Ponniyin Selvan: 'రాణి నందిని దేవి'గా మాజీ ప్రపంచ సుందరి .. పవర్‌ఫుల్ పాత్రలో ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai)!
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్ ' సినిమాకి సంబంధించి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (AishwaryaRaiBachchan) పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. హీరో విక్రమ్ ఈ సినిమాలో చోళ రాజుగా నటిస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వన్ ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. విడుదలకు రెండు నెలల ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు.
'పొన్నియిన్ సెల్వన్ ' చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ ప్రాచీన నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్ ' తెరకెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆసక్తికరంగా పోస్టర్లు
విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ .. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశాక, రాణి పాత్రలో నటిస్తున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ (AishwaryaRaiBachchan) రాణి నందిని దేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ రాణి పాత్రలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎంతో ఠీవిగా, దర్పంగా, అందంగా తన అభిమానులకు కనువిందు చేశారు. అలాగే ఈ చిత్రంలో చోళ కిరీట యువరాజు పాత్రను పోషిస్తున్న విక్రమ్ లుక్‌ను మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు.
చోళ రాజుల కథ
10వ శతాబ్దపు చోళ రాజుల కథలను ఆధారంగా చేసుకొని 'పొన్నియిన్ సెల్వన్ ' చిత్రాన్ని మణిరత్నం నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో 'పొన్నియిన్ సెల్వన్ ' చిత్ర ప్రమోషన్లను సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే, ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ల పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. భారతీయ సినీ రంగంలో ' పొన్నియిన్ సెల్వన్ ' చిత్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కే రీతిలో ఈ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. 'పొన్నియన్ సెల్వన్ ' అనే నవలను ప్రముఖ రచయిత కల్కి రాశారు. ఈ సినిమాను మణి రత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం
'స్లమ్ డాగ్ మిలీనియర్' చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఈ సంగీతమే ప్రత్యేక ఆకర్షణ కానుంది. 'పొన్నియిన్ సెల్వన్ ' సినిమాకు ప్రధానంగా మ్యూజిక్ ప్లస్ పాయింట్ కానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళీ భాషల్లో విడుదల కానుంది.
ఓటీటీ బిజినెస్ ఎంతంటే?
'పొన్నియిన్ సెల్వన్ ' చిత్రానికి ఓటీటీలో డిమాండ్ ఉంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను అన్ని భాషల్లో కలిపి రూ. 125 కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసింది. 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి ఎస్.రవి వర్మన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
Read More : హాలీవుడ్‌లో ఉత్తమ చిత్రంగా రెండో స్థానంలో నిలిచిన ఆర్.ఆర్.ఆర్. (RRR)