ప్రభుత్వ లాంఛనాలతో సూపర్‌స్టార్ కృష్ణ (Ghattamaneni Krishna) అంత్యక్రియలు : వెల్లడించిన సీఎం కేసీఆర్
సీనియర్ హీరో, మహేష్‌బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ (Ghattamaneni Krishna) కన్నుమూశారు. ఆదివారం అర్థరాత్రి తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా కృష్ణ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి.
కాగా, కృష్ణ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటనతో సినీ రంగానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తూ పలువురు ట్వీట్లు పెడుతున్నారు. అలాగే, కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి, ఆయన చిన్న కొడుకు మహేష్‌బాబును, కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
ఇండస్ట్రీకి తీరని లోటు..
ఇక, కృష్ణ మృతి చెందడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌లో వెల్లడించింది.
బుధవారం మధ్యాహ్నం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం మంగళవారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నట్టు వెల్లడించారు. రేపు ఉదయం పద్మాలయా స్డూడియోస్‌కు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కృష్ణ (Ghattamaneni Krishna) సోదరుడు ఆదిశేషగిరిరావు చెప్పారు.
Read More : రేపే సూపర్‌స్టార్ కృష్ణ (SuperStar Krishna) అంత్యక్రియలు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కీలక ప్రకటన