Superstar Krishna: ముగిసిన సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో వీడ్కోలు పలికిన అభిమానులు

Updated on Nov 16, 2022 05:17 PM IST
కృష్ణ (Superstar Krishna) కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే అంతిమ సంస్కారాలకు అనుమతించారు
కృష్ణ (Superstar Krishna) కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే అంతిమ సంస్కారాలకు అనుమతించారు

సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రేక్షకులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిపింది. గౌరవ వందనం తర్వాత పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. 

కృష్ణ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు వేలాది సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర సాగింది. ఇక కృష్ణ కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే అంతిమ సంస్కారాలకు అనుమతించారు. 

కృష్ణ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు

ఇకపోతే, సూపర్‌స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. ‘కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్‌ చేశాం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించాం. వచ్చినప్పటి నుంచే ఆయన హెల్త్ కండీషన్ విషమంగా ఉంది. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్‌ అవసరం ఏర్పడటంతో అది కూడా చేశాం. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని, వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం’ అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

ఇక, కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మన అల్లూరి, మన జేమ్స్ బాండ్ అయిన కృష్ణ గారి మరణం తెలుగు వారికి తీరనిలోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇది మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతితో తన గుండె ముక్కలైందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మాటల్లో వర్ణించలేమని చెప్పారు. కృష్ణ నిజమైన సూపర్‌స్టార్ అని బన్నీ పేర్కొన్నారు. 

Read more: Aamir Khan: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అనూహ్య నిర్ణయం.. సినిమాలకు బాలీవుడ్ స్టార్ హీరో బిక్ బ్రేక్..! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!