Trisha Krishnan: రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయబోతున్న హీరోయిన్ త్రిష.. హీరో విజయ్ (Vijay) ప్రోత్సాహంతోనేనా?
దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన.. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారా..? ప్రస్తుతం ఈ హీరోయిన్ దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారా?.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయాత్తమవుతున్నారా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ (Hero Vijay) సూచన మేరకు ఆమె రాజకీయాల్లో వస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో త్రిష ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
'మౌనం పేసియదే' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన త్రిష (Heroine Trisha) ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అగ్రకథానాయికగా రాణిస్తోంది. 39ఏళ్ల వయసులోనూ హీరోయిన్ గా నటిస్తున్న త్రిష సినీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాలు. జయాపజయాలకు అతీతంగా ఈమెకు అవకాశాలు వరిస్తునే ఉన్నాయి.
త్రిష ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Dirrector Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం 'పొన్నియిన్ సెల్వం' చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్ర తొలిభాగం సెప్టెంబర్ 30వ తేదీన తెరపై రావడానికి ముస్తాబవుతోంది.
ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ (Kamal Haasan), నెపోలియన్, ఉదయనిధి స్టాలిన్, విశాల్, ఖుష్బూ, సీమాన్.. ఇలా చాలామంది నటులు తమిళ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. తాజాగా అదే జాబితాలో నటి త్రిష కూడా చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్రిష (Heroine Trisha) నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇటు కాంగ్రెస్ నేతలు సైతం దీనిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.