్పుడల్లా ప్రస్తావించుకొనే అవకాశం దక్కుతుంది. ఒకరిపై మరొకరు సునిశిత విమర్శలూ చేసుకోవచ్చు.
ఇక, నటులుగా రాణించిన తండ్రీ, కొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తే.. ఇంకేమైనా ఉందా? అభిమానులకు పండగే కదా ! అలా ఒకే సినిమాలో తండ్రీ, కొడుకులిద్దరు నటించిన సందర్భాల గురించి ఈ రోజు మీకు ప్రత్యేకం !
సీనియర్ ఎన్టీఆర్ (NTR) తన కుమారుడు నందమూరి బాలకృష్ణతో (Bala Krishna) కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.అన్నదమ్ముల అనుబంధం, అనురాగదేవత, అక్బర్ సలీం అనార్కలి, దానవీరశూర కర్ణ, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి మహాత్యం లాంటివి అందులో ప్రముఖమైనవి.
ఇద్దరూ ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, మనం లాంటి సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), ఆయన తనయుడు నాగార్జున (Nagarjuna) కలిసి నటించారు. 'మనం ' సినిమాలో అయితే, దాదాపు ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలు నటులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించారు.
కృష్ణ తన కుమారుడు మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. మహేష్ బాలనటుడిగా ఉన్నప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం చిత్రం పెద్ద హిట్. అలాగే మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా 'వంశీ ' అనే చిత్రంలో కృష్ణ నటించారు.
మహేష్ బాబు కూడా తన కుమారుడు గౌతమ్‌తో కలిసి 'నేనొక్కడినే ' చిత్రంలో నటించారు.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) 'తక్దీర్ వాలా ' పేరుతో ఓ హిందీ సినిమా చేశారు. ఈ చిత్రం యమలీల చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో వెంకీ తండ్రిగా స్వయానా నిర్మాత రామానాయుడు నటించడం విశేషం.
మంచు మోహన్ బాబు తన కుమారులు విష్ణు, మనోజ్‌లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఇక 'పాండవులు పాండవులు తుమ్మెద ' సినిమాలో వీరు ముగ్గురూ కలిసి నటించారు.
దక్షిణ చిత్ర పరిశ్రమలో డైలాగ్ కింగ్‌గా సాయికుమార్ (Sai Kumar) చాలా సుపరిచితులు. ఈయన తన తనయుడు ఆదితో కలిసి 'చుట్టాలబ్బాయి' చిత్రంలో నటించారు.
బ్రహ్మానందం ఎంత పాపులర్ కమెడియనో మనకు తెలియంది కాదు. ఈయన కుమారుడు గౌతమ్ హీరోగా తెరకెక్కిన 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాలో.. బ్రహ్మీ కూడా ఓ కీలక పాత్రలో నటించారు.
(ఇక, తండ్రీ కూతుళ్లు ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే నాగబాబు తన కుమార్తె నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. ఆ సిరీస్ పేరు నాన్న కూచి)
చిరంజీవి ఇటీవలే ఆచార్య చిత్రంలో.. తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించారు. అయితే, ఈ చిత్రం అభిమానులు ఆశించినంత విజయాన్ని నమోదు చేయలేదు.
హిట్, ఫ్లాప్ విషయాలను పక్కనే.. ఇలాంటి కాంబినేషన్లు మాత్రం అభిమానులకు పండగ వాతావరణాన్ని చూపిస్తాయనడంలో సందేహమే లేదు. ఒక చిత్రంలో ఇద్దరు హీరోలు.. అదీ తండ్రీ, కొడుకులైతే ఈ కిక్కే వేరు కదా !