Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్' లాంటి కథలు అనేకం.. భారతదేశ చరిత్ర గొప్పది - చియాన్ విక్రమ్
ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) చిత్రం సెప్టెంబర్ 30 తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను చోళ రాజుల గురించిన అనేక విషయాలతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. పలు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను మేకర్స్ నిర్వహిస్తోంది. ప్రమోషన్లలో భాగంగా 'పొన్నియిన్ సెల్వన్' నటీనటులు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ఈవెంట్‌లో నటుడు చియాన్ విక్రమ్ చోళుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్‌కు గొప్ప చరిత్ర ఉంది - విక్రమ్
మన దేశ చోళ రాజులు టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎన్నో డ్యామ్‌లను కట్టారని చియాన్ విక్రమ్ అన్నారు. అంతేకాకుండా ఎన్నో దేవాలయాలను అద్భుతంగా నిర్మించారన్నారు. చోళ రాజుల కాలంలో పరిపాలన గురించి విక్రమ్ అనేక విషయాలను తెలిపారు. భారతదేశంలో 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan 1) లాంటి కథలు అనేకమన్నారు.
చరిత్ర గురించిన అంశాలను మణిరత్నం వెండితెరపై చూపించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కథలు భారత్‌లో ఏ ప్రాంతానికి చెందినవి అనేది ముఖ్యం కాదని.. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని ప్రతీ ఒక్కరికి తెలిసేలా చేస్తాయని విక్రమ్ అభిప్రాయపడ్డారు. భారతీయుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు చియాన్ విక్రమ్.
ఏ పాత్రలో ఎవరు
ఆదిత్య కరికాలన్ రాజు పాత్రలో చియాన్ విక్రమ్ నటించారు. యోధ యువరాజు వల్లవరైయన్ వంతీయతేవన్ పాత్రలో కార్తీ, రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ నటించారు. చోళ యువరాణి కుందవై పిరత్తియార్ పాత్రలో త్రిష కనిపించారు. రాజ రాజ చోళగా పొన్నియన్ సెల్వన్ గౌరవం అందుకున్నారు. జయం రవి అరుల్మొళి వర్మన్ (పొన్నియన్ సెల్వన్) పాత్రను పోషించారు.
'పొన్నియిన్ సెల్వన్ ' సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ ప్రాచీన నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్ ' తెరకెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.