కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) త్రీడీ చిత్రం!

Updated on Oct 15, 2022 04:12 PM IST
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న కొత్త చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న కొత్త చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం

భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అరుదైన నటుల్లో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ఒకరు. విలక్షణమైన పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఏ రోల్‌లోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేసి, ఆడియెన్స్‌ను మెప్పించడం విక్రమ్ స్పెషాలిటీ. అందుకే ఆయన ఎంచుకునే క్యారెక్టర్లు, కథలు కూడా విభిన్నంగా ఉంటాయి. ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని విక్రమ్ భావిస్తారు. అందుకే ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘విలన్’, ‘ఐ’, ‘నాన్న’ లాంటి సినిమాలు చేశారాయన. ఇక, విక్రమ్ రీసెంట్‌గా ‘కోబ్రా’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వీటిలో ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమా బంపర్ హిట్ కొట్టింది. తమిళ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచి.. ఇంకా సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. 

ఇకపోతే, చియాన్ విక్రమ్ మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ఆయన తాజా చిత్రానికి సంబంధించిన టెస్ట్ షూట్‌ను బుధవారం చెన్నైలో ప్రారంభించారు. విక్రమ్ నటిస్తున్న ఈ 61వ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తుండటం విశేషం. అయితే ఈ మూవీకి సంబంధించిన కథా నేపథ్యం హాట్ టాపిక్‌గా మారింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో దీన్ని తీయబోతుండటమే అందుకు కారణంగా చెప్పాలి. 

పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్

విక్రమ్ తాజా సినిమాను 1800 సంవత్సరానికి చెందిన పీరియడ్ డ్రామాగా పా రంజిత్ తెరకెక్కిస్తున్నారట. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తీస్తున్నారని.. పాన్ ఇండియా మూవీగా దీని రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేగాక, ఈ సినిమాను త్రీడీలో తీస్తున్నారని వినికిడి. తన గత చిత్రాల మాదిరిగానే సామాజిక అంశాల మేళవింపుతో పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ల పాత్రలను బలంగా, ప్రభావవంతంగా రాసుకున్నట్లు సమాచారం. అతి త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అప్పుడు సినిమాకు  సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తారట.

ఇక, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యాన్ని ‘కేజీఎఫ్’ చిత్రంలో చూశాం. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. కోలార్‌ నగరానికి దాదాపు 30 కిలోమీటర్లు, రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఉన్నాయి. సుమారు వంద సంవత్సరాలపాటు ఈ ప్రాంతంలో బంగారం కోసం తవ్వకాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. వరుసగా తవ్వకాలు జరపడం, ఏళ్లు గడిచేకొద్దీ బంగారు గనులు అంతరించిపోవడంతో 2001 నుంచి ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. 

Read more: దళపతి విజయ్‌తో కలిసి నటిస్తా.. ఆ దర్శకుడితో అయితేనే అంటూ సంచలన కామెంట్స్ చేసిన చియాన్ విక్రమ్ (Vikram Chiyaan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!