Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో నటించడం గర్వంగా ఉంది : ఐశ్వర్యరాయ్ (AishwaryaRai)
Ponniyin Selvan 1: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం సెప్టెంబర్ 30 తేదీన విడుదల కానుంది. దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు ఈ సినిమా అని మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (AishwaryaRai) అన్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ రాణి నందిని దేవి పాత్రలో నటించారు. 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ వేడుకలను పలు రాష్ట్రాలలో మేకర్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్యరాయ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మెరిసిన ఐశ్వర్య
ఐశ్వర్యరాయ్ బచ్చన్ (AishwaryaRai) రెడ్ కలర్ డ్రెస్‌లో 'పొన్నియిన్ సెల్వన్' తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ వేడుకలకు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అంటూ ఐశ్వర్యరాయ్ ప్రేక్షకులను పలకరించారు. 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం గర్వంగా ఉందని తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం శ్రమించారన్నారు. టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఐశ్వర్యరాయ్ తెలిపారు.
గర్వంగా ఉంది - ఐశ్వర్యరాయ్ (AishwaryaRai)
'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) సినిమా దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు అని ఐశ్వర్యరాయ్ చెప్పారు. వెండితెరపై 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ఓ అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తుందన్నారు. తాము పడిన కష్టం ఫలించాలంటే.. అందరూ ఈ సినిమాను చూసి ఆనందించాలన్నారు. ఈ సినిమా కారణంగా మణిరత్నం కుటుంబంతో మరింత అనుబంధం ఏర్పడిందన్నారు. గతంలో తన సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఎ.ఆర్.రెహమాన్ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకు కూడా మ్యూజిక్ అందించడం సంతోషం కలిగించిందన్నారు.
'పొన్నియిన్ సెల్వన్ ' సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ ప్రాచీన నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్ ' తెరకెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.